Tummala Nageshwar Rao: వరి, ఇతర పంటల విత్తనాల ఉత్పత్తిని పెంచాలి
ABN, Publish Date - Aug 04 , 2024 | 05:02 AM
తెలంగాణలో వరితో పాటు ఇతర పంటల విత్తనాల ఉత్పత్తిని పెంచాలని, అందుకు అధికారులు కొత్త ఆలోచనలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
ఖమ్మం మార్కెట్‌ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి... వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సమీక్షలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో వరితో పాటు ఇతర పంటల విత్తనాల ఉత్పత్తిని పెంచాలని, అందుకు అధికారులు కొత్త ఆలోచనలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సచివాలయంలో వ్యవసాయ, కో-ఆపరేటివ్, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులు, ఆయా శాఖలకు అనుబంధంగా ఉన్న కార్పొరేషన్ల చైర్మన్లతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నామని సీడ్ కార్పొరేషన్ చైర్మన్, అధికారులు మంత్రికి వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5,700 మంది విత్తన ఉత్పత్తిదారులు ఉన్నారని, వారంతా నాణ్యత ప్రమాణాల ప్రకారమే విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారని, ఆ విత్తనాలను ఆగ్రోస్, డీసీఎంఎస్, పీఏసీఎ్‌సల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పరిఽధిలోని గోదాములు ఖాళీగా ఉంటున్నాయని, ప్రైవేటు గోదాములు మాత్రం నిండుగా ఉంటున్నాయని.. లోపం ఎక్కడుందో గుర్తించి దాన్ని పరిష్కరించాలన్నారు. వివిధ సంస్థల అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములన్నిటినీ పరిరక్షించాలని, వాటిని వినియోగంలోకి తీసుకువచ్చే అంశంపైనా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.
2024-25 ఏడాదిలో నిర్ధేశించుకున్న మేరకు ఆయిల్‌పామ్ సాగును లక్ష ఎకరాలకు తీసుకువెళ్లాలన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ఆధునికీకరించడానికి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం 72 వేల బ్యాగుల నిల్వ సామర్థ్యం ఉండగా, ఆధునికీకరణతో దాదాపు 1.37 లక్షల బ్యాగులకు నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, దీంతో పాటు ఓపెన్ ఏరియాలోనూ నిల్వ ఉంచే అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, నూతన సాంకేతికతతో దేశంలోనే అగ్రగామి మార్కెట్‌గా ఖమ్మం మార్కెట్‌ను ఆధునికీకరించాలన్నారు. ఆ పనులు వెంటనేమొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ చైర్మన్లతో పాటు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Aug 04 , 2024 | 05:02 AM