Share News

Cold Wave: ఆదిలాబాద్‌ @ 4.7

ABN , Publish Date - Dec 16 , 2024 | 03:27 AM

బారెడు పొద్దెక్కినా ఇంకాసేపు ముసుగుతన్ని పడుకుంటే బాగుణ్ణు అనిపిస్తోంది! కప్పుకున్న దుప్పటి తీయబుద్ధేయడం లేదు.. మంచం దిగాలనిపించడం లేదు.. అంతా చలిపులి భయంతోనే! ఉదయం గడియారం తొమ్మిది గంటలు కొట్టినా..

Cold Wave: ఆదిలాబాద్‌ @ 4.7

  • రాష్ట్రంలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

  • ఆదిలాబాద్‌ జిల్లా భీమాపూర్‌లో 6.3 డిగ్రీలు

  • పటాన్‌చెరులో 8.8 డిగ్రీలు, మరో 2 చోట్లా..

  • తెలంగాణ అంతటా వణుకు పుట్టిస్తున్న చలిపులి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): బారెడు పొద్దెక్కినా ఇంకాసేపు ముసుగుతన్ని పడుకుంటే బాగుణ్ణు అనిపిస్తోంది! కప్పుకున్న దుప్పటి తీయబుద్ధేయడం లేదు.. మంచం దిగాలనిపించడం లేదు.. అంతా చలిపులి భయంతోనే! ఉదయం గడియారం తొమ్మిది గంటలు కొట్టినా.. ఒకింత ఎండ బాగానే వచ్చినా ఆ వణుకు పోవడం లేదు. మలిసంఽధ్యలోనూ అంతే. సాయంత్రం నాలుగున్నర నుంచే వణికిస్తున్న చలి.. చీకట్లు కమ్ముకున్నాక పంజా విసురుతోంది. స్వెట్టర్లు, మఫ్లర్లు, కంబళ్లతో ప్రతిఘటించినా చలి తీవ్రతపోతేనా? చలి కారణంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామున కొన్నిచోట్ల దట్టమైన పొగమంచు కమ్ముకుంటుండటంతో రోడ్లపై ఎదురుగా వాహనాలు కనిపించడం లేదు. పల్లెల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దాచిన్నా చలిమంటల చుట్టూ చేరుతున్నారు. రాష్ట్రంలో శీతలగాలులు విజృంభిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. కాంక్రీటు జంగిల్‌ అయిన హైదరాబాద్‌లోనూ చలి బాగా పెరిగింది. పటాన్‌చెరులో 8.8 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి.


ఆ జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10డిగ్రీల లోపే నమోదయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లా భీమాపూర్‌లో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌ జిల్లా మమ్డాలో 6.6 డిగ్రీలు, ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణిలో 6.7, సంగారెడ్డి జిల్లా కొహిర్‌లో 6.8, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 7.6, నిజామాబాద్‌ జిల్లా కొటగిరిలో 7.7, మెదక్‌ జిల్లా శివంపేట, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 8, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 8.2, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 8.6, సిద్దిపేట జిల్లా అక్బర్‌పేటలో 8.6, రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలో 8.9, పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం పేర్కొంది ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో సోమవారం శీతలగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాగల రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉపరితల గాలులు గంటకు 6-8 కి.మీ వేగంతో ఈశాన్య దిశగా వీస్తాయని పేర్కొంది.

Updated Date - Dec 16 , 2024 | 03:27 AM