ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Colleges: వైద్య విద్య.. నాణ్యత మిథ్య

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:19 AM

రాష్ట్రంలో వైద్య విద్యలో నాణ్యత మిథ్యగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి వైద్య కళాశాలల సంఖ్య 60కి చేరిందని సంబరపడుతున్నా..

  • ప్రైవేటులో పుట్టగొడుగుల్లా మెడికల్‌ కాలేజీలు

  • ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 60..

  • 70% ప్రొఫెసర్లు లేనివే అధికం

  • రోగులు లేకుండానే ప్రాక్టికల్స్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్యలో నాణ్యత మిథ్యగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి వైద్య కళాశాలల సంఖ్య 60కి చేరిందని సంబరపడుతున్నా.. అందుకు తగినట్టుగా ప్రొఫెసర్లు, సదుపాయాలు లేకపోవడంతో.. వైద్య విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయి. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలను ఏ ఒక్క కాలేజీ కూడా పాటించడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికే కన్వీనర్‌ కోటా సీట్లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. విద్యార్థులు కళాశాలల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


  • 70 శాతం ఫ్యాకల్టీ బోగస్‌..

వైద్య విద్యకు మేటిగా భావించే సర్కారీ మెడికల్‌ కాలేజీల్లోనే ఫ్యాకల్టీ ఉండటం లేదు. వైద్య విద్య సంచాలకుల పరిధిలో 11,499 మంజూరైన పోస్టులుండగా.. అందులో 56 శాతం ఖాళీలున్నట్లు కాగ్‌ నివేదికలో వెల్లడైంది. ఇక ప్రైవేటులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని కాలేజీల్లో 70 శాతం మేర ఫ్యాకల్టీ ఉండటం లేదు. ప్రొఫెసర్లను కేవలం కాగితాలపైనే చూపుతున్నారు. ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలకు వచ్చినప్పుడు వారిని మేనేజ్‌ చేస్తున్నారు. దీంతో ఫ్యాకల్టీకి ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ అటెండెన్స్‌(ఎబా్‌స)ను ఎన్‌ఎంసీ ప్రవేశపెట్టింది.


అయితే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఫ్యాకల్టీ వేలిముద్రలను క్లోనింగ్‌ చేసి ఎబాస్‌ అటెండెన్స్‌ వేసేస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు తమకు సమీపంలో సమీపంలో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులను ఫ్యాకల్టీగా చూపుతున్నాయి. ఎబా్‌సలో వారి చేత వేలిముద్రలను వేయిస్తున్నాయి. మెజారిటీ కాలేజీల్లో ఇదే తంతు నడుస్తోంది. ప్రొఫెసర్లు లేకుండానే కాలేజీలను నడిపించేస్తున్నారు. కొన్ని కాలేజీలు సాయంత్రం నాలుగు గంటలకే తాళాలు వేసి వెళ్లిపోతున్నట్లు సమాచారం. వాస్తవానికి అనుబంధ ఆస్పత్రుల్లో రోగులుండాలి.


ప్రస్తుతం సర్కారీ మెడికల్‌ కాలేజీల సంఖ్య భారీగా పెరగడంతో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు వెళ్లే రోగుల సంఖ్య భారీగా తగ్గింది. దాంతో ప్రైవేటులో రోగులు ఉండటం లేదు. కొన్ని కాలేజీలు లేని రోగులను ఉన్నట్లు రికార్డులో చూపుతున్నట్లు సమాచారం. మరికొన్ని కాలేజీల్లో అసలు ప్రసవాలే జరగకున్నా.. ఆ లెక్కలు చూపుతున్నట్లు తెలిసింది. ప్రైవేటు కాలేజీల్లో చదివే వారిలో ఒక్క ఆపరేషన్‌ చేయకుండానే మాస్టర్‌ ఆఫ్‌ సర్జరీ కోర్సు చేసి బయటకు వస్తున్నవారు కూడా ఉంటున్నారని వైద్య విద్య ఉన్నతాఽధికారులు చెబుతున్నారు.


  • ఎన్‌ఎంసీ ద్వంద్వ వైఖరి..

కాలేజీల విషయంలో ఎన్‌ఎంసీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందన్న విమర్శలున్నాయి. ప్రైవేటులో ఫ్యాకల్టీ లేకున్నా.. ఏ ఒక్క కాలేజీకి కూడా జరిమానా విధించడం లేదు. అదే సర్కారీ కాలేజీల్లో తనిఖీలు చేసి రూ.10-20 లక్షల వరకు జరిమానాలు విధిస్తోంది. ప్రైవేటు కళాశాలలు ఎన్‌ఎంసీని మేనేజ్‌ చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రతీ మెడికల్‌ కాలేజీ విధిగా వార్షిక నివేదికలను ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అందులో కాలేజీలోని ప్రొఫెసర్లు, ఓపీ, ఐపీ, సర్జరీల గణాంకాలను అప్‌లోడ్‌ చేయాలి. అధికారులు తనిఖీలు చేసినపుడు ఆ గణాంకాలు సరిపోలాలి. కానీ ప్రైవేటులో తనిఖీలు చేసిన తర్వాత కాలేజీలపై తీసుకున్న చర్యలేమీ లేవు. సీట్ల కోత ఉండటం లేదు. నిబంధనలను పాటించని కాలేజీల గుర్తింపు రద్దయ్యే పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంటోంది. మన రాష్ట్రంలో మెజారిటీ మెడికల్‌ కాలేజీలు రాజకీయ నాయకులకు చెందినవే ఉన్నాయని, అందుకే చర్యలు ఉండటం లేదన్న విమర్శలున్నాయి.


  • ఇంజనీరింగ్‌ విద్యలా మారుతోందా..?

మన రాష్ట్రంలో 60 మెడికల్‌ కాలేజీల్లో 8,715 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఇంకా కాలేజీల సంఖ్యను పెంచుతున్నారు తప్ప.. వాటిలో నాణ్యమైన విద్య అందుతుందా..? అన్న దానిపై పర్యవేక్షణ ఉండటం లేదు. ప్రభుత్వ, ప్రైవేటులో వైద్య విద్య నాణ్యతను పర్యవేక్షించే బాధ్యత హెల్త్‌ యూనివర్సిటీపై ఉంటుంది. కానీ వర్సిటీ దీన్నేం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మరో నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో ఏటా పదివేల మంది వరకు ఎంబీబీఎస్‌ చదివి బయటకు వస్తారు. వారిలో ఎంత మందికి ఉపాధి దొరుకుతుందన్న దానికి గ్యారెంటీ లేదు.


కేవలం ఎంబీబీఎస్‌ చేస్తే సరిపోదు, పీజీ చేయాలి. మన దగ్గర 2,544 పీజీ సీట్లున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఎంబీబీఎస్‌ సీట్ల ప్రకారం కేవలం 29 శాతం మందికే పీజీ సీట్లు దక్కుతాయి. మరోవైపు ఏటా పోటీ కూడా పెరుగుతుంటుంది. దాంతో రానురాను సీటు దక్కించుకునే అవకాశాలు మరింత సన్నగిల్లుతాయి. ఇప్పటికే ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారు సరైన అవకాశాల్లేక రూ.25 వేలకే ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. దీంతో వైద్య విద్య మరో ఇంజనీరింగ్‌ విద్య అవుతుందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


  • కాలేజీ గురించి ముందే తెలుసుకోవాలి

విద్యార్థులు దరఖాస్తుకు ముందే ఒక్కసారి ఆయా కాలేజీలను సందర్శించడంతో పాటు వాటిలో చదివే సీనియర్‌ విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలి. అక్కడ ఫ్యాకల్టీ ఉందో.. లేదో..? చెక్‌ చేసుకోవాలి. ఎన్‌ఎంసీ మేరకు ప్రమాణాలు పాటిస్తున్నారా.. లేదా.. రోగుల సంఖ్య ఎలా ఉంది..? అన్న విషయాలను తెలుసుకోవాలి. రోగులు లేకుంటే నేర్చుకునేది ఏమీ ఉండదు. ఓపీ, ఐపీతో పాటు డెలివరీలు, సర్జరీలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఇవన్నీ ఉన్న కాలేజీలనే ఎంచుకోవాలి. అప్పుడే నాణ్యమైన విద్య లభిస్తుంది.

- డాక్టర్‌ పుట్ట శ్రీనివాస్‌, మాజీ వైద్య విద్య సంచాలకులు

Updated Date - Aug 13 , 2024 | 04:19 AM

Advertising
Advertising
<