Share News

Madhavaram Krishna Rao: పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం

ABN , Publish Date - Aug 27 , 2024 | 03:37 AM

చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే, హైడ్రా పేరుతో చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారికి ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని కూకట్‌పల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Madhavaram Krishna Rao: పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోం

  • వారికి న్యాయం ఎలా చేస్తారో చెప్పాలి

  • హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నా:ఎమ్మెల్యే మాధవరం

హైదర్‌నగర్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే, హైడ్రా పేరుతో చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారికి ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని కూకట్‌పల్లి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఉన్న నిర్మాణాలను తొలగించటమే కాకుండా నాలాల ఆక్రమణలపైనా హైడ్రా దృష్టి పెట్టాలని సూచించారు. నగరంలో అనేక మంది నిర్మాణ అనుమతులను చూసుకున్నాకే ఇళ్లను కొనుగోలు చేశారని.. కొన్ని నిర్మాణాలు చెరువులో ఉన్నాయని ఇటీవల తేలడంతో.. వారంతా ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.


గృహాలను కొనుగోలు చేసిన వారిలో పేద, మధ్య తరగతి, చిరుద్యోగులు ఉన్నారని.. వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కూకట్‌పల్లి మైసమ్మ చెరువులో ఉన్న శ్మశాన వాటికకు, బోయినపల్లిలో చెరువు వద్ద 40 ఏళ్లుగా ఉన్న మందిరానికి సైతం అధికారులు నోటీసులు అందజేయడం శోచనీయమన్నారు. మైసమ్మ చెరువులో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే పేదలకు పట్టాలు ఇచ్చిందని.. దీంతో వారు రాజీవ్‌గాంధీనగర్‌ పేరుతో బస్తీ ఏర్పాటు చేసుకుని ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని తెలిపారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చెరువులు, నాలాల పరిరక్షణకు ఓ నోడల్‌ అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - Aug 27 , 2024 | 03:37 AM