ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rythu Runa Mafi: అక్షరం తేడా ఉన్నా.. మాఫీ కాని రుణం!

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:48 AM

అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు.

  • రైతుల రుణమాఫీకి సాఫ్ట్‌వేర్‌ చిక్కులు!.. పేరులో ఒక్క అక్షరం తేడా ఉన్నా జాబితా నుంచి ఔట్‌

  • వివరాలు సరిపోవట్లేదని తిరస్కరణ

  • ముగ్గురిలో ఒక్క పాస్‌బుక్‌ రద్దయితే.. మిగిలిన వారికీ నిలిపివేత

  • ఇద్దరు అన్నదమ్ములుంటే ఒకే ఆధార్‌ లెక్కలోకి తీసుకొని స్ర్కీనింగ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు. రేషన్‌కార్డు ఆధారంగా రైతు కుటుంబాల ఎంపిక, ఆధార్‌ సీడింగ్‌లో దొర్లిన తప్పులతో అర్హులకు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేరు, ఇంటి పేరులో ఒక్క అక్షరం తేడా ఉన్నా, ఆధార్‌ కార్డుపై ఉన్న చిరునామా, బ్యాంకు ఖాతా వివరాల్లో చిన్న, చిన్న తేడాలున్నా.. లబ్ధిదారుల జాబితాలో పేర్లు తీసేశారు.


బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎ్‌స)లో రూపొందించిన రైతుల జాబితాలు, నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ)లో ప్రాసెసింగ్‌ లోపాలు ఇందుకు కారణమవుతున్నాయి. రుణమాఫీ లబ్ధిదారుల జాబితా తయారీ, డేటా ప్రాసెసింగ్‌, రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబాన్ని ఎంపిక చేయడంలో తప్పులు దొర్లాయి. బ్యాంకులు, పీఏసీఎ్‌సలలో తయారుచేసిన రుణమాఫీ జాబితాలు తప్పుల తడకగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ రైతుకు రూ.లక్ష అప్పు ఉంటే.. రూ.21 వేలు మాత్రమే మాఫీ అయింది. వ్యవసాయాధికారిని అడిగితే, బ్యాంకుకు వెళ్లి అడగాలని చెప్పారు. బ్యాంకుకు వెళ్తే.. ప్రభుత్వం నుంచి ఇంతే మంజూరైందన్నారు.


  • తల్లి చనిపోతే కొడుక్కి రాని రుణమాఫీ

ఒక కుటుంబంలో భార్య, భర్త, తల్లి ముగ్గురు ఉంటే.. వారికి వేర్వేరుగా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. తల్లి చనిపోవటంతో రెవెన్యూ శాఖ పాస్‌బుక్కును రద్దు చేసింది. భార్యాభర్తలకు పాస్‌బుక్కులు అలాగే ఉన్నాయి. అయితే తల్లితోపాటు ఒకే రేషన్‌కార్డులో వీరిద్దరి పేర్లు ఉండటంతో.. కొడుకు, కోడలు రుణమాఫీని కూడా ఆపేశారు. ఇక అన్నదమ్ములు ఇద్దరు వేర్వేరుగా ఉంటే... వారిని ఒకే ఆధార్‌ నెంబరు కింద తీసుకొని పెండింగ్‌ పెట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన అక్కల దివ్యవాణి ఏడాది క్రితం రూ.62 వేల అప్పు తీసుకోగా.. రుణమాఫీ జాబితాలో ఆమె పేరు రాలేదు. తన భర్త తిరుపతి, ఇతర కుటుంబ సభ్యులెవరూ పంటరుణం తీసుకోలేదు. అయినా దివ్యవాణికి రుణమాఫీ కాలేదు. నిజామాబాద్‌ జిల్లా ఐలాపూర్‌కు చెందిన ఎర్రటి సావిత్రికి రూ.65 వేల అప్పు ఉంది. ఈమె ఆధార్‌ నెంబరు వేరే కుటుంబం పరిధిలో ఉంది. ఆ కుటుంబంతో సావిత్రికి ఎలాంటి సంబంధంలేదు. అయినా.. తప్పుడు ఆధార్‌ నమోదు కారణంగా సావిత్రి పేరు రుణమాఫీ జాబితాలో రాలేదు. ఇదే జిల్లాలోని ఎత్తొండ గ్రామానికి చెందిన సాగి చంద్రశేఖర్‌ పేరు ఆధార్‌లో అక్షర దోషాలు ఉండటంతో రుణమాఫీ రాలేదు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన కట్కూరి సుధాకర్‌కు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.50 వేల అప్పు ఉంది. ఏటా రెన్యువల్‌ చేస్తున్నారు. వడ్డీతో కలిపి రూ. 50-60 వేలకు మించదు. అయినా మాఫీ కాలేదు.


  • అన్నదమ్ముల్లో ఒకరు చనిపోయారని..

నిర్మల్‌ జిల్లా బాసర గ్రామంలో డొప్పోల్ల సురేష్‌, రామ్‌, సుభాష్‌ అనే సోదరులకు సహకార బ్యాంకులో తలో రూ.50 వేల క్రాప్‌ లోన్‌ ఉంది. వీరికి ఒకే రేషన్‌ కార్డు ఉంది. పట్టాదారు పాస్‌పుస్తకాలు వేర్వేరుగా ఉన్నాయి. వీరిలో సుభాష్‌ కొంతకాలం క్రితం చనిపోయారు. చనిపోయిన రైతులకు కూడా రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సుభాష్‌ పేరు లేదు. బ్రతికి ఉన్న సురేష్‌, రామ్‌ సోదరుల పేర్లు కూడా జాబితాలో లేవు. రంగారెడ్డి జిల్లా కందుకూరు సహకార సంఘంలో పంట రుణాలు తీసుకుంటే.. మేడ్చల్‌, శామీర్‌పేట, ఘట్కేసర్‌ సహకార సంఘాల్లో మాఫీ జాబితాలో పేర్లు వచ్చాయి. ఆధార్‌ నెంబర్లు వేరే పీఏసీఎ్‌సలో నమోదు చేయటంతో తప్పు జరిగింది. ఉదాహరణకు కందుకూరుకు చెందిన ఎడ్ల నర్సింహ ఆధార్‌ నెంబరును మేడ్చల్‌ సొసైటీలోని పుట్టు సత్తయ్య పేరుమీద నమోదు చేశారు. దీంతో నర్సింహకు రూ.55 వేలు మాఫీ కాలేదు. సత్తయ్యకు రూ.13,834 మాఫీ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన తలసాని యశోదమ్మ 2018లో కెనరా బ్యాంకులో రూ.41,500 అప్పు తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపినా రూ.లక్ష లోపే ఉంటుంది. కానీ, ఆమెకు రేషన్‌ కార్డు లేకపోవడంతో రుణమాఫీ కాలేదు. ఇలాంటి వారు రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఉన్నారు.


  • ఇంటిపేరులో అక్షరాలు తేడా ఉన్నాయని పక్కన పెట్టారు

ఆధార్‌ కార్డుమీద ఇంటిపేరుతో కలిపి నా పేరు సండ్రాస్‌ భగవంత్‌ అని ఉంది. బ్యాంకు ఖాతాలో ఎస్‌.భగవంత్‌ అని ఉంది. దీంతో రుణమాఫీ జాబితా నుంచి తీసేశారు. నా పేరుమీద రూ. 38 వేలు, భార్య మంగమ్మ పేరుమీద రూ. 30 వేల రుణం ఉంది. వడ్డీతో సహా ఇద్దరిదీ కలిపి రూ.1 లక్ష లోపే ఉంటుంది. అయినా మాకు రుణమాఫీ కాలేదు.

- సండ్రాస్‌ భగవంత్‌, గండీడ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా


  • జాబితాలోనే నాపేరు లేదు

నాకు 18 గుంటల భూమి ఉంది. గీసుకొండ పీఏసీఎ్‌సలో రూ.30 వేలు అప్పు తీసుకున్నా. నాకు ఒక సోదరుడు ఉన్నాడు. వేర్వేరుగా నివాసముంటున్నాం. రేషన్‌ కార్డులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. అయినా రుణమాఫీ జాబితాలో నా పేరులేదు. పీఏసీఎస్‌ నుంచి ప్రభుత్వానికి పంపిన జాబితాలోనే నాపేరు రాయలేదు.

- కుమారస్వామి, గీసుకొండ, వరంగల్‌ జిల్లా


  • కెనరా బ్యాంకులో రుణ ఖాతాలు మార్చకపోవడంతో..

కెనరా బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. బ్యాంకులో రైతుల పేరుమీద సాధారణ ఖాతా వేరుగా ఉంటుంది. ఒకవేళ ఆ రైతు రుణం తీసుకుంటే... లోన్‌ అకౌంట్‌ను వేరుగా తెరుస్తారు. రుణాన్ని రెన్యువల్‌ చేసినప్పుడు లోన్‌ అకౌంట్‌ను క్లోజ్‌ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ కొత్త లోన్‌ అకౌంట్‌ తీస్తారు. అయితే కెనరా బ్యాంకులో రైతుల రుణాలు రెన్యువల్‌ చేసిన సమయంలో లోన్‌ అకౌంట్లు మార్చలేదు. పాత లోన్‌ అకౌంట్లతోనే రెన్యువల్‌ చేశారు. ఇప్పుడు పాత లోన్‌ అకౌంట్లు రుణమాఫీ జాబితాలోకి రాలేదు. కేవలం కటాఫ్‌ తేదీ లోపల కెనరా బ్యాంకులో కొత్తగా క్రాప్‌ లోన్‌ తీసుకున్న రైతులకే రుణమాఫీ వర్తించింది. బ్యాంకులో ఆరాతీస్తే.. పాత ఖాతాదారులకు రుణమాఫీ వర్తించలేదని తేలింది.


ఉదాహరణకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ కెనరా బ్యాంకులో పంటరుణాలు తీసుకున్న అర్హులైన రైతులకు రూ.16 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా.. రూ.90 లక్షలు మాత్రమే మాఫీ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కెనరా బ్యాంకులో లోన్‌ తీసుకున్న 52,211 మంది రైతులకు మొదటి విడతలో రూ.294 కోట్ల మాఫీ వచ్చింది. రెండో విడతలో 24,285 మంది రైతులకు రూ. 256 కోట్ల మాఫీ వచ్చింది. వీరంతా కటాఫ్‌ తేదీ లోపు కొత్తగా రుణాలు తీసుకున్న రైతులే కావటం గమనార్హం. రెన్యువల్‌ చేసిన వారికి మాత్రం భంగపాటు ఎదురైంది. బ్యాంకర్ల తప్పిదంతో జరిగిన ఈసమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 07:09 AM

Advertising
Advertising
<