Local Elections: కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు
ABN, Publish Date - Aug 19 , 2024 | 02:55 AM
కులగణన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
హైదరాబాద్‌లో పాపన్న విగ్రహం: భట్టి విక్రమార్క
సర్వాయిపేట అభివృద్ధికి రూ. 4.7కోట్లు మంజూరు
రవీంద్రభారతి, ములుగు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కులగణన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న స్వస్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.4.7 కోట్లు మంజూరు చేశామని, హైదరాబాద్‌లో పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు రవీంద్ర భారతీలో ఆదివారం జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమంలో మంత్రులు భట్టి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
పాపన్న చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రభుత్వం పాపన్న జయంతి వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. పాపన్న జీవిత చరిత్రను ప్రచారం చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ ప్రణాళికలు రూపొందిస్తే తక్షణమే ఆమోదిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో పాపన్న విగ్రహ ఏర్పాటు బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. పాపన్న గౌడ్ ఆలోచనలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తన సందేశాన్ని పంపారని చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం పోరాడిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఇక, ములుగు కలెక్టరేట్‌లో జరిగిన పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేశారు. ఇక, టీపీసీసీ కల్లుగీత కార్మిక విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లోనూ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
కాగా సర్వాయి పాపన్న స్వగ్రామం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూ.4.7కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడు తూ గౌడన్నల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.
Updated Date - Aug 19 , 2024 | 02:55 AM