Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!
ABN, Publish Date - Dec 24 , 2024 | 03:43 AM
తొలి ఏడాది పాలనలో రుణమాఫీ పథకం అమలుకు పూర్తి ప్రాధాన్యమిచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రెండో సంవత్సరంలో రైతులకు సంబంధించిన ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది.
రైతుల ముంగిట్లోకి రెండు వ్యవసాయ సంక్షేమ పథకాలు
యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం
యాంత్రీకరణ పథకంతో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు
కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా సంక్రాంతి నుంచే
30న మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం!
గడిచిన ఏడాదిలో రుణమాఫీకి ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): తొలి ఏడాది పాలనలో రుణమాఫీ పథకం అమలుకు పూర్తి ప్రాధాన్యమిచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రెండో సంవత్సరంలో రైతులకు సంబంధించిన ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. సంక్రాంతి పండుగకు రైతు భరోసా, యాంత్రీకరణ పథకాలను రైతుల ముంగిట్లోకి తీసుకొస్తోంది. రేషన్ కార్డులు లేనివారికి కొత్త కార్డులు పంపిణీ చేసే పథకాన్ని కూడా సంక్రాంతి నుంచే అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవలి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చించిన అంశాలతోపాటు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కొన్ని కొత్త సంక్షేమ పథకాలు కూడా సంక్రాంతి నుంచి అమల్లోకి రానున్నాయి. మొదటి సంవత్సరం వ్యవసాయ రంగంలో కీలకమైన రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన విషయం తెలిసిందే. నాలుగు విడతల్లో 25.36 లక్షల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో పాటు ఏడాదిలో ఒక విడత రైతుబంధు నిధులు కూడా విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం 2023-24 సంవత్సరంలో ఒక పంటకు రైతుబంధు ఇచ్చి, రెండో పంటకు ఎగ్గొట్టిందని, తాము తొలి ఏడాదిలో ఒక పంటకు పాతలెక్క ప్రకారం ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,500 కోట్లు రైతుబంధు ఇచ్చామని రేవంత్ సర్కారు వెల్లడించింది. ఇక రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసి రెండో పంటకు ఎకరానికి రూ.7,500 చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించింది.
ఉపసంఘం నివేదిక రాగానే రైతు భరోసా..
రైతు భరోసా పథకాన్ని సంక్రాంతికి అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించిన విషయం విదితమే! శాసనసభ, శాసనమండలిలో ఇటీవల రైతు భరోసాపై చర్చ కూడా పెట్టారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం కొన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఒకటి, రెండు సార్లు ఉపసంఘం భేటీ నిర్వహించి తుది నివేదిక ఇవ్వనుంది. అనంతరం దానిపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఆమోదించనున్నారు. మార్గదర్శకాలు ఖరారు చేసి... ఉత్తర్వులు జారీచేయనున్నారు. జనవరి 10 లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నారు. అయితే యాసంగి సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. రైతులు వరి నార్లు పోశారు. అక్కడక్కడ నాట్లు వేస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేసే రైతులు ఇప్పటికే విత్తనాలు వేశారు. ఈ నేపథ్యంలో విధి విధానాలు ఖరారుచేసి.. యాసంగి సాగు ఊపందుకోకముందే.. రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఎకరానికి రూ. 5 వేలు చెల్లించగా... ఇప్పుడు 50 శాతం పెంచి, ఎకరానికి రూ. 7,500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అంటే రెండు పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు రైతుభరోసా పథకంలో చెల్లిస్తారు. సంక్రాంతి నుంచి ఈ పథకం అమలులోకి వస్తుండటం గమనార్హం.
యాసంగి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ
కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే... వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసింది. 2018 నుంచి 2023 వరకు రైతులకు ఏ పనిముట్లు కూడా సబ్సిడీపై పంపిణీ చేయలేదు. విత్తన సబ్సిడీలను కూడా ఎత్తివేసింది. కేవలం రైతుబంధు, రైతుబీమా పథకాలకే పరిమితమైంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాసంగి సీజన్ నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వ మద్దతుతో యాంత్రీకరణ పథకాన్ని అమలుచేయనుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) పథకంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఆర్థిక సాయం చేస్తోంది. 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు చెల్లిస్తే సరిపోతుంది. ఈమేరకు 2024- 25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.26 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు తన వాటాగా జమ చేసింది. మొత్తం రూ. 46 కోట్లతో యాంత్రీకరణ పథకం యాసంగి నుంచి పట్టాలెక్కనుంది. వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల ద్వారా కాకుండా.. నేరుగా వ్యవసాయశాఖ ద్వారా యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటోవేటర్లు, పవర్ టిల్లర్లు, తైవాన్ స్పేయర్లు, పసుపు ఉడకబెట్టే బాయిలర్లు, మొక్కజొన్నలు ఒలిచే మెషిన్లు, హార్వెస్టర్లు, పత్తి తీసే యంత్రాలు, గడ్డి కత్తిరించే యంత్రాలు, మామిడి కాయలు కోసే యంత్రాలు, గడ్డికట్టలు కట్టే బేలర్లు, ఎంబీ నాగళ్లు.. తదితర పనిముట్లను రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. వారం, పది రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించి సంక్రాంతికి పథకాన్ని ప్రారంభించనున్నారు.
కొత్త రేషన్‌కార్డులూ సంక్రాంతికే...
కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా సంక్రాంతి నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఉభయసభల్లో ప్రకటించారు. కొత్త రేషన్‌కార్డులకు సుమారు 10 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటికే ఉన్నకార్డు ల్లో అదనంగా సభ్యుల చేర్పులకు 26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కసరత్తుచేసి సంక్రాంతి నుంచి కొత్త కార్డులు పంపిణీ చేయనున్నారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు, చేర్పులు చేసి, క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకొని డిజిటల్ కార్డులను పంపిణీకి చర్యలు చేపట్టనున్నారు.
30న క్యాబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 30న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ఇటీవల తన పుట్టినరోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్లి.. లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు. యాదగిరిగుట్టకు బోర్డును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. 20 మందితో బోర్డు ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రాథమిక నిర్ణయం తీసుకోగా.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి బోర్డు ఏర్పాటుకు ఆమోదముద్ర వేయనున్నారు. అదే క్రమంలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయ యాంత్రీకరణ.. తదితర సంక్షేమ పథకాలపై కేబినేట్ భేటీలో చర్చించనున్నారు.
Updated Date - Dec 24 , 2024 | 03:43 AM