Pawan Kumar: ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్టు పవన్ కుమార్ మృతి
ABN, Publish Date - Oct 04 , 2024 | 03:03 AM
ఆంధ్రజ్యోతి సీనియర్ సబ్ ఎడిటర్ జే పవన్ కుమార్ (57) అనారోగ్యంతో మృతిచెందారు.
కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి సీనియర్ సబ్ ఎడిటర్ జే పవన్ కుమార్ (57) అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన 2018లో మల్టిపుల్ మైలొమా క్యాన్సర్ బారినపడగా.. చికిత్స తర్వాత ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మళ్లీ అస్వస్థతకు గురికావడంతో సెప్టెంబరు 4న బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఏపీలోని గుంటూరుకు చెందిన పవన్ కుమార్ 1992లో ట్రైనీ సబ్ఎడిటర్గా ఆంధ్రజ్యోతిలో చేరారు. 2002 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ, రాయలసీమ జిల్లా ఎడిషన్లలో, తర్వాత హైదరాబాద్ సిటీ ఎడిషన్‌లో పనిచేశారు. కుమారుడిని అమెరికాలో ఎంఎస్ చదివించేందుకు పంపాలని ఏర్పాట్లు చేసుకుంటుండగా ఇంతలోనే పవన్ కుమార్ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం కూకట్పల్లి బాలాజీనగర్‌లోని (ఎంఐజీ 288) ఆయన నివాసానికి తీసుకురానున్నారు.
Updated Date - Oct 04 , 2024 | 03:03 AM