Steroids: వామ్మో స్టిరాయిడ్స్!
ABN, Publish Date - Nov 02 , 2024 | 03:35 AM
శరీరంలో వాపులను తగ్గించే స్టిరాయిడ్ ఔషధాల వాడకం రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటి అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీ వైద్యులు.. నొప్పులంటూ తమ వద్దకు వస్తున్న పేదసాదలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు అడ్డగోలుగా స్టిరాయిడ్ ఇంజెక్షన్లు చేసేస్తున్నారు.
స్టిరాయిడ్స్.. రెండు వైపులా పదునైన అంచులున్న కత్తిలాంటి ఔషధాలివి! మానవాళి అభివృద్ధి చేసిన ప్రాణ రక్షక ఔషధాల్లో చాలా ముఖ్యమైనవి!! కానీ.. వీటి వాడకానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క తప్పితే పెనుప్రమాదమే. ఉదాహరణ కావాలా.. కరోనా సమయంలో ఆ మహమ్మారి బారి నుంచి లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది ఈ స్టిరాయిడ్‌లే. కానీ, వీటి విచ్చలవిడి వాడకం వల్ల బ్లాక్‌ఫంగస్ బారిన పడ్డవారెందరో!! మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని బస్తీల్లో.. ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్‌ఎంపీల (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు) నుంచి.. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెద్ద డాక్టర్ల దాకా చిన్న చిన్న సమస్యలకూ విచ్చలవిడిగా ఈ ఔషధాలను సిఫారసు చేయడం ఆందోళన కలిగిస్తోంది!
నొప్పుల నివారణకు ఇష్టారాజ్యంగా ఇస్తున్న ఆర్‌ఎంపీలు
కొందరు వైద్యులదీ అదే దారి.. విచ్చలవిడిగా వాడితే దుష్ప్రభావాలు
తరచూ ఇన్ఫెక్షన్ల ప్రమాదం.. బోలు ఎముకలు, బరువు పెరగడం,
చర్మం పల్చగా కావడం వంటి సమస్యలు
హృద్రోగ, కిడ్నీ వ్యాధుల గండం.. నిర్దేశిత రీతిలో వాడకుంటే ముప్పు
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): శరీరంలో వాపులను తగ్గించే స్టిరాయిడ్ ఔషధాల వాడకం రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటి అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీ వైద్యులు.. నొప్పులంటూ తమ వద్దకు వస్తున్న పేదసాదలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు అడ్డగోలుగా స్టిరాయిడ్ ఇంజెక్షన్లు చేసేస్తున్నారు. పట్టణాల్లోని బస్తీల్లో కూడా అదే పరిస్థితి! స్టిరాయిడ్ల విచ్చలవిడి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలిసిన కొందరు ఎంబీబీఎస్ వైద్యులు కూడా.. వాటిని సిఫారసు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రోగులు కూడా.. నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కావాలనుకోవడం ఈ జాడ్యాన్ని మరింత పెంచుతోంది. స్టిరాయిడ్లను ఇష్టం వచ్చినట్టుగా వాడేవారు తీవ్ర దుష్ప్రభావాల బారిన పడుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రమంతా వైరల్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది ఒకేసారి చికున్‌గున్యా, డెంగీ బారిన పడ్డారు. ఒళ్లంతా నొప్పులు, ముఖ్యంగా కీళ్లనొప్పుల బారిన పడ్డవారి సంఖ్య అధికం. కొందరిలో ఆ నొప్పులు కొన్నివారాల వ్యవధిలో తగ్గితే మరొకొందరిలో నెలల తరబడి వాటి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అలాంటివారిలో చాలామంది నొప్పుల బాధ భరించలేక స్టిరాయిడ్స్ వాడి కొత్త అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.
ఏంటీ ఈ స్టెరాయిడ్స్...
మన శరీరంపై వైర్‌సలు, బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు.. లేదా మనకు ఏదైనా దెబ్బ తగిలి గాయమైనప్పుడు.. మన రోగనిరోధక వ్యవస్థ స్పందించి ఇన్‌ఫ్లమేటరీ కణాలను, సైటోకైన్లను పంపిస్తుంది. ఆ కణాలు అక్కడికి చేరుకోగానే.. బ్యాక్టీరియా/వైర్‌సలను నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపడతాయి. దీన్ని వైద్య పరిభాషలో ‘ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్’ అంటారు. ఈ ప్రక్రియలో నొప్పి, వాపు, ఆ ప్రాంతం ఎర్రగా కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనిపించాయంటే రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందనడానికి నిదర్శనం. అలాగే.. కొన్ని సందర్భాల్లో మన రోగ నిరోధక వ్యవస్థ అదుపు తప్పి శరీరభాగాలపైనే దాడి చేసి ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతుంది. కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్), సొరియాసిస్ (చర్మ వ్యాధి), లూపస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇందుకు ఉదాహరణ. అలాంటి వ్యాధుల బారినపడ్డవారికి సాధారణ నొప్పి నివారణ మందుల వల్ల అంతగా ఉపశమనం కలగదు. అలాంటి సందర్భాల్లో వారికి వైద్యుల సిఫారసు ప్రకారం స్టిరాయిడ్ ఔషధాలను ఇస్తే.. అవి రోగనిరోధక వ్యవస్థ స్పందనను మందగింపజేసి (ఇమ్యూన్ సప్రెషన్) ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ను తగ్గిస్తాయి. తద్వారా వాపు తగ్గి, రోగికి ఉపశమనం కలుగుతుంది. అంతటి శక్తిమంతమైన మందులను వైరల్ జ్వరాల వల్ల వచ్చే వాపులు, నొప్పులు తగ్గడానికి.. అది కూడా జ్వరం వచ్చిన వెంటనే ఎక్కువ మోతాదులో వాడడం తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తోంది. నిపుణులైన, అర్హులైన, అనుభవజ్ఞులైన వైద్యులెవ్వరూ స్టిరాయిడ్స్‌ను తప్పనిసరి అయితే తప్ప సిఫారసు చేయరు.
పద్ధతిగా వాడాలి..
స్టిరాయిడ్ ఔషధాలను నిర్ణీత విధానం ప్రకారం వాడాల్సి ఉంటుంది. రోగి వయసు, ఎత్తు, బరువు ఆధారంగా వైద్యులు ఎంత మోతాదులో వాడాలో సిఫారసు చేస్తారు. కొంతకాలంపాటు ఆ డోసు వాడిన తర్వాత.. మళ్లీ వైద్యపరీక్షలు చేయించి, మోతాదు తగ్గిస్తారు. మరికొంతకాలం ఆ డోసు వాడాక ఇంకొంత తగ్గిస్తారు. ఇలా తగ్గించుకుంటూ వచ్చి చివరికి ఆపేసే విధానాన్ని ‘టేపరింగ్’ అంటారు. ఆ పద్ధతిలో కాకుండా.. నొప్పులు రాగానే వాడి, తగ్గగానే ఆపేయడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే.. కొన్ని చర్మ సంబంధిత సమస్యలకు వైద్యులు స్టిరాయిడ్లు రాస్తారు. రోగులు.. మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లకుండా అవే ఆయింట్‌మెంట్/క్రీములను దీర్ఘకాలంపాటు వాడేస్తారు. కానీ.. అందులోని స్టిరాయిడ్ చర్మం ద్వారా శరీరంలోకి వెళ్తుంది. దాన్ని ప్రాసెస్ చేయాల్సింది కాలేయమే. కాబట్టి పైపూతగా వాడే స్టిరాయిడ్‌ల వల్ల ప్రమాదం ఉంటుందనుకోకూడదు. వాటిని కూడా వైద్యులు చెప్పిన ప్రకారం ఎంతకాలం వాడాలో అంతకాలమే వాడి ఆపేయాలి. మళ్లీ సమస్య వస్తే మళ్లీ వైద్యులను సంప్రదించాలి తప్ప సొంతవైద్యం కూడదు.
దీర్ఘకాలం వాడితే..
స్టిరాయిడ్‌ల వాడకం వల్ల ఆకలి విపరీతంగా పెరుగుతుంది. దీంతో ఎక్కువగా తినేసి బరువు పెరుగుతారు. కోపం, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటివి కలుగుతాయి. ఎముకలు బలహీనపడతాయి. అందుకే వైద్యులు ఈ దుష్ప్రభావాలను తగ్గించే ఇతర ఔషధాలను కూడా సిఫారసు చేస్తారు. ఇక.. వైద్యుల పర్యవేక్షణ లేకుండా, ఇష్టం వచ్చిన డోసులో దీర్ఘకాలంపాటు స్టిరాయిడ్లు వాడితే అడ్రినల్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. శరీరంలోని ఎముకలు గుల్లబారిపోతాయి. కంటి శుక్లాలు, మధుమేహం, చర్మం పల్చబారిపోవడం, అలర్జీలు, రక్తం గడ్డకట్టడం, హృద్రోగాల, మూత్రపిండ వ్యాధుల వంటి బారిన పడే ప్రమాదం ఉంటుందని.. గుండెపోటు ముప్పు అధికమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలోనే స్టిరాయిడ్ల ఉత్పత్తి!
స్టిరాయిడ్‌ల మాట వినగానే చాలామంది భయపడతారు! నిజానికి మనం ట్యాబ్లెట్లు/ఇంజెక్షన్లు/ఆయింట్‌మెంట్‌లు/ఇన్‌హేలర్లు/స్ర్పేల రూపంలో తీసుకునేవన్నీ సింథటిక్ స్టిరాయిడ్‌లు. మన శరీరంలోనే ఉత్పత్తి అయ్యే.. హార్మోన్లుగా మనం చెప్పుకొనే.. టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరోన్, కార్టిసాల్ వంటివన్నీ సహజ స్టిరాయిడ్‌లు. వీటిలో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ కండరాల నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సహజ స్టిరాయిడ్లను వాటిని అడ్రినల్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. కానీ.. మందుల రూపంలో స్టిరాయిడ్స్‌ను శరీరంలోకి పంపడం వల్ల కొంత కాలానికి అడ్రినల్ గ్రంధి పనితీరు దెబ్బతింటుంది.
అనవసరంగా వాడితే తీవ్ర అనర్థాలు
స్టిరాయిడ్స్ అంటే.. ప్రాణాలను కాపాడే ఔషధాలు. కానీ వీటిని అవనరంగా వాడితే తీవ్రమైన అనర్థాలుంటాయి. నొప్పులకు సంబంధించి సరైన రోగ నిర్థారణ పరీక్షలు చేయకుండానే గ్రామీణ ప్రాంతాల్లో పెయిన్ కిల్లర్స్‌గా వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇవి కేవలం నొప్పులను మాత్రమే తగ్గిస్తాయిగానీ.. జబ్బును కాదు. ఇష్టం వచ్చినట్టు వాడితే.. కాళ్లు, చేతులు సన్నబడి పొట్ట పెద్దగా అవుతుంది. అల్సర్స్ వస్తాయి. ఎముకలు బలహీనపడి ఆస్టియో పొరోసి్‌సకు దారి తీస్తుంది. కొన్నిసార్లు తుంటి కీలు మార్చాల్సిన దుస్థితీ తలెత్తుతుంది. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల.. క్షయ, ఫంగస్ వంటివాటి బారిన సులభంగా పడతారు. ఫ్లూ, న్యూమోనియా లాంటివి వస్తే త్వరగా తగ్గవు. గుండె, కిడ్నీ సమస్యలు పెరుగుతాయి.
- డాక్టర్ ఎంవీరావు, కన్సల్టెంట్ ఫిజిషియన్,
యశోదా ఆస్పత్రి, హైదరాబాద్
ప్రత్యామ్నాయాలున్నాయి
నొప్పినివారణకు.. నేరుగా స్టిరాయిడ్ ఇంజక్షన్స్, ట్యాబ్లెట్ల వాడకం మంచిది కాదు. వాటికి చాలా ప్రత్యామ్నాయాలున్నాయి. ముఖ్యంగా యాంటీ ఇన్ఫమ్లేటరీ డైట్‌ను తీసుకోవాలి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల పళ్లతో పాటు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అల్లంతో పాటు పసుపు మంచి యాంటీ ఇన్ఫమ్లేటరీగా పనిజేస్తుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉండే విత్తనాలు, ఫిష్ ఆయిల్ వాడాలి. అలాగే ఆలివ్ ఆయిల్‌ను నొప్పిఉన్న ప్రాంతంలో వేసి మర్దన చేయాలి. ఫిజియోథెరపీ, ఆక్యుపంచర్, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ లాంటివి చేయించుకోవచ్చు. నొప్పులను తాత్కాలికంగా తగ్గించుకోవాలన్న ఆలోచన కంటే.. దీర్ఘకాలికమైనా సురక్షిత విధానాలను అనుసరించడం మంచిది.
- డాక్టర్ జి.వెంకటేశ్వర్లు, క్రిటికల్‌కేర్ మెడిసిన్
స్పెషలిస్ట్, ఎండీ, శ్రీరక్ష హాస్పిటల్, ఖమ్మం
స్కిన్ వైటెనింగ్ స్టిరాయుడ్స్‌తో క్యాన్సర్ ముప్పు
చర్మ సంబంధిత సమస్యల్లో కొన్నింటికి తప్పకుండా స్టిరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. లేకుంటే రోగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కొన్ని సార్లు యాంటీబయాటిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు కూడా వీటిని వినియోగించాల్సి వస్తుంది. అలాగే స్టీవెన్‌జాన్సన్ సిండ్రోమ్‌కూ ఓరల్ స్టిరాయిడ్ వాడతాం. అయుతే ముఖం తెల్లగా ఉండటం కోసం స్కిన్ వైటనింగ్ స్టిరాయిడ్స్‌ను కొందరు వినియోగిస్తుంటారు. దానివల్ల వారంలో ముఖమంతా తెల్లబడుతుంది. కానీ, వాటిని ఎక్కువకాలం వాడితే చర్మ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే ముఖం కూడా మారిపోతుంది. ముఖ్యంగా.. చర్మవ్యాధులకు, చర్మానికి సంబంధించి వాడే స్టిరాయిడ్ల విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా, సిఫారసు, పర్యవేక్షణ లేకుండా వాడడం అనేక అనర్థాలకు దారి తీస్తుంది.
- డాక్టర్ రత్న కిషోర్, ఎండీ,
ఎల్‌ఆర్కే స్కిన్‌గ్లో హాస్పిటల్, హైదరాబాద్
Updated Date - Nov 02 , 2024 | 03:35 AM