Pension Application: పింఛన్ దరఖాస్తుల లెక్క తీయండి
ABN, Publish Date - Jul 09 , 2024 | 03:06 AM
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పింఛన్ల దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. ఈ మేరకు పింఛన్ల కోసం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులపై మంత్రి సీతక్క ఆరా తీశారు.
వెంటనే అర్హుల జాబితాను సిద్ధం చేయండి
సమీక్షలో ఉన్నతాధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పింఛన్ల దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. ఈ మేరకు పింఛన్ల కోసం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అందిన దరఖాస్తులపై మంత్రి సీతక్క ఆరా తీశారు. వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సెర్ఫ్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్), మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆమె సమీక్షించారు. ప్రస్తుతం సెర్ఫ్ ద్వారా అమలవుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం పథకాలను వినియోగించుకోలేక పోయామని అధికారులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మ్యాచింగ్ గ్రాంట్లకు నిధులు కేటాయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కేంద్రం పథకాలను వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. వచ్చే బడ్జెట్‌లో మహిళాశక్తికి అవసరమైన నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అభయహస్తం పథకాన్ని అమలు చేయకుండా, మహిళల పొదుపు సొమ్మును గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు.
సంబంధిత వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యత లేని గుడ్లు పంపిణీ కావడంపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లతోపాటు ఇతర వస్తువుల నాణ్యతపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు ఎవరైనా నాసిరకం వస్తువులు సరఫరా చేస్తే తిరస్కరించాలని, లేని పక్షంలో సంబంధిత అంగన్‌వాడీ టీచర్, సిబ్బందిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంట్రాక్టు గడువును గత ప్రభుత్వం రెండేళ్లకు పెంచడం వల్లే కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, దీనిని తగ్గించేందుకు కసరత్తు చేయాలని సూచించారు.
Updated Date - Jul 09 , 2024 | 03:06 AM