Komatireddy Venkatareddy: ఇక బెనిఫిట్ షోలకు అనుమతివ్వం
ABN, Publish Date - Dec 07 , 2024 | 04:52 AM
తెలంగాణలో ఇక నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘బెనిఫిట్ షో’లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి వెళ్లడం సరికాదు
థియేటర్ వద్ద మహిళ మృతిపై మంత్రి కోమటిరెడ్డి
చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
కొనసాగుతున్న దర్యాప్తు.. బాధ్యులపై నేడో రేపో చర్యలు?
హైదరాబాద్, చిక్కడపల్లి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఇక నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘బెనిఫిట్ షో’లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సంధ్య థియేటర్‌లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షో చూడ్డానికి వెళ్లిన రేవతి అనే మహిళ.. అక్కడ తొక్కిసలాటలో చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను ఎంతగానో కలచివేసిందన్నారు. బెనిఫిట్ షో ప్రదర్శించే సమయంలో అల్లు అర్జున్ థియేటర్లకు వెళ్లడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సినిమా చూసేందుకు వచ్చిన మహిళ మరణించినా.. హీరో, చిత్ర బృందం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ‘ఇప్పుడు మనిషి ప్రాణాన్ని తీసుకురాగలరా?’ అని వారిని నిలదీశారు. ఈ సినిమా రూ.వేల కోట్లు వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారని.. కాబట్టి, బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఆ సినిమా హీరో, ప్రొడ్యూసర్లకు చెప్తున్నా వాళ్లను ఆదుకోవాల్సిందే’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. బాధ్యులపై ఒకటి-రెండు రోజుల్లోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Updated Date - Dec 07 , 2024 | 04:52 AM