Nampally Court: లగచర్ల రైతులకు ఊరట
ABN, Publish Date - Dec 19 , 2024 | 05:08 AM
జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఘటనలో రిమాండ్‌లో ఉన్న నిందితులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నరేందర్‌రెడ్డి సహా 24 మందికి నాంపల్లి కోర్టు బెయిల్
మిగతా నిందితుల పిటిషన్లపై నేడు విచారణ
హైకోర్టులో ఆరుగురికి ముందస్తు బెయిల్
వికారాబాద్, కొడంగల్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన లగచర్ల ఘటనలో రిమాండ్‌లో ఉన్న నిందితులకు పెద్ద ఊరట లభించింది. నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు.. మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నరేందర్‌రెడ్డికి రూ.50వేల చొప్పున రెండు ష్యూరిటీలను సమర్పించాలని, 3 నెలల పాటు ప్రతీ వారం బొంరా్‌సపేట ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరై, విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. మిగతా నిందితులు రూ.20 వేలష్యూరిటీలు సమర్పించాలని, ప్రతివారం పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది.
నరేందర్‌రెడ్డి చర్లపల్లి జైలులో.. ఏ2 సురేశ్‌రాజ్ సహా.. మిగతా నిందితులు సంగారెడ్డి జైలులో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్లపై బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ సభ్యులు లక్ష్మణ్, శుభప్రద్ పటేల్, రాంచందర్‌రావు వాదనలను వినిపించారు. నిజానికి వికారాబాద్, కొడంగల్ కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు దాఖలవ్వగా.. వాటిని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. మంగళవారంతో వాదనలు పూర్తవ్వగా.. న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. సురేశ్‌రాజ్, ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై గురువారం విచారణ జరగనున్నట్లు సమాచారం. మరోవైపు.. లగచర్ల ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆరుగురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Updated Date - Dec 19 , 2024 | 05:08 AM