R Krishnaiah : కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి..
ABN, Publish Date - Jun 16 , 2024 | 04:35 AM
కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీలకు 42ు రిజర్వేషన్ ఇవ్వాలి
మహా ధర్నాలో కృష్ణయ్య డిమాండ్
కులగణనకు కమిషన్ వేయాలి: జాజుల
కవాడిగూడ/హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సమగ్ర కులగణన చేపట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణయ్య, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. కులగణన పూర్తైన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు, రాష్ట్రంలో కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కూడా డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణనకు ప్రభుత్వం తక్షణమే స్వతంత్ర కమిషన్‌ను నియమించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు 19న హైదరాబాద్‌లో ‘‘సమగ్ర కులగణన సవాళ్లు- స్వతంత్ర కమిషన్ ఏర్పాటు, బీసీ రిజర్వేషన్ పెంపు’’ అంశంపై బీసీ మేధావులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Updated Date - Jun 16 , 2024 | 04:35 AM