Obesity: ప్యాకేజ్డ్ విషం!
ABN, Publish Date - Dec 23 , 2024 | 03:07 AM
రాము, వాసంతి (పేర్లు మార్చాం) దంపతులిద్దరూ ఉద్యోగస్తులే..! ఆరోగ్యం, ముఖ్యంగా తినే ఆహారం గురించి శ్రద్ధ ఎక్కువే..! కానీ, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఊబకాయం. వెంటనే ప్యాకేజ్డ్ ఫుడ్‌ని ఆపేయాలని డాక్టర్ హెచ్చరించారు. నిజానికి ఆ బాలుడికి ఉదయం అల్పాహారంగా కార్న్‌ఫ్లేక్స్ లేదా బ్రెడ్-జామ్, హెల్తీడ్రింక్ ఇస్తారు.
చక్కెర కూడా వ్యసనమే
చిన్నారులు చక్కెరను ఎక్కువగా తినడం ఓ వ్యసనమే. కొకైన్‌తో పోలిస్తే.. చక్కెర 8 రెట్లు అధికంగా వ్యసనంగా మారుతుంది. ‘నో యాడెడ్ షుగర్’ అనే దాంట్లో వాస్తవం కొంత వరకే ఉంటుంది.
ఎలా తినాలంటే...
పిల్లలకు పోషకాహారాన్నే అందించాలి. ప్యాకేజ్డ్ ఆహారాన్ని వీలైనంత వరకు దూరం పెట్టాలి. దీని వల్ల చిన్నారుల్లో రోగ నిరోధకశక్తి పెరిగి, మెదడు అభివృద్ధి, శారీరక ఎదుగుదల సవ్యంగా ఉంటుంది. సమతుల, పోషకాహారాలతో దీర్ఘకాలిక అనారోగ్యాలు/ రుగ్మతలు/ వ్యాధులను నివారించవచ్చు.
లేబుల్‌ని చదవాల్సిందే
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల లేబుల్స్‌ని చదవాల్సిందే. వాటిల్లో నిల్వ కారకాలు, ఎడిటివ్స్, హిడెన్ షుగర్‌తోపాటు.. ఆహారం సమతుల్యమైనదేనా? కొవ్వుపదార్థాలు, పిండిపదార్థాలు, పీచుపదార్థాలు, మాంసకృత్తులు ఎంతమొత్తంలో ఉన్నాయో తెలుస్తుంది.
ప్యాకేజ్డ్ ఆహారంతో చిన్నారులకు ఊబకాయం, మధుమేహం ముప్పు
మెదడు మీద దుష్ప్రభావం
ఆస్తమా, ఎలర్జీ వంటి రుగ్మతలు కూడా..
ఫ్లేవర్డ్ మిల్క్, సెరల్స్‌లోనూ చక్కెర
పరిమితికి మించి.. చక్కెర తింటున్న చిన్నారులు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాము, వాసంతి (పేర్లు మార్చాం) దంపతులిద్దరూ ఉద్యోగస్తులే..! ఆరోగ్యం, ముఖ్యంగా తినే ఆహారం గురించి శ్రద్ధ ఎక్కువే..! కానీ, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఊబకాయం. వెంటనే ప్యాకేజ్డ్ ఫుడ్‌ని ఆపేయాలని డాక్టర్ హెచ్చరించారు. నిజానికి ఆ బాలుడికి ఉదయం అల్పాహారంగా కార్న్‌ఫ్లేక్స్ లేదా బ్రెడ్-జామ్, హెల్తీడ్రింక్ ఇస్తారు. మధ్యాహ్న భోజనం స్కూల్‌లోనే ఉంటుంది. సాయంత్రం స్నాక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ ఇస్తారు. రాత్రి భోజనం ఇంట్లో వండినది గానీ, బయట ఆర్డర్ చేసింది గానీ పెడతారు. ప్యాకేజ్డ్ ఫుడ్ మాన్పించకపోతే కష్టమని డాక్టర్ చెప్పడంతో కంగుతిన్నారు. తాము ఆరోగ్య ఆహారాన్నే అందిస్తున్నామని చెప్పినా.. ప్యాకేజీ ఆహారంలో ఉండే అధిక చక్కెర, పిండిపదార్థాల గురించి డాక్టర్ విడమరచి చెప్పాల్సి వచ్చింది. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు చేస్తున్న పొరపాట్లు ఒక్క ఉద్యోగస్తులైన దంపతులకే పరిమితం కాలేదని, దాదాపుగా అందరూ ప్యాకేజ్డ్ ఆహారం వైపే మొగ్గుచూపుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రాండెడ్ ఉత్పత్తులనే పిల్లలకు తినిపిస్తామని చెప్పే తల్లిదండ్రులు.. వాటి లేబుల్స్‌ను మాత్రం పరిశీలించడం లేదంటున్నారు. ఆయా ఆహార పదార్థాల్లో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వులు, పిండిపదార్థాలు పిల్లల్లోకి వెళ్లి.. వారు అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొంటున్నారు. ‘‘చాలా మంది తల్లిదండ్రులు కార్న్‌ఫ్లేక్స్‌లో కొవ్వు తక్కువగా ఉంటుందనుకుంటారు. కానీ, చక్కెర, పిండిపదార్థాల గురించి పట్టించుకోరు. చక్కెర వల్ల కొవ్వు నిల్వ అయ్యే ప్రమాదాలున్నాయి. బ్రెడ్ కాకుండా చాలా మంది బ్రౌన్ బ్రెడ్ మంచిదనుకుంటారు. అందులోనూ రిఫైన్డ్ పిండిని వాడడం వల్ల క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఒంటికి అవసరమయ్యే మాంసకృత్తులు(ప్రొటీన్లు), పీచుపదార్థాలు(ఫైబర్) తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారం తినడం వల్ల చిన్నారుల్లో ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యలు వస్తాయి’’ అని హెచ్చరిస్తున్నారు.
2017లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. దేశంలోని 93% మంది చిన్నారులు ప్యాకేజ్డ్ ఆహారం తింటున్నారు. చక్కెర ఎక్కువ మోతాదులో ఉండే పానీయాలను 68% మంది సేవిస్తున్నారని తేలింది. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్ నీనా మోదీ కొవిడ్‌కు ముందు జరిపిన అధ్యయనంలో భారత్‌లో 10 ఏళ్లలోపు వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయులని, ఐదేళ్లలోపు పిల్లల్లోనూ ప్రతి ముగ్గురిలో ఒకరికి దంతక్షయం ఉందని వెల్లడైంది. సాధారణం కంటే మూడు రెట్ల అధిక మోతాదులో చక్కెర తీసుకోవడమే ఇందుకు కారణమని ఆమె తన అధ్యయనంలో పేర్కొన్నారు. ‘‘చిన్నారులు రోజుకు మూడు లేదా నాలుగు టీస్పూన్ల(15-20 గ్రాములు)ను మించకుండా చక్కెర తీసుకోవచ్చు. అయితే.. 100 గ్రాముల కార్న్‌ఫ్లేక్స్ అల్పాహారంగా తీసుకుంటే.. అందులోనే 15-16 గ్రాముల వరకు చక్కెర, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, మాల్టోజ్ ఉంటాయి. ఫ్లేవర్డ్ మిల్క్, ఇతర స్వీట్లు, చిరుతిళ్లను పరిగణనలోకి తీసుకుంటే..16 టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెర తీసుకుంటున్నట్లే’’అని పోషకాహార నిపుణురాలు సాఫియా వివరించారు.
భారత్‌లో ‘ప్యాకేజ్డ్’ దారుణం
గత ఏడాది ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ తరఫున న్యూటిషన్ విద్యార్థి శ్రీజ భారత్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, చైనా, చిలీ వంటి 12 దేశాల్లో ప్యాకేజ్డ్ ఆహారం, పానీయాలపై అధ్యయనం చేశారు. భారత్‌లో అత్యంత అనారోగ్యకరమైన రీతిలో ప్యాకేజ్డ్ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. జార్జ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్, ఆస్ట్రేలియన్ హెల్త్‌స్టార్ రేటింగ్ సిస్టమ్ ఫర్ అసెస్‌మెంట్‌తో కలిసి శ్రీజ ఇచ్చిన రేటింగ్స్‌లో.. భారత్ అట్టడుగున ఉండడం గమనార్హం..!
ఇంటి ఆహారమే మేలు
ఒక గ్రాము చక్కెరతో శరీరానికి 4కిలో క్యాలరీలు అందుతాయి. మనిషి ఎత్తు, బరువును బట్టి తీసుకునే చక్కెరను నియంత్రించుకోవాలి. వ్యాయామాలు, శారీరక శ్రమ ద్వారా తీసుకునే చక్కెరను కరిగించవచ్చు. కానీ, చిన్నారులు వీటికి దూరంగా ఉంటారు. అందుకే.. వారు రోజుకు 20 గ్రాములకు మించి చక్కెర తీసుకోకూడదు. స్వీట్ తినాలనిపించినప్పుడు వారికి తాజా పళ్లు, కిస్‌మిస్, ఖర్జూరం, అంజూర, డ్రైఫ్రూట్స్, అరటిపళ్లను ఇవ్వొచ్చు. ఇంట్లో తయారుచేసే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్యాకేజ్డ్ ఆహారాన్ని త్యజించాలి.
- ఎం.గాయత్రి, డైటిషన్, అపోలో ఆస్పత్రి
జాగ్రత్తలే శ్రీరామ రక్ష
తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలే.. ఆరోగ్యం పాలిట శ్రీరామరక్షగా ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకునే ఆహారంలో చక్కెర తక్కువగానే ఉంటుంది. ప్యాకేజ్డ్ ఆహారంలో నిగూఢ(హిడెన్/యాడెడ్) చక్కెర, ఉప్పు అధికంగా ఉంటాయి. ఇలా ఎక్కువ మొత్తంలో చక్కెర కారణంగా పిల్లల్లో హైపర్‌యాక్టివిటీ పెరిగి, ఏకాగ్రతను కోల్పోతారు. చిన్నారుల్లో ఊబకాయ లక్షణాలు మొదలయ్యాయంటే.. ఫ్యాటీలివర్ సమస్య, టైప్-2 మధుమేహం రిస్క్ పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. కొవ్వు పదార్థాలు పేరుకుపోవడానికి చక్కెర ఓ కారణం కావడంతో గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి.
- లీనతారెడ్డి, పిడియాట్రిక్ ఎండోక్రైనాలజీ కన్సల్టెంట్, రెయిన్‌బో ఆస్పత్రి
వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు
చక్కెర ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. చిన్నారుల్లో ప్యాకేజ్డ్ ఆహారం వల్ల మధుమేహం వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాల్లేకున్నా.. ఫ్యాటీలివర్ వంటి సమస్యలు మాత్రం తీవ్రంగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు
అధిక చక్కెర శరీరంలో భౌతికంగా ప్రతికూలతలను చూపుతుంది. మెదడులో డోపమైన్ విడుదల పెరిగి, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు ఇన్సులిన్ కూడా ఎక్కువగా విడుదలవుతుంది. అధిక చక్కెరను తీసుకోవడానికి అడ్డుకట్ట వేయకుంటే.. ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ పెరిగి, మధుమేహానికి కారణమవుతుంది
చిన్నారుల్లో ఊబకాయానికి పరిమితికి మించిన చక్కెర ఓ కారణమని వైద్యులు చెబుతున్నారు
ఒక చెంచా కెచ్‌పలో.. ఒక చెంచా చక్కెర ఉంటుంది. నిజానికి రోజువారీ క్యాలరీల్లో చక్కెర వాటా 10శాతాన్ని మించకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏకంగా దీన్ని 5శాతానికి పరిమితం చేయాలని సూచిస్తోంది.
అధిక చక్కెర వల్ల పిల్లల్లో కడుపునొప్పి, అలర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి
మెదడులో హిప్పోక్యాంపస్ దెబ్బతిని, బుద్ధిమాంద్యానికి దారితీస్తుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గడం, త్వరగా నేర్చుకోలేకపోవడం వంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి
కంటి చూపు పైనా చక్కెర దుష్ప్రభావాలుంటాయి
డైట్ అత్యంత ముఖ్యం
ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ప్రకారం భోజనం ద్వారా లభించే క్యాలరీలను విభజిస్తే.. కొవ్వు పదార్థాలు 15-30ు, పిండిపదార్థాలు 55-75ు కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇక మాంసకృత్తులు 10-15ు తప్పనిసరిగా ఉండాలి. అంతకంటే 5-10ు మించిన సమస్య ఉండదు. చక్కెర మాత్రం 5ు కంటే తక్కువగా ఉండాలి.
ఉప్పు విషయానికి వస్తే.. సంవత్సరం లోపు పిల్లలు రోజుకు ఒక గ్రాము లోపు మాత్రమే తీసుకోవాలి. 1-3 సంవత్సరాల పిల్లలకు 2 గ్రాముల్లోపు, 4-6 సంవత్సరాల పిల్లలకు 3 గ్రాముల్లోపు, 11 ఏళ్లు దాటిన పిల్లలకు 6 గ్రాముల వరకూ ఉప్పు అందవచ్చు.
చిన్నవయసులో ఉప్పు, చక్కెరలను ఎంతగా తగ్గిస్తే.. భవిష్యత్ ఆరోగ్యం అంత బాగుంటుంది. లేకుంటే.. భావి పౌరులు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు
Updated Date - Dec 23 , 2024 | 03:07 AM