Budget Deficit: ఉత్తర డిస్కమ్‌కు 18742.24 కోట్ల నష్టాలు
ABN, Publish Date - Jul 25 , 2024 | 03:14 AM
పుష్కర కాలంగా ఉత్తర డిస్కమ్ (ఎన్పీడీసీఎల్-వరంగల్) లాభాల ముఖమే చూడలేదు. 2012-13 నుంచి ఏటా నష్టాలను మూటగట్టుకుంటోంది. బుధవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక నివేదికను ఉత్తర డిస్కమ్ శాసనసభకు సమర్పించింది.
2012-13 నుంచి అదే పరంపర
లాభాల వెలుగుల్లో ట్రాన్స్‌కో
శాసనసభకు వార్షిక నివేదికలు
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పుష్కర కాలంగా ఉత్తర డిస్కమ్ (ఎన్పీడీసీఎల్-వరంగల్) లాభాల ముఖమే చూడలేదు. 2012-13 నుంచి ఏటా నష్టాలను మూటగట్టుకుంటోంది. బుధవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక నివేదికను ఉత్తర డిస్కమ్ శాసనసభకు సమర్పించింది. ఈ నివేదికను పరిశీలిస్తే.. కరెంట్ బిల్లులు చూస్తేనే కాదు.. రిపోర్టును చూసినా గుండె గుభేలుమనక మానదు. ఈ 12 ఏళ్ల కాలంలో రూ.18742.24 కోట్ల నష్టాలను ఉత్తర డిస్కమ్ మూటగట్టుకుంది. ఇక 2014-15 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం దాకా గత బీఆర్‌ఎస్ పాలనలో రూ.15217. 47 కోట్ల నష్టాలను డిస్కమ్ చవిచూసింది.
ఇక 2011- 12లో రూ.4.08 కోట్లు, 2010-11లో రూ.8.91 కోట్లు, 2009-10లో రూ.8.12 కోట్లు లాభాల్లో ఉండటం గమనార్హం. 2012-13 నుంచి ప్రారంభమైన నష్టాల పరంగా కొనసాగుతూనే ఉండటం గమనార్హం. కాగా, 2012- 13లో విద్యుత్ కొనుగోళ్లకు ఉత్తర డిస్కమ్ రూ.5300 కోట్లను వెచ్చించగా.. అదే 2022-23లో ఏకంగా రూ.15116.42 కోట్లను వెచ్చించింది. అదే ఉద్యోగుల వేతనాలకు అయ్యే వ్యయం కూడా భారీగానే పెరిగింది. 2012-13లో ఉద్యోగుల జీతాలకు ఏటా రూ.432.89 కోట్లను చెల్లించగా... అదే 2022-23లో రూ.2053 కోట్లను వెచ్చించాల్సిన పరిస్థితి. ఇక కరెంట్ విక్రయాల ద్వారా ఆదాయం 2012-13లో రూ.2893 కోట్లు రాగా.. 2022-23లో రూ.9327 కోట్లు మాత్రమే వచ్చింది. ఆదా యం 300 శాతానికి పైగా పెరగ్గా.. వేతనాల వ్యయం 400 శాతానికి పెరిగింది.
ట్రాన్స్‌కో లాభాల ఆర్జన
డిస్కమ్‌లు నష్టాల దిశగా జెట్ వేగంతో ప్రయాణం చేస్తుండగా.. ఆ డిస్కమ్‌లకు జెన్‌కోలు ఉత్పత్తి చేసే కరెంట్‌ను తీసుకొచ్చి అందించే ట్రాన్స్‌కో మాత్రం లాభా ల్లో వెళ్తోంది. 2022-23లో రూ.3077.58 కోట్లఆ దాయం రాగా.. వ్యయం రూ.2773.03 కోట్లు పోను.. రూ.304 కోట్ల లాభాలను ట్రాన్స్‌కో గడించింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో ట్రాన్స్‌కో వ్యయం ఆదాయం రూ.3535 కోట్లు కాగా.. వ్యయం రూ.3121కోట్లు పోనూ.. రూ.413.57 కోట్ల ఆదాయాన్ని ట్రాన్స్‌కో గడించింది. 2022-23లో ఉద్యోగుల వేతనాలు, ఖర్చుభారం రూ.887 కోట్లు కాగా..2022-23లో రూ.1027 కోట్లుగా ఉంది. 2022-23కి గాను బుధవారం ట్రాన్స్‌కో వార్షికనివేదికను సభలో పెట్టడంతో గణాంకాలన్నీ బయటికొచ్చాయి.
Updated Date - Jul 25 , 2024 | 03:14 AM