Hyderabad: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై సమీక్ష..
ABN, Publish Date - Jun 24 , 2024 | 03:37 AM
తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, వాటి తీరుతెన్నులు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఆదివారం సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిర నియోజకవర్గాల ఎంపిక
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, వాటి తీరుతెన్నులు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఆదివారం సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్కూల్ భవనం, పరిసరాలు, ఏవిధంగా ఉండాలో సూచిస్తూ ఆర్కిటెక్చర్ రూపొందించిన పలు నమూనాలను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా తరగతి గదులతో పాటు, విద్యార్థులకు అన్ని వసతులుండేలా ఇంటర్నేషనల్ స్కూళ్లకు ధీటుగా అధునాతన భవనాలు నిర్మించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.
రాష్ట్రమంతటా స్థలాలు అందుబాటులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్ రిసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలను ఒకేచోట నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్థి చేయాలని, అప్పుడు గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా నిర్వహించే వీలుంటుందని సర్కారు భావిస్తోంది. వీటి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర సర్కారు పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్, మధిర నియోజవర్గాలను ఎంపిక చేసింది. ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం ఒక్కోచోట 20 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమిని సేకరించింది.
Updated Date - Jun 24 , 2024 | 03:37 AM