Medigadda barrage: మేడిగడ్డపై విచారణ కమిషన్‌కు అఫిడవిట్!
ABN, Publish Date - Jun 27 , 2024 | 04:14 AM
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ అధికారుల్లో మరోమారు గుబులు మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు ఇరిగేషన్ అధికారులు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది.
అన్ని విషయాలనూ పొందుపరిచిన ఇరిగేషన్ అధికారులు
ఎవరిపై చర్యలు ఉంటాయోనని అధికారుల్లో గుబులు!
మహదేవపూర్ రూరల్, జూన్ 26: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ అధికారుల్లో మరోమారు గుబులు మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు ఇరిగేషన్ అధికారులు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది. బ్యారేజీ ఈఈ తిరుపతిరావు సోమ, మంగళవారాల్లో ఈ అఫిడవిట్‌కు దాఖలు చేసినట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా జూలై 7న ప్రభుత్వానికి కమిషన్ మధ్యంతర నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఏ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని బ్యారేజీ పరిధిలో పనిచేసే ఇంజనీర్లు ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాకులోని 19, 20, 21 గేట్లు కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే.
కాగా, గత డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీతోపాటు లింక్-1లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తొలుత విజిలెన్స్ విచారణ జరిపించింది. విజిలెన్స్ రిపోర్టు అధారంగా అప్పటి ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్‌కు పొడగించిన పదవీ కాలాన్ని రద్దు చేయడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లును పదవి నుంచి తొలగించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించగా.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్.. ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ ప్రారంభించింది. మూడు బ్యారేజీల్లో పనిచేసే అధికారులను ప్రత్యేకంగా విచారించింది. అయినప్పటికీ పూర్తి వివరాలను కమిషన్‌కు తెలపడంలో అధికారులు తలో వైఖరి ప్రదర్శించినట్లు తెలిసింది.
దీంతో కచ్చితమైన సమాచారాన్ని రాబట్టేందుకుగాను మూడు బ్యారేజీలకు సంబంధించిన సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సంబంధిత అధికారులను కమిషన్ కోరింది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ ఈఈ తిరుపతిరావు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది. అయితే విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇద్దరు ఈఎన్సీలను తొలగించిన నేపథ్యంలో కమిషన్ ఇచ్చే రిపోర్టుతో ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, పీసీ ఘోష్ కమిషన్‌కు అందజేసిన అఫిడవిట్‌లో.. మేడిగడ్డ నిర్మాణానికి ముందు చేపట్టిన పరీక్షలు, నిర్మాణ తీరు, నిధుల వినియోగంపై సమగ్రంగా వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యాక దాని రక్షణ, నిర్వహణకు చేపట్టిన వివరాలతోపాటు భూసేకరణ వంటి అంశాలను పొందుపరిచినట్టు సమాచారం. బ్యారేజీ నిర్మాణ సంస్థతోపాటు ఆ సంస్థ ఇచ్చిన సబ్ కాంట్రాక్టుల గురించి వివరించినట్లు తెలిసింది.
Updated Date - Jun 27 , 2024 | 04:14 AM