Vikarabad: ఇదెక్కడి దురదరా బాబు!

ABN, Publish Date - Dec 15 , 2024 | 05:07 AM

గాలిలో తేడా వచ్చిందో... నీటిలో మార్పు వచ్చిందో.. మరేదేమైనా జరిగిందో... తెలియదు కానీ... ఓ ఊరు ఊరంతా దురద సమస్యతో అల్లాడిపోతుంది.

Vikarabad: ఇదెక్కడి దురదరా బాబు!

  • చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఒకటే దురద

  • వికారాబాద్‌ జిల్లా బూరుగుపల్లిలో అంతుచిక్కని అనారోగ్య సమస్య.. నెల రోజులుగా ప్రజల అవస్థ

మోమిన్‌పేట్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): గాలిలో తేడా వచ్చిందో... నీటిలో మార్పు వచ్చిందో.. మరేదేమైనా జరిగిందో... తెలియదు కానీ... ఓ ఊరు ఊరంతా దురద సమస్యతో అల్లాడిపోతుంది. పగలు, రాత్రి అనే తేడా లేదు... చిన్నా, పెద్దా అనే వ్యత్యాసం లేదు.. ఎటు చూసినా, ఎవరిని పలకరించినా అందరిదీ ఒకటే బాధ.. ‘ఇదెక్కడి దురదరా బాబు..!’... గోళ్లతో శరీరాన్ని గీక్కుకుని ఒళ్లంతా దద్దుర్లు ఏర్పడ్డమే కానీ... దురదల తీవ్రత మాత్రం తగ్గదే.. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం బూరుగుపల్లిలోని పరిస్థితి ఇది. సుమారు 1200 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఒకటి, రెండు కాదు ప్రజలు నెల రోజులుగా దురదలతో నరకయాతన అనుభవిస్తున్నారు.


దాదాపు500 మంది వరకు బాధితులు ఉండగా వారిలో చిన్నపిల్లల సంఖ్యే అధికం. నెల రోజులు ఉన్న ఈ సమస్య తీవ్రత రెండు, మూడు రోజులుగా మరింత అధికమైంది. దురదను తాళలేక గోళ్లతో గోక్కుకుని చర్మం దద్దుర్లు తేలి ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది దురద నివారణకు మందులు ఇస్తున్నా సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. గ్రామానికి మిషన్‌ భగీరథ నీరు సరఫరా నిలిచిపోవడంతో బోరు ద్వారా వచ్చే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీళ్ల వల్లే ఈ సమస్య వచ్చి ఉంటుందని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. ఏదేమైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడంతోపాటు దురద సమస్యకు పరిష్కారం చూపాలని బూరుగుపల్లి ప్రజలు వేడుకుంటున్నారు.

Updated Date - Dec 15 , 2024 | 05:07 AM