Kukatpally: లులు మాల్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు..
ABN, Publish Date - Jun 28 , 2024 | 03:37 AM
కూకట్‌పల్లిలోని లులు మాల్‌లో తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. మాల్‌లోని బేకరీలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, బూజు పట్టిన బ్రెడ్ మిక్స్, 10 కిలోల అట్ట బ్రెడ్ మిక్స్, 15 కిలోల లూజ్ బాగుట్టి బ్రెడ్ మిక్స్‌కు బూజు పట్టినట్టు గుర్తించారు.
నోటీసులు జారీ చేసిన టాస్క్‌ఫోర్స్
జేఎన్‌టీయూ క్యాంటీన్‌లోనూ అదే పరిస్థితి
హైదరాబాద్ సిటీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలోని లులు మాల్‌లో తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. మాల్‌లోని బేకరీలో కాలం చెల్లిన ఆహార పదార్థాలు, బూజు పట్టిన బ్రెడ్ మిక్స్, 10 కిలోల అట్ట బ్రెడ్ మిక్స్, 15 కిలోల లూజ్ బాగుట్టి బ్రెడ్ మిక్స్‌కు బూజు పట్టినట్టు గుర్తించారు. గడువు ముగిసిన 20 కిలోల నువ్వుల గింజలు, 20 లీటర్ల టోన్డ్ పాలు, 7.5 కిలోల బిస్కెట్ ప్యాకెట్లు, ఐదు కిలోల జెమ్స్, రెండు ప్యాకెట్ల పళ్ల రసాలు గుర్తించి బయట పడేశారు. అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి పత్రాన్ని ప్రవేశ ద్వారం వద్ద ప్రదర్శించ లేదని గుర్తించారు.
నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. అనంతరం జేఎన్‌టీయూలోని క్యాంటీన్ (శ్రీ శ్రీ కేటరర్స్)లో తనిఖీలు నిర్వహించి కాలం చెల్లిన 3.5 కిలోల బియ్యం పిండిని గుర్తించారు. ఆహార పదార్థాలు నిల్వ ఉంచడంలో ప్రమాణాలు పాటించలేదని అపరిశుభ్ర వంటగది, సిబ్బంది హెయిర్ క్యాపులు, గ్లౌజులు ధరించలేదని, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, సిబ్బందికి సంబంధించిన ఆరోగ్య ధ్రువపత్రాలు లేవని అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
Updated Date - Jun 28 , 2024 | 03:37 AM