Seethakka: పంచాయతీల నిధులపై హరీశ్ అబద్ధాలు
ABN, Publish Date - Aug 09 , 2024 | 04:13 AM
పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైసాకూడా ఇవ్వలేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని మాజీమంత్రి హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఽసీతక్క పేర్కొన్నారు.
నెలల్లో రూ.905.88 కోట్లు విడుదల చేశాం
సర్పంచులను పాడెక్కించిన పాపం బీఆర్‌ఎ్‌సదే: సీతక్క
హైదరాబాద్, ఆగస్టు8 (ఆంధ్రజ్యోతి): పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైసాకూడా ఇవ్వలేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని మాజీమంత్రి హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఽసీతక్క పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో మంత్రి మీడియాతో చిట్‌చాట్ చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక పంచాయతీలకు రూ.905.88 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నిధుల్లో 15వ ఆర్థికసంఘం నిధులు రూ.431.32కోట్లు ఉన్నాయని, అదనంగా గ్రామీణాభివృద్ధి ప్రత్యేక నిధుల పేరిట రూ.323.99 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు.
పారిశుధ్య కార్మికుల వేతన బకాయిల కోసం రూ.150.57 కోట్లు విడుదలచేస్తూ జూలై13న ఉత్తర్వులిచ్చామని వెల్లడించారు. ఇవన్నీ విస్మరించి ఓ సీనియర్ నాయకుడు వాస్తవాలను వక్రీకరిస్తూ.. ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సర్పంచులను ఆత్మహత్యలకు పాల్పడేలా చేసి.. వారిని పాడెక్కించిన పాపం బీఆర్‌ఎస్ సర్కారుదేనని సీతక్క విమర్శించారు. గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపి ఇప్పుడు నీతి సూక్తులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖల పురోగతిని అంచనా వేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సీతక్క వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల13న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానుంచి ప్రారంభిస్తామని చెప్పారు.
Updated Date - Aug 09 , 2024 | 04:13 AM