Nagarjuna Sagar: వేగంగా నిండుతున్న సాగర్..
ABN , Publish Date - Aug 04 , 2024 | 04:15 AM
ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ జలాశయం శరవేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రేపు సాయంత్రం గేట్లు ఎత్తే అవకాశం.. ప్రాజెక్టుకు 4.33 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
శ్రీశైలం జలాశయానికీ అంతే మొత్తంలో వరద
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ జలాశయం శరవేగంగా నిండుతోంది. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్ నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. శనివారం సాయంత్రం 6 గంటల కల్లా 244.15 టీఎంసీల నీరు ఉంది. మరో 67.85 టీఎంసీలు వచ్చి చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. సోమవారం సాయంత్రం కల్లా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తూ, ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు.
దాంతో ఈ వరదంతా పులిచింతల ప్రాజెక్టుకు వచ్చిచేరుతోంది. పులిచింతల సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.69 టీఎంసీల నీరు ఉంది. బుధవారం కల్లా ఈ ప్రాజెక్టు నిండే అవకాశాలున్నాయి. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర జలాశయాలకు వరద నిలకడగా కొనసాగుతోంది. గోదావరి బేసిన్‌లో ప్రధానంగా సాగు నీరు అందించే ప్రాజెక్టులకు వరద నిరాశాజనకంగానే ఉంది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు 25 వేల క్యూసెక్కులు, కడెంకు 1,518 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 8,355 క్యూసెక్కులు, సింగూరు ప్రాజెక్టుకు 565 క్యూసెక్కుల నీరు వస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి 3.62లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 85 గేట్లను ఎత్తి అంతే నీటిని వదులుతున్నారు.
ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో
ఆల్మట్టి 129.72 72.89 313000 275000
నారాయణపూర్ 37.64 28.88 260000 256271
తుంగభద్ర 100.86 98.26 138393 149202
జూరాల 9.66 8.45 290000 270452
శ్రీశైలం 215.81 202.04 433088 552641
నాగార్జునసాగర్ 312.05 244.15 433088 552641
సింగూరు 29.91 14.71 565 391
శ్రీరాంసాగర్ 80.5 42.81 17925 703
కడెం 7.6 6.67 1518 957
ఎల్లంపల్లి 20.18 15.13 8355 13031
మేడిగడ్డ 16.17 6.07 451920 451920
సమ్మక్క 6.94 6.94 618720 618720
సీతమ్మ 36.57 0.2 552380 552380