Jayashankar Bhupalpally: మావోయిస్టుల మందుపాతరకు అమాయకుడు బలి!
ABN, Publish Date - Jun 04 , 2024 | 02:59 AM
అడవిలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు.. కట్టెల కోసం వెళ్లిన ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ సంఘటన ములుగు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వాజేడు మండలంలోని జగన్నాథపురానికి చెందిన ఇల్లెందుల ఏసు (55) తన కుమారుడు రమేశ్, మరో ముగ్గురితో కలిసి కట్టెల కోసమని కొంగాల అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు.
కట్టెల కోసం వెళ్లిన వ్యక్తి మృతి.. కొడుక్కి గాయాలు వాజేడులో ఘటన
తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు
వాజేడు, జూన్ 3: అడవిలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు.. కట్టెల కోసం వెళ్లిన ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ సంఘటన ములుగు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వాజేడు మండలంలోని జగన్నాథపురానికి చెందిన ఇల్లెందుల ఏసు (55) తన కుమారుడు రమేశ్, మరో ముగ్గురితో కలిసి కట్టెల కోసమని కొంగాల అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. వారు మూలగండి గుట్ట ఎక్కుతుండగా ఏసు మందుపాతరపై కాలేయడంతో అది పేలి అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనున్న అతడి కుమారుడు రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై పోలీసులకు సమాచారమిచ్చినా.. మావోయిస్టులు ఇంకా ఏమైనా మందుపాతరలు అమర్చి ఉండొచ్చన్న అనుమానంతో వారు ఘటనా స్థలానికి రాలేదు. కుటుంబ సభ్యులు, స్థానికులే గుట్టపై నుంచి ఏసు మృతదేహాన్ని కిందకు తీసుకొచ్చారు. ఆఈ ఘటనపై కేసులు నమోదు చేశామని ములుగు ఎస్పీ శబరీశ్ ఓ ప్రకటనలో తెలిపారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతరలకు అమాయకులు బలవుతున్నారని.. మావోలకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Updated Date - Jun 04 , 2024 | 02:59 AM