Bandi Sanjay: జీవో 29ని రద్దు చేయండి..
ABN, Publish Date - Oct 21 , 2024 | 03:14 AM
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన 29 జీవోను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1 పరీక్షను వెంటనే రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.
దాని వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర నష్టం
గ్రూప్-1 పరీక్షను రీ షెడ్యూల్ చేయాలి
సీఎంకు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
మెయిన్స్‌ను వాయిదా వేయకపోతే
రాష్ట్రాన్ని దిగ్బంధిస్తాం: ఆర్.కృష్ణయ్య
జీవో 29తో అన్యాయం జరగదు.. బీసీ బిడ్డగా
నేను భరోసా ఇస్తున్నా: మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన 29 జీవోను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1 పరీక్షను వెంటనే రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కొనసాగింపుపైనా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. గ్రూప్-1 అభ్యర్థులు పడుతున్న తీవ్రమైన ఆందోళనకు ముగింపు పలకాలని విజప్తి చేశారు. ఈ మేరకు సంజయ్ ఆదివారం సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. దీని వల్ల 5,003 మంది రిజర్వ్‌డ్ క్యాటగిరీ అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు.
ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని అన్నారు. జీవో 29 వల్ల దాదాపు 30 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు మెయిన్స్ పరీక్షకు దూరమయ్యారని సంజయ్ వివరించారు. కాగా, తెలంగాణలో రిజర్వేషన్ల ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. గ్రూప్ 1 పరీక్షల కోసం తెచ్చిన జీవో 29 అందుకు సంకేతమని అన్నారు. ఓపెన్ క్యాటగిరీలో మెరిట్‌తో వచ్చే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యర్థులకు జీవో 29 వల్ల నష్టం జరుగుతుందని అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్ వచ్చి అరచేతిలో వైకుంఠం చూపించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Updated Date - Oct 21 , 2024 | 03:14 AM