Phone Tapping Case: ప్రభాకర్‌రావు లొంగు‘బాట’?
ABN , Publish Date - Apr 01 , 2024 | 05:48 AM
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి.ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు.. దర్యాప్తులో ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అంటూ వాంగ్మూలం
అమెరికా నుంచి తిరుగు ప్రయాణం!.. ఆయన అప్రూవర్‌గా మారుతారా?
కొనసాగుతున్న భుజంగరావు, తిరుపతన్న విచారణ
భుజంగరావు నా ఫోన్ ట్యాప్ చేశారు.. ఆఫీస్‌కు పిలిపించి బెదిరించారు
సంధ్య కన్వెన్షన్ ఎండీ ఆరోపణలు.. బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు!
పోలీసులకు కీలక ఆధారాల సమర్పణ
హైదరాబాద్ సిటీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్‌సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న టి.ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారా? ఇప్పటి వరకు అరెస్టయిన పోలీసు అధికారులు.. దర్యాప్తులో ‘‘ప్రభాకర్‌రావు చెప్పినట్లు చేశాం’’ అంటూ వాంగ్మూలం ఇవ్వడంతో అన్ని వేళ్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ వైపే చూపుతున్నాయా? దాంతో ప్రభాకర్‌రావు అమెరికా నుంచి తిరుగు ప్రయాణమయ్యారా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రభాకర్‌రావు ఇటీవల ఓ దర్యాప్తు అధికారికి అమెరికా నుంచి ఫోన్ చేసి, ‘‘ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్లు మీరు ఎలా చేస్తున్నారో.. గత ప్రభుత్వం చెప్పింది మేం చేశాం’’ అని వ్యాఖ్యానించారనే విషయం తెలిసిందే..! అయితే.. ‘‘మీరు ఏం చెప్పాలనుకున్నా.. హైదరాబాద్‌కు వచ్చి చెప్పండి. లేదంటే తెలంగాణ పోలీసు అధికారిక ఈ-మెయిల్‌కు వివరాలు పంపండి’’ అని సదరు దర్యాప్తు అధికారి చెప్పగానే ప్రభాకర్‌రావు ఫోన్ కట్‌చేశారు.
నిజానికి తాను అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు వచ్చానని, రెండు-మూడు నెలల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వస్తానని చెప్పిన ప్రభాకర్‌రావు.. ఇప్పుడు ఆగమేఘాల మీద దర్యాప్తు అధికారుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధపడ్డట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు మాదిరిగానే.. నేరుగా పశ్చిమ మండలం డీసీపీ ఎదుట ప్రభాకర్‌రావు లొంగిపోనున్నట్లు సమాచారం.
మధ్యవర్తిత్వం నెరపిందెవరు?
ప్రభాకర్‌రావు తన క్యాన్సర్ చికిత్స పూర్తయ్యాకే అమెరికా నుంచి తిరిగి వస్తానని ఇంతకు మునుపే దర్యాప్తు అధికారులకు స్పష్టం చేశారు. అయితే.. ఉన్నఫళంగా తన మనసును మార్చుకుని, హైదరాబాద్ వస్తుండడం వెనక ఓ కీలక వ్యక్తి మధ్యవర్తిత్వం నెరిపినట్లు పశ్చిమ మండలం పోలీసులు చర్చించుకుంటున్నారు. ఆ వ్యక్తి ప్రభాకర్‌రావుతో మాట్లాడి.. ‘‘పరిస్థితి మరింత జటిలంగా మారక ముందే.. పోలీసుల ఎదుట లొంగిపోవడం మంచిది. లేదంటే.. మీరు వచ్చే వరకు ఇతర నిందితులకు బెయిల్ కూడా వచ్చే అవకాశాల్లేవు. పైగా.. మీ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఇంటర్‌పోల్ సాయం తీసుకునేదాకా పరిస్థితి వెళ్తే మీక్కూడా మంచిది కాదు. నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది’’ అని సముదాయించినట్లు తెలిసింది. అంతేకాకుండా.. పోలీసు శాఖలో ఉండేదంతా మనవాళ్లేనని, మీకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో.. ప్రభాకర్‌రావు హైదరాబాద్ వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
అప్రూవర్‌గా మారుతారా?
ఈ కేసు కోర్టులో నిలబడాలంటే.. బలమైన సాక్ష్యాధారాలు అవసరం అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్‌ను ప్రయోగించినా.. ఐపీసీలోని సెక్షన్లను పెట్టినా.. విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనడానికి కోర్టుకు పక్కా ఆధారాలు అవసరం అని వివరిస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్‌రావు హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేశారని చెబుతున్న నేపథ్యంలో.. ఏ సాఫ్ట్‌వేర్ వాడారు? ర్యాండమ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రోజన్/టూల్(ర్యాట్)ను టార్గెట్ ఫోన్లలో ఎలా ప్రవేశపెట్టారు? ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు? అనే వివరాలను రాబట్టడం కష్టమేనంటున్నారు. ఇక దర్యాప్తు అధికారుల విచారణ సందర్భంగా.. అరెస్టయిన పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(3) ప్రకారం చెల్లుబాటు కాదని, ఏసీపీ/డీఎస్పీ స్థాయి అధికారి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం చెల్లుబాటు అయ్యేలా చట్టం ఉన్నా.. కోర్టులో నిందితులు మాట మారిస్తే ఇబ్బందేనని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఫోన్‌ట్యాపింగ్ సూత్రధారులకు శిక్ష పడాలంటే.. పాత్రధారులైన నిందితుల్లో ఎవరైనా అప్రూవర్‌గా మారితే తప్ప అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అయితే ప్రభాకర్‌రావు, లేదంటే ప్రణీత్‌రావు సిద్ధమైతే.. వారిని అప్రూవర్‌గా పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్యాప్తు అధికారులు ఈ ట్యాపింగ్ అంశాన్ని రెండుగా విభజించినట్లు తెలుస్తోంది. మొదటిది ఇంటెలిజెన్స్ కాగా.. రెండోది ఆపరేషన్స్. ఇంటెలిజెన్స్ కేటగిరీలో ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు నేరుగా ఉండగా.. మిగతా నిందితులంతా ఆపరేషన్స్ కేటగిరీలో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడోరోజు ముగిసిన విచారణ..
మాజీ అదనపు ఎస్పీలు భజంగరావు, తిరుపతన్నలను మూడోరోజు కస్టడీలో భాగంగా పంజాగుట్ట పోలీసులు ఆదివారం విచారించారు. ఈ సందర్భంగా కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. వీరిద్దరూ ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్‌లో పనిచేసినప్పుడు ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు? ఎంతమందిని వేధించారు? ఎవరి మెప్పుకోసం ఈ చర్యలకు పాల్పడ్డారు? అనే అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. వీరి కస్టడీకి మరో రెండ్రోజుల గడువే ఉండడంతో.. ఆలోగా రాధాకిషన్‌రావు కస్టడీకి కూడా లైన్ క్లియర్ అయితే.. ముగ్గురినీ కలిపి విచారించే అవకాశాలున్నాయి. సోమవారం నాంపల్లి న్యాయస్థానంలో రాధాకిషన్‌రావు కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి.
ఠాణాకు సంధ్య కన్వెన్షన్ ఎండీ
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు ఆదివారం బంజారాహిల్స్ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చారు. తన ఫోన్ ట్యాప్ చేసి వేధింపులకు గురిచేశారంటూ ఇటీవల శ్రీధర్‌రావు తరపున ఆయన అడ్వొకేట్ పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన బంజారాహిల్స్ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చి, విచారణాధికారులకు పలు ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది. భుజంగరావు తన ఫోన్‌ను ట్యాప్ చేసి, అనేక ఇబ్బందులకు గురిచేశారని చెప్పినట్లు సమాచారం. భుజంగరావు తన కార్యాలయానికి పిలిపించి, బెదిరించారని, అక్రమంగా కేసులు పెట్టించారని వివరించినట్లు తెలిసింది. అందుకు తగిన ఆధారాలను దర్యాప్తు అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఠాణా నుంచి బయటకు వస్తున్న సందర్భంగా శ్రీధర్‌రావుకు మీడియా పలు ప్రశ్నలు వేయగా.. ‘‘త్వరలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తా. అప్పుడు అన్ని వివరాలు చెబుతా’’ అని వ్యాఖ్యానించారు. తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు అధికారులకు ఆధారాలను అందజేసేందుకు వచ్చినట్లు చెప్పారు.
త్వరలో రాజకీయ నాయకులకు నోటీసులు
భుజంగరావు, తిరుపతన్న విచారణ సందర్భంగా పలువురు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయా నేతలకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిపించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఆదివారం కూడా పలువురికి శ్రీముఖాలు అందాయని, వారు సోమవారం నుంచి విచారణకు హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.