Supreme Court: కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ
ABN, Publish Date - Aug 11 , 2024 | 04:52 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐలు అరెస్టు చేశాయి. కవిత తొలుత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేయగా ట్రయల్ కోర్టు తిరస్కరించింది.
ఆ తర్వాత సీబీఐ, ఈడీ కేసుల్లో సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మళ్లీ నిరాశే ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా బెయిల్ దక్కలేదు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో క్రిమినల్ ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. శుక్రవారం రిజిస్ట్రీ వెరిఫై చేసింది. జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందుకు కేసు రానున్నట్టు తెలిపింది. సీబీఐ కేసులో ఈ నెల 21 వరకు, ఈడీ కేసులో ఈ నెల 13 వరకు ట్రయల్ కోర్టు కవితకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. దీనిపై ఆమె చేసిన అప్పీలునే కోర్టు విచారణ జరపనుంది.
Updated Date - Aug 11 , 2024 | 04:52 AM