Medical Colleges: వైద్య విద్య ముందుకెలా?
ABN, Publish Date - Jul 29 , 2024 | 03:22 AM
రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, అనుబంధ ఆస్పత్రులకు సూపరింటెండెంట్లు దొరకడం కష్టమవుతోంది. విభాగాధిపతి(అడ్మినిస్ట్రేటివ్) పోస్టులైన వీటి కి.. వయో పరిమితి పెంపు బిల్లును గత ఏడాది ఏప్రిల్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళిసైకు పంపగా ఆమె తిరస్కరించారు.
69 విభాగాధిపతి పోస్టుల్లో రెగ్యులర్ 17 మందే.. సర్కారీ మెడికల్ కాలేజీ, బోధనాస్పత్రులకు ఇంచార్జిలే దిక్కు
పాస్ కాని అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్‌ల విరమణ వయసు పెంపు బిల్లు
61 నుంచి 65 ఏళ్లకు పెంచిన గత సర్కారు.. నాటి గవర్నర్ తిరస్కరణ
మరింత సమాచారం కావాలన్న ఇన్‌చార్జి గవర్నర్ రాధాకృష్ణన్
హైదరాబాద్, జూలై 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైద్య విద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, అనుబంధ ఆస్పత్రులకు సూపరింటెండెంట్లు దొరకడం కష్టమవుతోంది. విభాగాధిపతి(అడ్మినిస్ట్రేటివ్) పోస్టులైన వీటి కి.. వయో పరిమితి పెంపు బిల్లును గత ఏడాది ఏప్రిల్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళిసైకు పంపగా ఆమె తిరస్కరించారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక.. తమిళిసై వైదొలగాక.. సీపీ రాధాకృష్ణన్ ఇన్‌చార్జి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆయన వద్దకు వెళ్లి బిల్లు గురించి వివరించగా మరిన్ని వివరాలివ్వాలని కోరారు. ఇప్పుడు కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఆగస్టు తొలి వారంలో రెగ్యులర్ డీఎంఈ నియామకంపై కోర్టు కేసు విచారణ ఉంది. డిసెంబరు 21న ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్ రమేశ్‌రెడ్డిని కోర్డు ఆదేశాల మేరకు తప్పించి సీనియారిటీ జాబితాలో ఉన్న డాక్టర్ త్రివేణికి ఇన్‌చార్జి డైరెక్టరేట్ ఆఫ్ మెడిక ల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) బాధ్యతలు అప్పగించారు. ఆమె పనితీరుపై సంతృప్తి చెందని ప్రభుత్వం ఫిబ్రవరి 20న తప్పించింది.
సంగారెడ్డి వైద్య కళాశాల ప్రి న్సిపాల్‌గా ఉన్న డాక్టర్ ఎన్.వాణిని తీసుకొచ్చింది. కాగా, రెగ్యులర్ డీఎంఈని నియమించాలంటే ముందు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో ఉండే అదనపు డీఎంఈ పదవీ విరమణ వయసు పెంచాల్సి ఉంది. ఇది జరగాలంటే గవర్నర్ బిల్లుకు ఆమోదముద్ర వేయాలి. రాష్ట్రంలో వైద్యకళాశాలల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి ఇప్పటికే 56 కాలేజీలున్నాయి. ఈ ఏడాది సర్కారులో 8 ప్రైవేటులో 3 కాలేజీలు రానున్నాయి. అనుభవజ్ఞులైన ఆచార్యులు కొద్దిమందే ఉన్నారు. ఈ కొరత తీర్చేందుకు గతబీఆర్‌ఎస్ ప్రభుత్వం విభాగాధిపతుల విరమణ వయసును 61 నుంచి 65కు పెంచింది. అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదానికి పంపింది. కాగా, అదనపు డీఎంఈగా పదోన్నతి పొందిన వారినే ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, అనుబంధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లుగా నియమిస్తారు. ఆ పదోన్నతి రావాలంటే ఐదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. ముఖ్యంగా పదవీ విరమణకు ఏడాది సమయం కచ్చితంగా ఉండాలి.
ఈ ప్రకారం 59 ఏళ్ల వయసున్న సీనియర్లకే పదోన్నతులు దక్కుతాయి. వైద్య విద్యలో ప్రొఫెసర్ విరమణ వయసును తొలుత 58 నుంచి 61కు, తర్వాత 61 నుంచి 65కు పెంచారు. అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల విరమణ వయసు మాత్రం 61 వరకే ఉంది. దీన్ని కూడా 65 చేయాలనే యోచనతో గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో మొత్తం 66 రెగ్యులర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులున్నాయి. డీఎంఈ కార్యాలయంలో రెగ్యులర్ డీఎంఈ, అదనపు, అకడమిక్ డీఎంఈ పోస్టులున్నాయి. వీటిని అదనపు డీఎంఈ హోదా ఉన్నవారితో నే భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఈ హోదా 17 మందికే ఉంది. మిగిలిన 52 పోస్టుల్లో అందరూ ఇన్‌చార్జిలే ఉన్నారు.
అంటే.. అత్యధిక వైద్య కళాశాలలు, బోఽధనాస్పత్రుల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు ఇన్‌చార్జిలే. దీంతో కొన్నిసార్లు పాలన గాడి తప్పుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అదనపు డీఎంఈ పదోన్నతులు చేపట్టింది. ఐదేళ్లుకి మించి ఆచార్యులుగా పనిచేసినవారి జాబితా రూపొందించింది. మొత్తం 200 మంది ఉండగా 1:3 నిష్పత్తిలో 150 మంది జాబితాను సిద్ధం చేసింది. అయితే, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో ఉండేవారి విరమణ వయసు పెంపు బిల్లు ఆమోదం కాకుండా పదోన్నతులు చేపట్టబోమని సాధారణ పరిపాలన శాఖ తేల్చి చెప్పింది.
పదోన్నతులకు ముందుకు రాని వైనం
నిబంధనల మేరకు విభాగాధిపతులైన డీఎంఈ, అదనపు డీఎంఈలు 61 ఏళ్లు రాగానే విరమణ చేయాలి. అయితే ప్రొఫెసర్ల విరమణ వయసు 65. ఈ నేపథ్యంలో పదోన్నతులు తీసుకుంటే నాలుగేళ్ల సర్వీ్‌సను వదులుకోవాలి. దీనికి ఎవరూ ఇష్టపడడం లేదు. పదోన్నతులు తీసుకోకుంటే ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు కొనసాగొచ్చు. పదోన్నతి పొంది.. ఏ మారుమూల కాలేజీ ప్రిన్సిపాల్‌గా లేదా, ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసి 61 ఏళ్లు దాటాక మళ్లీ ప్రొఫెసర్‌గా ఎలా పనిచేస్తామంటూ ఓ ఆచార్యుడు ప్రశ్నించారు.
Updated Date - Jul 29 , 2024 | 03:22 AM