Telangana Assembly: తెలంగాణ గుండెల్లో.. కలకాలం మన్మోహన్
ABN, Publish Date - Dec 31 , 2024 | 03:27 AM
మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రదానం చేయాలని తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది.
ప్రధానమంత్రిగా.. రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్ ఆయన
సోనియాగాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చిన గొప్ప నాయకుడు
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
శాసనసభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం.. ఆమోదం
రుణ మాఫీకి ఆయనే స్ఫూర్తి: భట్టి
మన్మోహన్ ప్రతిభను గుర్తించింది పీవీ
ఆయనకూ రాజధాని ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలి: కేటీఆర్
స్కిల్స్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి: హరీశ్
ఈ సమయంలో వియత్నాంకు రాహుల్ సంతాప తీర్మానాల్లో ఏలేటి కలకలం
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రదానం చేయాలని తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించడానికి సోమవారం శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇందులో మన్మోహన్‌కు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ తెలంగాణకు ఆత్మబంధువు. 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన నాయకుడు. ప్రధాని హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించారు. తెలంగాణతో ఆయన అనుబంధం విడదీయలేనిది. పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చేసిన, రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్‌గా మన్మోహన్ సింగ్‌ను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది’’ అని అన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాటను పార్లమెంట్ ప్రక్రియ ద్వారా నెరవేర్చే బాధ్యత తీసుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు.
ఉద్యమాలను, ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, అటువంటి మహనీయుడికి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఘనంగా నివాళి అర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి ఎంత రుణపడి ఉంటారో.. మన్మోహన్ సింగ్‌కు కూడా అంతే రుణపడి ఉంటారని అన్నారు. ‘‘ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ (ఎల్‌పీజీ) విధానాలను తీసుకొచ్చి.. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడేలా తీర్చిదిద్డడంలో తెలంగాణ బిడ్డ పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ వేసిన పునాదులే కారణం. ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త ఆయన. ఆయన మరణం కుటుంబానికే కాదు.. దేశానికి, ప్రపంచానికే తీరని లోటు. నీతి, నిజాయతీ, నిబద్ధతలో ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలంటే అది మన్మోహన్ సింగ్. దేశ ప్రధానిగా పదేళ్లపాటు పని చేసిన ఆయన ప్రజాస్వామ్య రక్షణ కోసం మాతో కలిసి ధర్నాలో కూర్చున్నారు. నాకు, ఉత్తమ్, కోమటిరెడ్డికి ఆ సంఘటన జీవితకాలం గుర్తుండిపోతుంది’’ అని వివరించారు. ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టి.. అనంతపురం, మహ బూబ్‌నగర్‌ల్లో ఆ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాతగా గొప్ప పరిపాలన అందించడానికి పునాది వేసిన అంబేడ్కర్ స్ఫూర్తిగా భూ సేకరణ చట్టంలో మార్పులు చేశారని, 2013 భూసేకరణ చట్టంలో గ్రామంలో ఉన్న వారందరికీ పరిహారం ఇచ్చేలా చేశారని గుర్తు చేశారు. అటవీ హక్కుల రక్షణ చట్టం-2006 వల్లే పోడు భూములకు పట్టాలిస్తున్నామని చెప్పారు.
తెలంగాణకు మన్మోహన్ ఆశీస్సులు
‘‘మన్మోహన్ మరణ వార్త విని.. ఢిల్లీ వెళ్లి ఆయన సతీమణిని కలిశాను. నివాళులర్పిస్తూ.. నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అని పరిచయం చేసుకున్నాను. అప్పుడు.. కూర్చో అని చెప్పి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చారు. ఆ రాష్ట్రాన్ని మీరు కష్టపడి అభివృద్ధి పథంవైపు నడిపించాలి. మన్మోహన్ సింగ్ ఆశీస్సులు తెలంగాణకు ఉంటాయని మన్మోహన్ సింగ్ సతీమణి చెప్పారు’’ అని సీఎం రేవంత్ వివరించారు. ఎన్నో విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. 140 కోట్ల మంది ప్రజలకు, అన్ని సంఘాలు, ఆర్‌ఎ్‌సఎస్ నుంచి ఆర్‌ఎ్‌సయూ వరకు, కమ్యూనిస్టుల నుంచి మిగతా అన్ని రాజకీయ పార్టీలు మన్మోహన్ సింగ్ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి ఉందని చెప్పారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన చతురతతో తెలంగాణ ఏర్పడిందని, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆయన విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రం ఉన్నంత వరకూ మన్మోహన్ పేరు: భట్టి
తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేశారని, రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ఆయనేనని తెలిపారు. దేశ రాజకీయాల్లో మహోన్నత శిఖరాలకు ఎదిగి.. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ ఏర్పాటు చేసిన పునాదులపై సమున్నత ఆర్థిక సౌధాన్ని మన్మోహన్ నిర్మించారని మంత్రి శ్రీధర్‌బాబు కొనియాడారు. మన్మోహన్ సింగ్ తన పదేళ్లకాలంలో 114 విలేకరుల సమావేశాలు పెట్టినా.. మౌన ప్రధానిగా మీడియా, విపక్షాలు ప్రచారం చేశాయని ఆక్షేపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న స్టార్ట్‌పలకు ఆయనే స్ఫూర్తి అని తెలిపారు. దేశంలో పేదల సంక్షేమం కోసం మైలురాయి లాంటి చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్‌కే దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భూ సేకరణ చట్టం, అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ, ఆహార భద్రత, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చట్టాలతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. మన్మోహన్ గొప్ప మానవతావాది, ఆర్థిక శిల్పి, దార్శనికుడని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చారన్నారు. మన్మోహన్ మేథస్సు, ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల గురించి ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోందని, 15వ లోక్‌సభలో ఆయనతో కలిసి పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలలో ఆయన కృషి మరువలేనిదన్నారు. యువతకు స్ఫూర్తిగా, నిజాయితీకి నిలువుటద్దంగా ఉన్న మన్మోహన్ సింగ్ విగ్రహాలను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కోరారు. ఢిల్లీలో చలి కాలంలో తాము పార్లమెంట్ ముందు ధర్నా చేస్తుంటే 90 ఏళ్ల వయసులో కూడా తమతోపాటు ఆయన కూర్చున్నారని. ఆనాటి ఫొటోను చూస్తే కన్నీళ్లు వచ్చాయని అన్నారు. ఐదు నెలల వయసులో తల్లిని కోల్పోయిన ఆయన అనేక కష్టాలు పడి ఉన్నత స్థానానికి చేరారని మంత్రి సీతక్క గుర్తు చేశారు. గొప్ప సంస్కరణల ద్వారా సంక్షేమానికి చట్టబద్ధత కల్పించారని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఆకలి మనిషికి అతి పెద్ద శత్రువు అని గుర్తించి దాన్ని రూపుమాపేందుకు ఆహార భద్రత చట్టం తెచ్చారని, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చి 30 వేల కొత్త పాఠశాలలు నిర్మించారని గుర్తు చేశారు.
సంతాప దినాల్లో రాహుల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్: ఏలేటి
మన్మోహన్‌కు నివాళులర్పించే క్రమంలో బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. ‘‘మన్మోహన్ మరణ వార్త తెలియగానే ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. ఢిల్లీలో స్మారక చిహ్నం ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించారు. తెలుగు బిడ్డ పీవీని పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుర్తించలేదు. కానీ, ఆ పార్టీ ఇవ్వనంత గౌరవాన్ని భారత రత్న ప్రకటించి మోదీ ఇచ్చారు. ఆ కార్యక్రమానికి కూడా హాజరు కాకుండా సోనియా గాంధీ కక్ష పెట్టుకున్నారు. మన్మోహన్ మరణంతో దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటిస్తే.. న్యూ ఇయర్ సంబరాల కోసం రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారు’’ అని వ్యాఖ్యానించారు. దాంతో మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని, సంతాప తీర్మానంలో రాజకీయాలు వద్దని హితవు పలికారు. అయినా ఏలేటి అవే వ్యాఖ్యలు చేయడంతో మంత్రి పొన్నం జోక్యం చేసుకొని నిజమైన ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్త కూడా ఈ విధంగా మాట్లాడరని, మధ్యలో పార్టీలోకి పోయిన వారు ప్రాధాన్యం కోసం ఈ విధంగా మాటాడుతున్నారని ఆక్షేపించారు. వివాదం మంచిది కాదని హితవు పలికారు. ఏలేటి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అధికార పక్షం కోరగా.. తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దేశానికి గతి, గమనాన్ని నేర్పిన వ్యక్తి మన్మోహన్‌సింగ్ అని, ప్రపంచంలో భారత దేశం ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడం వెనుక కీలక భూమిక పోషించారని సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు కొనియాడారు. సంతాప తీర్మానాల్లో ఇతర అంశాలను చేర్చడం సరికాదని, కేటీఆర్ హుందాతనంతో మాట్లాడారని ఏలేటికి పరోక్షంగా చురకలంటించారు. వివాదం చేయడానికి అనేక వేదికలున్నాయని హితవు పలికారు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మహేశ్వరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ తదితరులు మాట్లాడారు. అనంతరం మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.
ఆధునిక భారత్‌కు నిశ్శబ్ద రూపశిల్పి: కేటీఆర్
సంతాప తీర్మానానికి పూర్తిగా మద్దతు తెలుపుతూ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. భారతరత్నకు మన్మోహన్ అర్హులని చెప్పారు. ‘‘ఆయన గొప్పతనం, సామర్థ్యం, తెలివితేటలను తొలుత గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు. ఆయనను ఆర్థిక మంత్రిగా నియమించారు. కేవలం 15 రోజులు మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్న పరిస్థితి నుంచి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా దేశాన్ని పరిగెత్తించారు. అనవసరపు డాంబికాలు, ఆర్భాటాలు, హడావుడి లేకుండా.. ‘సింపుల్ లివింగ్.. హై థింకింగ్’కు పర్యాయపదంగా జీవించారు. ఆయన ఆధునిక భారత నిశ్శబ్ధ రూపశిల్పి అని కొనియాడారు. లాయల్టీ (విశ్వాసం) అనేది రాజకీయాల్లో అరుదైన పదం. కానీ, తనకు అండగా నిలబడ్డ కాంగ్రెస్ వెంట జీవితాంతం నిలబడ్డారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏడాదిన్నరపాటు మంత్రిగా పని చేశారు. అప్పట్లో కేసీఆర్‌కు ఇచ్చిన షిప్పింగ్ శాఖపై డీఎంకే అభ్యంతరం తెలిపింది. కేసీఆర్ ఒక్క క్షణం కూడా సంకోచించకుండా.. తెలంగాణ కోసమే వచ్చానంటూ ఆ శాఖను వెనక్కి ఇచ్చారు. అప్పుడు ‘ఏ లక్ష్యం కోసం మీరు వచ్చారో ఆ లక్ష్యం ఫలించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని మన్మోహన్ అన్నారు’’ అని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిబద్ధత, బలం కారణంగా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే రాష్ట్రం వచ్చిందన్నారు.
ఎన్నో అడ్డంకులు, అభ్యంతరాలు ఉన్నా ప్రజాస్వామిక ఉద్యమాలకు ఆయన అండగా నిలబడ్డారని తెలిపారు. మన్మోహన్ గురించి మాట్లాడుకునేటప్పుడు పీవీని కూడా గుర్తు చేసుకోవాలని, గౌరవప్రదమైన వీడ్కోలు ఆయనకు దక్కలేదని, పీవీకి తప్ప ప్రధాన మంత్రులందరికీ ఢిల్లీలో స్మారకం ఉందని, పీవీకి కూడా స్మారకం ఏర్పాటు చేయాలంటూ తీర్మానం చేయాలని కోరారు. తాను కిరోసిన్ దీపాల కింద చదువుకుని దేశానికి వెలుగులు పంచిన గొప్ప నేత మన్మోహన్ సింగ్ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కొనియాడారు. ఆయన పేరును స్కిల్ యూనివర్సిటీకి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. దేశానికి అప్పు పుట్టని పరిస్థితి నుంచి ఆర్థికంగా బలోపేతమయ్యేలా పలు సంస్కరణలు అమలు చేశారని, కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్‌గా సంతకం చేసిన ఆయన.. ఆర్థిక మంత్రిగా దేశ ప్రగతికి చెరగని సంతకం చేశారని చెప్పారు. ‘‘పార్టీ ఓటమిపై ఆంటోనీ కమిటీ వేసిన కాంగ్రెస్ పెద్దలు.. అందుకు పీవీ, మన్మోహన్ ఆర్థిక విధానాలే కారణమని తేల్చితే సీడబ్ల్యూసీ సమావేశంలో మన్మోహన్ కన్నీరు పెట్టుకున్నారు. లాలు ప్రసాద్ యాదవ్‌ను కాపాడేందుకు మన్మోహన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై రాజకీయ దుమారం రేగితే అప్పట్లో రాహుల్ గాంధీ మీడియా సమక్షంలోనే ఆర్డినెన్స్ పత్రాలను చించి అవమానించారు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను తప్పుబట్టిన ఘనత కాంగ్రెస్ నాయకులది’’ అని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో నిలిచిపోయే అతికొద్ది మంది నేతల్లో మన్మోహన్ ఒకరని, ఆయన విగ్రహాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని, అలాగే, ఢిల్లీలో పీవీ స్మారకం ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
Updated Date - Dec 31 , 2024 | 03:27 AM