Nagarjuna Sagar: నేడు సాగర్ గేట్లు ఓపెన్!
ABN , Publish Date - Aug 05 , 2024 | 05:13 AM
ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో సాగర్ నిండు కుండలా మారింది. జలాశయంలో నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరువ కావడంతో సోమవారం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

576 అడుగులు దాటిన జలాశయ నీటిమట్టం
రెండు లక్షల క్యూసెక్కుల విడుదలకు ఏర్పాట్లు
ఎగువ నుంచి 4.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఆల్మట్టికి 3.10 లక్షలు, శ్రీశైలానికి 4 లక్షలు..
మేడిగడ్డకు 4.87 లక్షల క్యూసెక్కుల వరద
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాగార్జునసాగర్ జలాశయానికి వడివడిగా చేరుతోంది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో సాగర్ నిండు కుండలా మారింది. జలాశయంలో నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరువ కావడంతో సోమవారం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు 6 గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు సీఈ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీశైలానికి ఎగువ నుంచి 4,00,491 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. పూర్తి సామర్థ్యం 215.60 టీఎంసీలకు.. నిల్వ 203.89 టీఎంసీలకు చేరింది.
దీంతో 10 గేట్లను ఎత్తి కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 4,27,711 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగుల (312.50 టీఎంసీలు)కు ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులు (271.90టీఎంసీలు)గా నమోదైంది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 4,613క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 26,040 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,200 క్యూసెక్కులు.. మొత్తం 37,873 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది.
కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి 3,10,556 ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 2.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయానికి 2.50 లక్షల ఇన్‌ఫ్లో వస్తుండగా 25 గేట్లను ఎత్తి 2,22,850 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాలకు 2.60 లక్షల ఇన్‌ఫ్లో వస్తుండగా 2,50,153 క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. తుంగభ్రదకు కాస్త వరద తగ్గింది. ప్రస్తుతం 1,32,343 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఔట్‌ఫ్లో 1,30,855 క్యూసెక్కులుగా ఉంది. సుంకేసుల వద్ద ఇన్‌ఫ్లో 1,72,000 క్యూసెక్కులుండగా 1,69,556 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో నమోదవుతోంది.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద..
గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 21,422 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలకు ప్రస్తుతం 44.26 టీఎంసీలున్నాయి. ఈనెల 7నుంచి ఆన్ ఆఫ్ పద్ధతిలో సాగుకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కాకతీయ, లక్ష్మీ, సరస్వతీ కాల్వల ద్వారా ఆయకట్టుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. ఇటు నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులతో పాటు సదర్మాట్ జలాశయం కూడా వరద నీటితో జలకళను సంతరించుకున్నాయి. కడెం పూర్తి సామర్థ్యం 7.60 టీఎంసీలకు.. ప్రస్తుతం 6.74 టీఎంసీలున్నాయి. ప్రాజెక్టుకు 3,867 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 4.87 లక్షల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 6 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
పనిచేయని టర్బైన్‌లు.. జెన్‌కో నిర్లక్ష్యం
నాగార్జునసాగర్ నుంచి సోమవారం నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ప్రధాన జలవిద్యుత్తు కేంద్రంలో 8 టర్బైన్‌లు ఉండగా.. 2, 4వ నంబరు టర్బైన్‌లు మరమ్మతులకు గురై 6 నెలలవుతున్నా జెన్‌కో అధికారులు మరమ్మతులు పూర్తిచేయలేదు. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నప్పటికీ జెన్‌కో అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తికి అవకాశం లేకుండా పోయిందని నీటి పారుదల, విద్యుత్తు రంగ నిపుణులు మండిపడుతున్నారు. దీనిపై జెన్‌కో ఎస్‌ఈ రఘురాం మాట్లాడుతూ.. 1వ టర్బైన్ మినహా మిగిలిన 7 టర్బైన్‌లు జపాన్ నుంచి తెచ్చి ఏర్పాటు చేసినవని.. మరమ్మతులకు జపాన్ నుంచే నిపుణులు రావాల్సి ఉందని చెప్పారు.