Hyderabad: గాడితప్పుతున్న పోలీసింగ్?
ABN , Publish Date - Jun 21 , 2024 | 03:15 AM
పోలీసు శాఖ గాడితప్పుతోందా? శాంతిభద్రతలపై పట్టు కోల్పోతోందా? ఒక్క ఫోన్‌తో న్యాయం జరుగుతుందనే పేరున్న డయల్-100 ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి.
చిన్నారులపై దారుణాలు..
గంజాయి బ్యాచ్ ఆగడాలు
పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం
వరుస పరిణామాలపై సీఎం సీరియస్?
రంగంలోకి ఉన్నతాధికారులు.. హితబోధ
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ గాడితప్పుతోందా? శాంతిభద్రతలపై పట్టు కోల్పోతోందా? ఒక్క ఫోన్‌తో న్యాయం జరుగుతుందనే పేరున్న డయల్-100 ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి. ఉట్కూరు ఘటనలో డయల్-100కు ఫోన్ చేస్తే.. పోలీసులు వచ్చి, కాపాడతారనే విశ్వాసం పోయిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆ ఘటనలో ఎస్సైని సస్పెండ్ చేసినా.. అది కంటితుడుపు చర్యేనని, పోలీసుల ఆలస్యానికి.. పోయిన ప్రాణం తిరిగి రాదుకదా? అని ప్రజలు భావిస్తున్నారు. తల్లిపక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి హత్యాచారానికి పాల్పడ్డ ఘటనపైనా ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంటిముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల చిన్నారిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి అఘాయిత్యం వంటి ఘటనలు శాంతిభద్రతల పాలిట ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
రాష్ట్రంలో దోపిడీ గ్యాంగ్‌లు పెట్రేగిపోతున్నాయి. చెడ్డీగ్యాంగ్, చుడీదార్ గ్యాంగ్, థార్ గ్యాంగ్ దొంగల ముఠాలు ఓవైపు.. చిన్నారులను అపహరించే ముఠాల సంచారం ఇంకోవైపు.. వరుస హత్యలు మరోవైపు.. ఇలాంటి దారుణాలు పతాకశీర్షికలకెక్కుతున్నాయి. ‘‘దొంగల గ్యాంగ్ తిరుగుతోంది. అప్రమత్తంగా ఉండండి. ఇట్లు.. ఎస్‌హెచ్‌వో’’ అంటూ వాట్సా్‌పలలో జాగ్రత్తల పేరుతో పోలీసులు సందేశాలను పంపడం తప్పితే.. ఇప్పటికీ ఈ గ్యాంగ్‌ల జాడనైనా కనుక్కొన్న దాఖలాలు లేకపోవడం గమనార్హం..! ‘‘రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు తావు ఉండొద్దు’’.. అంటూ సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినా.. హైదరాబాద్‌లో, శివార్లలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించుతుండడం నిఘా వైఫల్యమేనని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
బదిలీలపైనే ఫోకస్..!
ఓ వైపు దారుణాలు చోటుచేసుకుంటుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు? మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలతో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై దృష్టి సారించడంతో.. పోలీసులు కంఫర్ట్, ఫోకస్ ఉండే పోస్టులను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కీలకమైన ఒక్కో పోస్టుకు ముగ్గురి కంటే ఎక్కువ మంది అధికారులు పోటీపడుతుండడం గమనార్హం. ఈ తరుణంలో గంటల వ్యవధిలోనే దారుణాలు వెలుగులోకి రావడంతో.. పోలీసు సిబ్బంది కూడా తమ శాఖపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
సీసీఎ్‌సపై ఆరోపణలు..!
సెటిల్మెంట్లు.. లంచాలతో హైదరాబాద్ సీసీఎస్ కీర్తి రోజురోజుకూ మసకబారుతోంది. ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు ఉదంతంలో ఏకంగా కిడ్నా్‌పలు, బెదిరింపులకు సీసీఎ్‌సను వాడుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఓ ఇన్‌స్పెక్టర్ రూ.లక్షల మేర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైప్రొఫైల్ కేసులే సీసీఎ్‌సకు వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు పక్కదారి పడుతున్నారనే విమర్శలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నౌహీరాషేక్ కేసులోనూ సీసీఎస్ అధికారులు పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఇటీవల సీసీఎస్‌పై విమర్శలు వస్తుండడంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి స్వయంగా ఆ కార్యాలయానికి వెళ్లారు. ఒకరిద్దరు అధికారుల పేర్లను బహిరంగానే ప్రస్తావిస్తూ సున్నితంగా మందలించినట్లు తెలిసింది. అటు డీజీపీ రవిగుప్తా కూడా ఎప్పటికప్పుడు సీపీలు, ఎస్పీలతో సమీక్షలు నిర్వహిస్తూ.. సమర్థంగా పనిచేయాలని ఆదేశిస్తున్నారు. సీఎం కూడా పోలీసు శాఖ తీరుపై సీరియ్‌సగా ఉన్నట్లు సమాచారం. తాజా బదిలీలపై ఆ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్‌తో చీలిక..
పోలీసు శాఖలో ఫోన్ ట్యాపింగ్ కేసు చిచ్చుపెట్టిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసుల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వారిపై మిగతా వారు ఒక రకమైన అభిప్రాయంతో ఉంటున్నారు. గత ప్రభుత్వంలో కొందరు ఐపీఎ్‌సలు వ్యవహరించిన తీరు ఆధారాలతోసహా బయటకు రావడంతో.. కింది స్థాయి సిబ్బందిలో ఐపీఎస్ అంటే భయం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ నుంచి ఏకంగా ఐపీఎ్‌సల వరకు ఈ చీలిక స్పష్టంగా కనిపిస్తోంది.
జైళ్లశాఖలో అపనమ్మకం..
జైళ్లశాఖలోనూ విచిత్ర పరిస్థితి నెలకొంది. అధికారులు అభద్రతా భావంతో ఇతర సిబ్బందిపై అపనమ్మకంతో ఉంటున్నారు. ఒకరిపై మరొకరు నిఘా పెడుతున్నారు. మొదటిసారి జైళ్ల శాఖకు ఓ మహిళ డీజీగా వచ్చారు. అధికారుల తీరుపై సందేహం రావడంతో ఎంపిక చేసిన కొందరిపై నివేదిక ఇవ్వాలంటూ ఇంటెలిజెన్స్‌కు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం.