ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Godavari-Kaveri link: గొట్టిముక్కల ఎగువన రెండు డ్యాంలు

ABN, Publish Date - Aug 10 , 2024 | 04:14 AM

గోదావరి-కావేరి అనుసంధానంలో వాటాగా వచ్చే నీటిని సమ్మక్క బ్యారేజీ పరిసరాల్లో కాకుండా.. పూర్వ నల్గొండ జిల్లా గొట్టిముక్కల ఎగువన 45 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను కేంద్ర నిధులతో కట్టించి, వాటి నుంచి వాడుకునే వీలు కల్పించాలని తెలంగాణ కోరింది.

  • వాటి నుంచే గోదావరి-కావేరి వాటా వినియోగం.. తెలంగాణ విజ్ఞప్తి.. కేంద్రం సూత్రప్రాయ అంగీకారం

  • సమ్మక్క బ్యారేజీలో 83-87 మీటర్ల మధ్య నీటిని వినియోగించుకోవాలి.. దిగువన వద్దు

  • బ్యారేజీ కన్వేయర్‌ వాడుకోండి: తెలంగాణ

  • రాష్ట్ర అభ్యంతరాలన్నింటికీ సమాధానాలు వచ్చాకే సంతకం పెడతామని స్పష్టం చేసిన అధికారులు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరి అనుసంధానంలో వాటాగా వచ్చే నీటిని సమ్మక్క బ్యారేజీ పరిసరాల్లో కాకుండా.. పూర్వ నల్గొండ జిల్లా గొట్టిముక్కల ఎగువన 45 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లను కేంద్ర నిధులతో కట్టించి, వాటి నుంచి వాడుకునే వీలు కల్పించాలని తెలంగాణ కోరింది. గోదావరి-కావేరిలో దక్కే వాటాను రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వినతికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అధ్యయనం అనంతరం దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.


‘గోదావరి-కావేరి అనుసంధానం’పై ఆరో సంప్రదింపుల సమావేశం జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్లూడీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగింది. దీనికి ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ తరఫున జనరల్‌ (డీజీ) భోపాల్‌సింగ్‌, దక్షిణాది విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) దేవేందర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌, అంతర్రాష్ట్ర వ్యవహారాల చీఫ్‌ ఇంజనీర్‌ ఓరుగంటి మోహన్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ అభ్యంతరాలను, ప్రతిపాదనలను రాహుల్‌ బొజ్జా కేంద్రానికి నివేదించారు. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా తరలించే 148 టీఎంసీల నీటిలో 33ు సరిపోదని.. 50 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని కోరారు.


గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా 5.3 లక్షల ఎకరాలకు నీటిని అందించడానికి అంగీకారం తెలిపిన విషయాన్ని గుర్తుచేసిన అధికారులు.. నల్గొండ జిల్లాలోని గొట్టి ముక్కలలో ఇదివరకే ప్రతిపాదించి, కట్టాలనుకున్న రిజర్వాయర్‌ కింద 80 వేల ఎకరాలు సాగులోకి రానుందని గుర్తు చేశారు. మిగిలిన 4.5 లక్షల ఎకరాలకూ నీరిచ్చేలా గొట్టిముక్కల ఎగువన రెండు లోయలు ఉన్న ప్రాంతంలో రెండు రిజర్వాయర్లను ఎన్‌డబ్ల్యూడీఏ తన నిధులతో కట్టించాలని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్‌ను గోదావరి-కావేరి లింక్‌లో ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌గా వినియోగించుకోవాలని ప్రతిపాదించినప్పటికీ.. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీపై బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరుగుతోందని గుర్తుచేశారు. ఆ విచారణ జరిగి.. నీటివాటాలు, ఆపరేషనల్‌ ప్రోటోకాల్‌ తేలిన తర్వాత సాగర్‌ను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా వాడుకోవడానికి ఇబ్బందుల్లేవని స్పష్టంచేశారు.


  • ఆ తర్వాతే సంతకాలు!

గోదావరి-కావేరి అనుసంధానానికి సంబంధించి అవగాహన ఒప్పందం(ఏంవోఏ)పై సంతకాలు చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ కోరగా.. రాష్ట్ర అధికారులు అందుకు నిరాకరించారు. ఛత్తీ్‌సగఢ్‌ వాడుకోని నీరు గోదావరి-కావేరిలో తరలిస్తుండటం వల్ల తొలుత ఆ రాష్ట్రం సమ్మతి తీసుకోవాలని.. సమ్మక్క బ్యారేజీ ఎత్తు 87 మీటర్ల దాకా పెంచుకోవడానికి(ప్రస్తుతం 83 మీటర్లకే ఎన్‌వోసీ ఇవ్వడానికి ఛత్తీ్‌సగఢ్‌ అభ్యంతరాలు లేవనెత్తుతోంది)ఆ రాష్ట్ర ఆమోదాన్ని పొందాలని, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ సమాధానాలు వచ్చాకే సంతకాలు పెడతామని అధికారులు తేల్చిచెప్పారు. అయితే.. గోదావరి-కావేరి అనుసంధానానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతున్నామని స్పష్టం చేశారు.


కాగా.. గోదావరి-కావేరిలో 50ు వాటా డిమాండ్‌ విషయంలో పట్టు సడలించాలని ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్‌ తెలంగాణకు విజ్ఞప్తిచేశారు. సాధ్యమైనంత మేర రాష్ట్రానికి న్యాయం చేస్తున్నామని, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై సానుకూలత ఉందని ఆయన స్పష్టంచేశారు. అనుసంధానానికి అయ్యే ఖర్చు రూ.45 వేల కోట్లలో 90ు కేంద్రమే భరిస్తుందని గుర్తు చేసిన ఆయన.. మిగిలిన 10 శాతాన్ని ఆయా రాష్ట్రాలు ఏ మేరకు నీటి వాటాను పొందుతున్నాయో ఆ మేరకు భరించాల్సి ఉంటుందన్నారు. జాతీయ సమగ్రత నేపథ్యంలో దీనికి రాష్ట్రాలు పెద్ద మనసుతో అంగీకారం తెలపాలని కోరారు.


  • ఆ నీటిని ముట్టుకోవద్దు..

సమ్మక్క బ్యారేజీని 83 మీటర్లతో కట్టామని.. 83-87 మీటర్ల మధ్యలో నీటిని నిల్వ చేసి, ఆ నీటిని మాత్రమే గోదావరి-కావే రీ అనుసంధానంలో తరలించాలని తెలంగాణ ప్రతిపాదించింది. 83 మీటర్ల కింద నిల్వ ఉన్న నీటిని ముట్టుకోరాదని.. రాష్ట్ర అవసరాలకు రక్షణ కల్పిస్తూ నీటిని తరలించాలని స్పష్టం చేసింది. సమ్మక్క బ్యారేజీ డీపీఆర్‌ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో పెండింగ్‌లో ఉందని, దానికి క్లియరెన్స్‌ ఇప్పించాలని కోరింది. సమ్మక్కను హెడ్‌గా వాడుకున్నప్పటికీ బ్యారేజీ మాత్రం తెలంగాణ నియంత్రణలో ఉండాలని రాష్ట్ర అధికారులు తేల్చిచెప్పారు.


అలాగే.. గోదావరి-కావేరి అనుసంధాన కన్వేయర్ల(నీటిని తరలించే వ్యవస్థలోని కాలువలు, టన్నెల్‌) నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ఇబ్బందులు రానున్నాయని, ఈ మార్గంలో రెండు పంటలు పండే భూములు ఉండటంతో రైతాంగం భూమిని అప్పగించడానికి ముందుకు రాకపోవచ్చని అధికారులు గుర్తుచేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా సమ్మక్క బ్యారేజీకి చెందిన కన్వేయర్‌ను వినియోగించుకోవాలని ప్రతిపాదించారు.

Updated Date - Aug 10 , 2024 | 04:14 AM

Advertising
Advertising
<