Share News

Caste Enumeration: కుల గణనతో దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ

ABN , Publish Date - Oct 26 , 2024 | 03:07 AM

తెలంగాణలో కుల గణన చేపట్టి దేశానికే రోల్‌ మోడల్‌గా నిలవబోతున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Caste Enumeration: కుల గణనతో దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ

  • బీసీ, ఎస్సీ, ఎస్టీల కలను నెరవేరుస్తున్నాం

  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శితో భట్టి

  • కేసీ వేణుగోపాల్‌కు కుల గణన సర్వే ఫార్మాట్‌ అందజేత

న్యూఢిల్లీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కుల గణన చేపట్టి దేశానికే రోల్‌ మోడల్‌గా నిలవబోతున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల కలను నెరవేర్చబోతున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీని నిలబెడుతున్నామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్‌ నివాసానికి వెళ్లిన భట్టి ఆయనతో సమావేశమయ్యారు. కుల గణన సర్వే ఫార్మాట్‌ అందజేశారు. గంటకు పైగా జరిగిన చర్చలో రాష్ట్రంలో కుల గణన, ప్రణాళిక, విధివిధానాలు తదితర అంశాలపై చర్చించారు.


జార్ఖండ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇంఛార్జిగా భట్టి విక్రమార్కను అధిష్ఠానం నియమించిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్‌, భట్టి మధ్య జార్ఖండ్‌ ఎన్నికలపైనా చర్చ జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌గౌడ్‌ బాధ్యతల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు, పీసీసీ, డీసీసీ కమిటీలు, హైడ్రాపై చర్చ జరిగినట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపైనా ఇరువురు చర్చించినట్టు సమాచారం. అనంతరం ఏఐసీసీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌తోనూ భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఆయనతోనూ రాష్ట్రంలో కుల గణన, జార్ఖండ్‌ ఎన్నికల అంశాలపైనే చర్చించినట్టు తెలిసింది.


  • కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజుతో భట్టి భేటీ

తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్థికి చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజు మద్దిరాలను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కోరారు. గత ప్రభుత్వం చేసిన బడ్జెటేతర రుణాలు రాష్ట్ర ఖజనాపై తీవ్ర రుణ భారాన్ని మోపుతున్నాయని, వాటిని రీ షెడ్యూల్‌ చేేస్త రాష్ర్టానికి ఉపశమనంగా ఉంటుందని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నాగరాజు మద్దిరాలను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పాత అప్పులు, వడ్డీల భారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.

Updated Date - Oct 26 , 2024 | 03:07 AM