Warangal: ఆశలన్నీ తాటిచర్ల-2 పైనే..
ABN, Publish Date - Jun 24 , 2024 | 04:12 AM
బొగ్గు గనుల వేలం సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వరుసగా తెలంగాణలోని బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తుండటంతో.. తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది.
వేలంతో సింగరేణికి దక్కని బొగ్గు నిక్షేపాలు
2017లో ఏఆర్‌ఎం కంపెనీకి తాటిచర్ల-1 తాటిచర్ల-2లో 180 మి.టన్నుల బొగ్గు
సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
వరంగల్ , జూన్ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బొగ్గు గనుల వేలం సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వరుసగా తెలంగాణలోని బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తుండటంతో.. తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సింగరేణి ఆశలన్నీ భూపాలపల్లి జిల్లా తాటిచర్ల-2 గనిపైనే ఉన్నాయి. 2017లో తాటిచర్ల-1 ఓసీపీని జెన్‌కో ద్వారా ఏఎంఆర్ ప్రైవేటు కంపెనీకి గత బీఆర్‌ఎస్ సర్కారు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ తాటిచర్ల-1 నుంచి కేటీపీపీకి 30 ఏళ్లపాటు బొగ్గును సరఫరా చేయనుంది. అక్కడ ప్రైవేటు కంపెనీ బొగ్గు ఉత్పత్తి భారీగా చేస్తుండటంతో.. కేంద్రం తెలంగాణలోని ఇతర బొగ్గుబ్లాకులపై కన్నేసిందనే చర్చ జరుగుతోంది.
2015 దాకా ప్రభుత్వం తెలంగాణలో ఉన్న గనులన్నింటినీ సింగరేణికే కేటాయిస్తూ వచ్చింది. అయితే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 2015లో బొగ్గు గనుల వేలానికి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. తెలంగాణలోని సత్తుపల్లి బ్లాక్-3, కోయగూడెం బ్లాక్-3, కళ్యాణఖని బ్లాక్-6, శ్రావణపల్లి గనుల్లో బొగ్గు నిక్షేపాలను గుర్తించేందుకు సింగరేణి కంపెనీ రూ.66 కోట్ల దాకా ఖర్చు చేసినా.. కేంద్రం ఈ బ్లాకులను సింగరేణికి కేటాయించకుండా వేలంలో పెట్టింది. దీంతో సింగరేణివ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గకుండా వేలం నిర్వహించింది. తొలి రెండు టెండర్లలో పాల్గొనేందుకు కంపెనీలు ముందు కు రాలేదు. మూడోసారి మాత్రం కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాకు-3లను ప్రైవేటు కంపెనీలు సింగిల్ బిడ్డర్లుగా దక్కించుకున్నాయి.
అలాగే గత శుక్రవారం వేలం వేసిన 60 గనుల్లో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి గని కూడా ఉంది. అందులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఈ గని కూడా ఏదో ఒక ప్రైవేటు కంపెనీకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3లలో సుమారు 20కోట్ల టన్నులకు పైగా బొగ్గు ఉన్నట్లుగా గుర్తించారుగానీ.. ఇప్పటి వరకూ ఆ రెండు గనుల్లో కంపెనీలు బొగ్గు ఉత్పత్తి చేయట్లేదు. దీంతో ఈ రెండు గనులను సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవటం లేదు. కనీసం శ్రావణపల్లి గనినైనా తమకే నేరుగా కేటాయించాలని పట్టుబట్టినానిబంధనల పేరుతో వేలంలో పెట్టింది. ఈ మూడు గనులూ వేలంలో చేజారిపోవడంతో రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత ఏర్పడే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది.
తీవ్ర ప్రయత్నాలు..
తాటిచర్ల-2 గనిలో 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. సుమారు 30ఏళ్ల కాలపరిమితితో ఇక్కడి నుంచి బొగ్గు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఈ బ్లాకు చేజారిపోకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో తాజాగా కొలువుదీరిన కొత్త సర్కారులో.. బొగ్గు, గనులశాఖ మంత్రిగా తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తుండటం కొంతమేర ఊరటగా భావిస్తున్నారు. అయితే వేలం జోష్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వం తాటిచర్ల-2ను కూడా వేలం వేస్తే మాత్రం సింగరేణి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడనుంది.
Updated Date - Jun 24 , 2024 | 04:12 AM