స్కిల్ వర్సిటీ.. కొలువు గ్యారెంటీ
ABN, Publish Date - Oct 14 , 2024 | 03:16 AM
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. ఇందులో కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికీ కచ్చితంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
100% ఉద్యోగాల కోసం కంపెనీలతో ఒప్పందాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ షురూ.. 29 వరకు చాన్స్
ఈ ఏడాది మూడు రంగాల్లో నాలుగు కోర్సులు
2 తాత్కాలిక ప్రాంగణాల్లో నవంబరు 4 నుంచి తరగతులు
శిక్షణకు తొలి బ్యాచ్‌లో 2 వేల మంది ఎంపిక
ఇవీ రంగాలు..
ఔషధ-ఆరోగ్య సంరక్షణ, రవాణా, సరుకు నిల్వ (లాజిస్టిక్స్) రంగాల్లో నాలుగు స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించనుంది.
ఇవీ కోర్సులు..
వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్‌సైనర్ ఎగ్జిక్యూటివ్, ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్స్‌లెన్స్, ఫార్మా అసోసియేట్ ప్రోగ్రాం సర్టిఫికేషన్
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. ఇందులో కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికీ కచ్చితంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్యం పెంచుకుంటే కొలువు గ్యారెంటీ అన్న భరోసా కల్పించనుంది. యువతలో నైపుణ్యాలు పెంచి, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్కిల్ వర్సిటీలో తరగతులు ప్రారంభం కానున్నాయి. కోర్సుల్లో ప్రవేశాలకు అర్హతలు, ఫీజు, వ్యవధి వంటి వివరాలను వర్సిటీ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే సంబంధిత రంగాల్లోని దిగ్గజ పరిశ్రమలతో ఒప్పందాలు కూడా పూర్తి చేసుకుంది.
ఇక 17 రంగాల్లో ఏటా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన వర్సిటీలో ఈ ఏడాది తొలి బ్యాచ్‌లో 2 వేల మందిని ఎంపిక చేయనున్నారు. వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్న తొలి బ్యాచ్ తరగతులకు సంబంధించిన ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్ (డజీటఠ.జీుఽ) ద్వారా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, సైబరాబాద్ ఇజ్జత్‌నగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)లోని రెండు తాత్కాలిక ప్రాంగణాల్లో తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం నర్సింగ్.
రాష్ట్రవ్యాప్తంగా 112 నర్సింగ్ కాలేజీల్లో 6500 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అనేక ఆస్పత్రుల్లో కేరళ, ఇతర రాష్ట్రాల నర్సులకే ప్రాధాన్యంఇస్తున్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచాలన్న లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్స్‌లెన్స్ (ఫైన్) పేరుతో 3 నెలల సర్టిఫికేషన్ కోర్సు ప్రకటించింది. స్కూల్ ఆఫ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో ఈ కోర్సును అమలు చేయనున్నారు. కోర్సు పూర్తిచేసిన తర్వాత అడ్వాన్స్ నర్స్ ప్రాక్టీషనర్, స్టాఫ్ నర్స్, నర్స్ ఎడ్యుకేటర్, క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్‌గా అవకాశాలు ఉంటాయి. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసినవారు, చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ కోర్సులో ప్రవేశాలకు అర్హులు. గరిష్ఠ వయస్సు 35. మూడు నెలల సర్టిఫికెట్ కోర్సుకు రూ.30 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సుకు అపోలో ఆస్పత్రుల గ్రూప్ ‘అపోలో మెడ్ స్కిల్స్ ఇండస్ట్రీ’ భాగస్వామ్యం అందించనుంది.
6 నెలల ‘ఫార్మా అసోసియేట్’ ప్రోగ్రాం..
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం వ్యాక్సిన్లలో మూడో వంతు హైదరాబాద్ నుంచే ఉండడం విశేషం. ఈ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంగా 6 నెలల ఫార్మా అసోసియేట్ కోర్సును ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు క్యాంప్‌సలో 7 రోజుల తరగతుల అనంతరం 6 నెలల అప్రెంటి్‌సషి్‌పను డాక్టర్ రెడ్డీస్ అందించనుంది. శిక్షణ కాలంలో రూ.17,500, కోర్సు పూర్తయ్యాక రూ.22 వేల చొప్పున వేతనం అందిస్తారు. రూ.5 వేలు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2023-24లో బీఎస్సీ (కెమిస్ట్రీ) పూర్తిచేసినవారు ప్రవేశాలకు అర్హులు.
వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం..
ఆన్‌లైన్ షాపింగ్ గణనీయంగా వృద్ధి చెందుతుండడంతో హైదరాబాద్ కేంద్రంగా అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే భారీ గోదాములు నిర్వహిస్తున్నాయి. అపార అవకాశాలున్న ఈ రంగంలో ఉద్యోగాలకు మూడున్నర నెలల వ్యవధితో వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్ కోర్సును అందించనున్నారు. 26 ఏళ్లలోపు, ఇంటర్ కనీస అర్హతతో ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వేర్‌హౌస్ డేటా మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ క్వాలిటీ చెక్, వెహికిల్ ప్లానింగ్, ట్రెండ్ అనాలిసిస్ విభాగాల్లో శిక్షణ ఉంటుంది.
కోర్సు పూర్తయిన తర్వాత వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, వేర్ హౌస్ సూపర్‌వైజర్‌గా నియమిస్తారు. వివిధ దేశాల్లో ఐటీ, లాజిస్టిక్ కంపెనీలకు ఐటీ, ఇతర సేవలు అందించే రెడింగ్టన్ గ్రూప్‌తో పాటు లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్ ఈ కోర్సును నిర్వహించనున్నాయి. తాత్కాలిక క్యాంప్‌సలో రెడింగ్టన్ గ్రూప్ రూ.7 కోట్లతో లాజిస్టిక్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయనుంది. కోర్సు అనంతరం ఈ గ్రూప్‌లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. అలాగే వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం అర్హతలతోనే నాలుగు నెలల కీ కంసైనర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం కూడా ఈ కంపెనీలు అందించనున్నాయి. ఈ కోర్సు పూర్తయ్యాక కీ అకౌంట్ ఎగ్జిక్యూటివ్/మేనేజర్, చానల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌గా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
Updated Date - Oct 14 , 2024 | 03:16 AM