MBBS: ఇక్కడే పుట్టిపెరిగి.. చదివినా.. వైద్యవిద్యలో ‘నాన్ లోకల్’ఇక్కడే పుట్టిపెరిగి.. చదివినా.. వైద్యవిద్యలో ‘నాన్ లోకల్’
ABN, Publish Date - Sep 30 , 2024 | 04:01 AM
ఈ ఫొటోలోని విద్యార్థిని పేరు గార్లపాటి వర్షిత. హైదరాబాద్‌లోని మణికొండలో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుకుంది. తండ్రి ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందినవారు.
200 మంది విద్యార్థులకు అన్యాయం
వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం
సుప్రీంకోర్టుకు మరో 18 మంది
నేడు సీటు అలాట్‌మెంట్ జాబితా
ఈ ఫొటోలోని విద్యార్థిని పేరు గార్లపాటి వర్షిత. హైదరాబాద్‌లోని మణికొండలో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుకుంది. తండ్రి ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందినవారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగిగా జీవనం కొనసాగించే ఆయన.. కొవిడ్ సమయంలో ఉద్యోగం పోవడంతో.. కూతురిని తన భార్య స్వస్థలం(కృష్ణాజిల్లా నూజివీడు)లో ఇంటర్ చదివించారు. వర్షితకు నీట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. కానీ, ఇంటర్ ఆంధ్రప్రదేశ్‌లో చదవడం వల్ల.. ఆమె తెలంగాణలో నాన్-లోకల్‌గా మారింది.
మరో విద్యార్థి 1 నుంచి 12 వరకు తెలంగాణలో కాదు కదా.. అస్సలు మన దేశంలోనే చదువుకోలేదు. కానీ.. తెలంగాణలో ఎంబీబీఎ్‌సలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాను స్థానికుడిని కాదంటే ఎలా? అంటూ కోర్టుకు వెళ్లారు. ఇటువంటి 134 కేసులన్నింటినీ కలిపి.. కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించాలని న్యాయస్థానం ఇటీవల ఆదేశించింది. మరికొంత మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలా.. మొత్తం 170 మంది వరకు కోర్టుల ఆదేశాలతో కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇందులో సగం మంది అస్సలు తెలంగాణలోనే చదవలేదు. ఇంకా చెప్పాలంటే.. వారి తల్లిదండ్రులు కూడా తెలంగాణకు చెందినవారు కాదు. ప్రభుత్వం హైకోర్టు చెప్పినట్లుగా స్థానికతపై మార్గదర్శకాలను విడుదల చేయకుండా.. సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. అక్కడా ఊరట లభించకపోవడంతో.. కోర్టుకెళ్లిన విద్యార్థులకు(లోకల్ కాకపోయినా) కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశమిస్తామని ఒప్పుకొంది. దీంతో.. అసలైన తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది.
200 మందికి తీరని అన్యాయం..!
రాష్ట్రంలో ఈ సారి నీట్ యూజీ పరీక్షకు 77,848 మంది హాజరవ్వగా.. 47,356 మంది అర్హత సాధించారు. జీవో 33 ప్రకారం వరుసగా నాలుగేళ్లు 9, 10, ఇంటర్ ఇక్కడే చదివి ఉంటే.. లోకల్‌గా పరిగణిస్తారు. దీంతో పది తరువాత ఇంటర్+నీట్ కోచింగ్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన తెలంగాణ విద్యార్థులు నాన్-లోకల్ అయిపోయారు. వీరు కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు. నాన్‌లోకల్స్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. వైద్య విశ్వవిద్యాలయం అధికారులు జీవో-33 ప్రకారం 924 మందిని నాన్-లోకల్‌గా గుర్తిస్తూ.. వారి దరఖాస్తులను తిరస్కరించింది.
వీరిలో సుమారు 400 మంది దరఖాస్తులు ఏపీలోనూ తిరస్కరణకు గురయ్యాయి. మరో 350 మంది వరకు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో చదివిన స్థానికేతరులున్నారు. మిగతా 200 మంది వరకు విద్యార్థులు తెలంగాణ శాశ్వత నివాసితులు. వరుసగా నాలుగేళ్లు ఇక్కడ చదవని ఒకేఒక్క కారణంతో వీరు కౌన్సెలింగ్ అర్హతను కోల్పోయారు. దీనిపై 18 మంది విద్యార్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. గత కేసులో 135 మంది విద్యార్థుల మాదిరిగానే.. వీరికి కూడా కౌన్సెలింగ్‌కు అవకాశమిచ్చే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఆర్థిక స్తోమత లేక.. కోర్టు మెట్లెక్కని విద్యార్థుల పరిస్థితి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. వీరంతా ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
నేడు సీట్ల కేటాయింపు
కన్వీనర్ కోటా మొదటి రౌండ్‌కు సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రక్రియ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఎంపికైన విద్యార్థులకు కాలేజీల వారీగా సోమవారం మధ్యాహ్నం సీట్ల కేటాయింపు జరపనున్నారు. ఈ నేపథ్యంలో.. రెండేళ్లు బయట చదవడంతో స్థానికతను కోల్పోయిన విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. సీట్ల కేటాయింపునకు ముందే.. స్థానికతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఒక్కసారి సీట్ల కేటాయింపు జరిగితే.. తమకు మంచి కాలేజీల్లో అవకాశాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్
Updated Date - Sep 30 , 2024 | 04:01 AM