KTR: ‘గాంధీ’లో మరణాలపై రగడ..
ABN, Publish Date - Sep 19 , 2024 | 04:12 AM
గాంధీ ఆస్పత్రిలో పసిపిల్లలు, బాలింతల మరణంపై అధికార, ప్రతిపక్షాల మధ్య బుధవారం మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఎక్స్‌లో ఘాటుగా బదులిచ్చారు.
పసిబిడ్డల ప్రాణాలు పోతుంటే సీఎం ఏం చేస్తున్నారంటూ కేటీఆర్ ట్వీట్
ప్రభుత్వ దవాఖాన్లపై కుట్రలు వద్దంటూ మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో పసిపిల్లలు, బాలింతల మరణంపై అధికార, ప్రతిపక్షాల మధ్య బుధవారం మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఎక్స్‌లో ఘాటుగా బదులిచ్చారు. ఈ ఏడాదిలో 48 మంది పసిబిడ్డలు, 14 మంది బాలింత తల్లులు మరణించారని ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆస్పత్రిలో ఇంత విషాదమా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? అని కేటీఆర్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు. ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే.. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితేంటని, సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. పాలన గాలికి వదిలేసి విగ్రహ రాజకీయాలు చేస్తున్న సీఎంకు ఎవరైనా బాధ్యతను గుర్తు చేయాలని కోరారు.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. గాంధీ ఆస్పత్రిపై బురద జల్లి రోగులు రాకుండా చేసి కార్పొరేట్ ఆస్పత్రులకు లబ్ధి చేకూర్చాలని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గాంధీ వంటి టెర్షియరీ కేర్ ఆస్పత్రులకు అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులే వస్తారని, వారిని కాపాడేందుకు చివరి నిమిషం వరకు వైద్యులు ప్రయత్నిస్తారని వివరించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. దేశంలోని ఏ టెర్షియరీ కేర్ ఆస్పత్రిలోనైనా ఇలాంటి ఘటనలు ఉంటాయన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇలా జరిగిందంటూ కేటీఆర్ మరణాల సంఖ్యను భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో గాంధీ ఆస్పత్రిలో చోటుచేసుకున్న మరణాల వివరాలను విడుదల చేశారు. కాగా, సినీనటుడు నాగార్జునను సీఎం రేవంత్‌రెడ్డి రూ.400కోట్లు డిమాండ్ చేశారని బాల్క సుమన్ ఆరోపించారు. ఆ మొత్తం ఇవ్వనందుకే ఎన్‌కన్వెన్షన్ కూల్చేశారని విమర్శించారు.
బీసీల సమస్యలపై పోరాటం
నవంబరు 10లోగా బీసీ డిక్లరేషన్ అమలవకుంటే ఉద్యమిస్తాం: కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బీసీల సమస్యలను పరిష్కరించే వరకూ పోరాడుతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గత ఏడాది నవంబరు 10న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని, సమగ్ర కులగణన చేపట్టాలని, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వీటిని వచ్చే నవంబరు 10లోపు నెరవేర్చకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. పార్టీకి చెందిన బీసీ నేతలతో తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన సమావేశమయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీలోని బీసీ నేతలను వర్కింగ్ గ్రూపులుగా విభజించి, బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో బీసీలకు కనీసం రూ.30వేలకోట్లు కేటాయించాలని, ఎంబీసీకి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. జమిలి ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారన్న విషయమై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు వచ్చాక.. తమ పార్టీ నేతలతో చర్చించి.. తమ నిర్ణయం చెబుతామని వెల్లడించారు. కేసీఆర్ హయాంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టిందనడానికి కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన ఎంఎ్‌సఎంఈ పాలసీనే ఉదాహరణ అని పేర్కొన్నారు.
Updated Date - Sep 19 , 2024 | 04:12 AM