Share News

Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:20 AM

చలి వాతారణం నేపథ్యంలో రాష్ట్రంలో న్యుమోనియా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు న్యుమోనియా బాధితుల తాకిడి పెరిగింది.

Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

రాజధానిలో ఆస్పత్రులకు పెరిగిన తాకిడి.. నిలోఫర్‌ ఓపీకి రోజూ 15-20 కేసులు

  • ప్రైవేటు ఆస్పత్రులకు కూడా అదేసంఖ్యలో!

  • అయిదేళ్లలోపు పిల్లల్లోనే ఎక్కువ ప్రభావం

  • పిల్లలకు టీకాలు తప్పనిసరి: నిపుణులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): చలి వాతారణం నేపథ్యంలో రాష్ట్రంలో న్యుమోనియా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు న్యుమోనియా బాధితుల తాకిడి పెరిగింది. బాధితుల్లో ఐదేళ్లలోపు చిన్నారులు ఎక్కువగా ఉంటున్నారని.. శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నవారిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేస్తున్నామని వైద్యులు వివరించారు. గణాంకాలు చూస్తే.. నిలోఫర్‌ ఆస్పత్రిలోకొద్దిరోజులుగా నిత్యం 15-20 మంది ఓపీలో చికిత్స పొందుతుండగా, ఇరవై మంది వరకూ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యి చికిత్స పొందుతున్నారు. న్యుమోనియా వచ్చిన వారిలో 59 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వస్తున్నారని, మిగతావారు వైద్యులను సంప్రదించకుండా, నిర్లక్ష్యం చేసి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు నిద్రలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నా.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. హెచ్‌ఐవీ, మీజిల్స్‌, మలేరియా మరణాల కంటే న్యుమోనియాతో చనిపోయే వారే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.


జరభద్రం..

చలికాలం వైరస్‌ వ్యాప్తికి అనుకూలం కావడంతో.. న్యుమోనియా కేసుల సంఖ్య పెరుగుతుంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండే పిల్లలకు ఇది ప్రమాదకరం. చల్లటి ఆహార పదార్థాలు తినేవారు, శీతలపానీయాలు తాగేవారు న్యుమోనియాతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఈ కాలంలో పిల్లలకు తాజా ఆహారం ఇవ్వాలని, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చటి దుస్తులు వేయాలని.. త్వరగా జీర్ణమయ్యే పౌష్టికాహారం ఎక్కువగా ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే.. రక్తహీనత, హెచ్‌ఐవీ, మధుమేహం, ఆస్తమా, గుండె, ఉపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారిలో న్యుమోనియా తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండే మహిళలు, ఆరవై ఏళ్లు పైబడిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


ఈ లక్షణాలుంటే జాగ్రత్త

విడవకుండా పొడి దగ్గు, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, కఫం, దగ్గినప్పుడు రక్తం పడడం, ఛాతీనొప్పి, అలసట, నిద్రలో పిల్లి కూతలు పెట్టడం, ఆహారం తీసుకోవడానికి ఇష్టపడకపోవడం, మైకం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్త చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా తల్లిపాలు 6 నెలల పాటు తాగిన పిల్లలకు న్యుమోనియా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులు వివరించారు. తక్కువ బరువుతో పుట్టే పిల్లలు, పౌష్టికాహార లోపం ఉండే నవజాత శిశువులకు న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువని.. గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా ఈ ముప్పును నివారించవచ్చని వారు పేర్కొన్నారు. ధూమపానం చేసే వారికి పుట్టే పిల్లలకు కూడా న్యుమోనియా ముప్పు అధికమని.. కోరింత దగ్గు, మీజిల్స్‌ వంటి వాటికి టీకాలు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల కూడా న్యుమోనియా బారిన పడుతున్నారని చెప్పారు.


ఎనిమిదేళ్ల వరకు ఫ్లూ వ్యాక్సిన్‌ తప్పనిసరి

38.jpg

మా వద్దకు వస్తున్న న్యుమోనియా బాధితుల్లో ఐదేళ్లలోపు పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. తీవ్ర లక్షణాలతో వచ్చినవారిని వెంటనే చేర్చుకుని చికిత్స చేస్తున్నాం. కొన్నికేసుల్లో వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించాల్సి వస్తోంది. ఎనిమిదేళ్ల వరకు పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్‌, న్యుమోకోకల్‌ ఇవ్వాలి. దీనివల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్లూ ఉన్న సమయంలో పిల్లలకు ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్ర జ్వరం, జలుబు ఉంటే ఆస్పత్రికి తీసుకురావాలి. ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు, శ్వాస కోశ ఇబ్బందులు ఉంటే వారు పిల్లలకు దూరంగా ఉండాలి. అస్వస్థతగా ఉన్న పెద్దలు ఇంట్లో మాస్కులు ధరించి ఉండాలి. పిల్లలకు ఆహారం ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు పరిశుభ్రత పాటించాలి, చేతులు శుభ్రంగా కడుకోవాలి. పిల్లలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. చలిలో ఎక్కువ సేపు పిల్లలను ఉంచొద్దు. చన్నిటీ స్నానం అసలే చేయించవద్దు.

- డాక్టర్‌ నవిత, నవజాత శిశు, పిల్లల వైద్యురాలు, మెడికవర్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఆస్పత్రి

Updated Date - Dec 26 , 2024 | 05:20 AM