Cyber frauds: డిస్‌ప్లే పిక్ చూసి మోసపోవద్దు..
ABN, Publish Date - Jul 20 , 2024 | 03:52 AM
సాధారణంగా పోలీసులంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతారు. ఎలాంటి తప్పు, నేరం చేయకపోయినా పోలీసులతో మాట్లాడాలంటేనే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ప్రజల్లో ఉండే ఈ బలహీనతను సైబర్ నేరగాళ్లు ఇటీవల డబ్బు చేసుకుంటున్నారు.
పోలీసుల పేరిట నకిలీ ఫోన్ కాల్స్ కేసులంటూ బెదిరించి డబ్బు వసూళ్లు
సైబర్ నేరగాళ్ల నయా మోసం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ జితేందర్
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా పోలీసులంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతారు. ఎలాంటి తప్పు, నేరం చేయకపోయినా పోలీసులతో మాట్లాడాలంటేనే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ప్రజల్లో ఉండే ఈ బలహీనతను సైబర్ నేరగాళ్లు ఇటీవల డబ్బు చేసుకుంటున్నారు. పోలీసు అధికారుల చిత్రాలను డిస్‌ప్లే పిక్‌లో పెట్టుకుని ఫోన్లు చేసి కేసుల పేరిట సామాన్యులను భయపెట్టి అందినకాడికి డబ్బు గుంజుతున్నారు. ఫోన్ వచ్చింది గుర్తు తెలియని నెంబర్ నుంచైనా, మాట్లాడేది అపరిచితుడైనా, కాలర్ ఐడీ డిస్‌ప్లే పిక్‌గా పోలీసు అధికారి చిత్రం ఉండడంతో చాలా మంది వారి బుట్టలో పడుతున్నారు.
మీ కుటుంబసభ్యుడు ఫలానా కేసులో ఇరుక్కున్నాడని, మీ పేరిట డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని అరెస్టు చేయడానికి వస్తున్నామని బెదిరించి కేటుగాళ్లు చెమటలు పట్టిస్తున్నారు. అడిగినంత డబ్బిస్తే కేసులు బాధ లేకుండా చేస్తామని నమ్మించి డబ్బు గుంజుతున్నారు. ఈ తరహా మోసానికి సంబంధించిన కాల్ రికార్డింగ్ వీడియోను తెలంగాణ డీజీపీ జితేందర్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీస్ అధికారి ఫొటో డీపీగా కలిగిన నెంబర్ నుంచి కాల్ చేసిన వ్యక్తి తాను ముంబైకి చెందిన పోలీసు అధికారినని అవతలి వ్యక్తికి పరిచయం చేసుకుంటాడు.
మీ అబ్బాయి అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడని, మీవాడి జీవితం అయిపోందని భయపెడతాడు. చివరికి తాను అడిగిన డబ్బు పంపిస్తే కేసు నుంచి తప్పిస్తానని బేరం పెడతాడు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అలాగే, +92, +232, +375 తో ప్రారంభమయ్యే నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ విషయంలోనూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. +92తో మొదలయ్యే నెంబర్లు పాకిస్థాన్‌కు చెందినవని ట్రాయ్ ఇదివరకే హెచ్చరించింది.+92 నెంబరుతో వచ్చే ఫోన్ కాల్స్, మిస్డ్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని అధికారులు సూచిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల తర్వాత డీజీపీ జిల్లాల పర్యటన
పోలీసులు స్టేషన్లకు పరిమితం కాకుండా ప్రజల్లో ఉంటూ తనిఖీలు చేస్తూ విజబుల్ పోలిసింగ్ ద్వారా నేర నియంత్రణకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు శాఖను ఆదేశించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో స్టేషన్ హౌస్ అధికారులు ఈ ఆదేశాలను పాటిస్తున్నారు. ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ కనిపిస్తున్నారు. మరోపక్క, రాష్ట్ర డీజీపీ జితేందర్ కూడా జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పర్యటనలు ఉంటాయని సమాచారం. మరోపక్క, ఎస్పీల పని తీరుపై కూడా డీజీపీ కార్యాలయం దృష్టి సారించింది. కొందరు ఎస్పీలను ఇప్పటికే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్ స్థాయి అధికారులతో డీజీపీ నాలుగు రోజుల క్రితం ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొందరు ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గుర్తించిన డీజీపీ.. ఉన్నతాధికారులు అంతర్గత చర్చలో ఆయా ఎస్పీల అంశాన్ని ప్రస్తావించారు.
Updated Date - Jul 20 , 2024 | 03:52 AM