Siddipet: కాపీ కొడుతున్నాడని మందలించిన ప్రిన్సిపల్.. విద్యార్థి ఏం చేశాడంటే..
ABN, Publish Date - Oct 26 , 2024 | 10:40 AM
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్ గూడెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మనోజ్.. చేర్యాల మండల కేంద్రంలోని వికాస్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు.
సిద్దిపేట: తప్పు చేశాడని ప్రిన్సిపల్ కొట్టడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరి ముందూ తనపై చేయి చేసుకోవడం అవమానంగా భావించాడు. ఒంటరిగా పిలిచి మందలించకుండా తోటి విద్యార్థుల ముందే కొట్టారని అవమాన భారంతో కుంగిపోయాడు. నలుగురి ఎదుట నవ్వుల పాలయ్యానని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చాడు. ఇక ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శభాష్ గూడెంలో దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మనోజ్.. చేర్యాల మండల కేంద్రంలోని వికాస్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే పాఠశాలలో శుక్రవారం నాడు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు సరిగా చదవని మనోజ్ కాపీ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ అతడిని పట్టుకున్నారు. అనంతరం విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్‌కు ఇన్విజిలేటర్ తెలియజేశారు. అయితే విద్యార్థి మనోజ్‌ని ఒంటరిగా పిలిచి మందలించని ప్రధానోపాధ్యాయుడు నేరుగా పరీక్ష గదిలోకి వచ్చారు. తోటి విద్యార్థుల ముందే తిట్టి, చేయి చేసుకున్నారు.
ఈ విషయాన్ని మనోజ్ తీవ్ర అవమానంగా భావించాడు. అందరి ముందూ తన పరువు పోయిందని ఆవేదనకు గురయ్యాడు. దీంతో సాయంత్రం ఇంటికి వచ్చిన బాలుడు జరిగిన విషయాన్ని తలచుకుని కుమిలిపోయాడు. తిరిగి పాఠశాలకు వెళ్తే అందరూ తనను చులకనగా చూస్తారని భావించాడు. క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు చేరుకుని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తూ బావి వద్దకు చేరుకున్నారు. రోజూ హుషారుగా తిరిగే కుమారుడు విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Telangana: కలెక్టర్ ఏం చేస్తోంది.. భర్త పక్కన పడుకుందా.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
HYDRA: నాన్‌స్టాప్ కూల్చివేతలు.. ఎన్నో ఆరోపణలు.. హైడ్రా వంద రోజుల ప్రయాణం ఇదీ
Updated Date - Oct 26 , 2024 | 10:41 AM