ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Future State: తెలంగాణ ఫ్యూచర్‌ స్టేట్‌

ABN, Publish Date - Aug 10 , 2024 | 02:55 AM

తెలంగాణకు ‘ఫ్యూచర్‌ స్టేట్‌’ అనే ట్యాగ్‌లైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్‌ స్టేట్‌ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్‌ దిగ్గజం అడోబ్‌ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది.

  • తెలంగాణకు ట్యాగ్‌లైన్‌ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌

  • హైదరాబాద్‌ పునర్నిర్మాణ ప్రాజెక్టులకు పర్యాయపదమిది

  • రండి.. అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం

  • అమెరికాలో ఏఐ రౌండ్‌ టేబుల్‌ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు

  • మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా

  • అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌తో సమావేశం

  • హైదరాబాద్‌లో ఆమ్జెన్‌ రిసెర్చి సెంటర్‌.. 3000 మందికి కొలువులు

  • గ్రీన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్న ఆరమ్‌ ఈక్విటీ పార్టనర్స్‌

  • పదేళ్లలో ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి: మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ‘ఫ్యూచర్‌ స్టేట్‌’ అనే ట్యాగ్‌లైన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్‌ స్టేట్‌ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్‌ దిగ్గజం అడోబ్‌ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో రిసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రముఖ బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్‌ సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే ఈ రిసెర్చి సెంటర్లో 3000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే.. కృత్రిమమేధ ఆధారంగా పనిచేసే తదుపరి తరం గ్రీన్‌ డేటా సెంటర్‌ను త్వరలో హైదరాబాద్‌లో నిర్మించనున్నట్టు ఆరమ్‌ ఈక్విటీ పార్ట్‌నర్స్‌ సంస్థ ప్రకటించింది.


తెలంగాణకు పెట్టుబడులు సమకూర్చేందుకు అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి వివిధ కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో చర్చలు జరిపారు. డాలస్‌, క్యాలిఫోర్నియా తదితర పట్టణాల్లో పర్యటించి రాబోయే దశాబ్ద కాలంలో ఫ్యూచర్‌ స్టేట్‌గా నిలవనున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. క్యాలిఫోర్నియాలో ఇండియన్‌ కాన్సులేట్‌ జనరల్‌ నిర్వహించిన ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. బిజినెస్‌’ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో టెక్‌ యూనీకార్న్‌ సీఈవోలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘అమెరికాలో నేను గమనించింది ఏమిటంటే.. ప్రతి రాష్ట్రానికీఒక ప్రత్యేక లక్ష్యం ఉంది. దాన్ని సూచించే ఒక నినాదం (ట్యాగ్‌లైన్‌) ఉంది. న్యూయార్క్‌ స్టేట్‌కి ‘అవుటాఫ్‌ మెనీ.. వన్‌’.. టెక్స్‌సకు ‘లోన్‌ స్టార్‌ స్టేట్‌’.. కాలిఫోర్నియాకు ‘యురేకా’ అనే నినాదాలున్నాయి. ఇవి నన్ను బాగా ఆకర్షించాయి.


మన దేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాల్లేవు. తెలంగాణకు కూడా ఇలాంటి ట్యాగ్‌లైన్‌ ఒకటి పెట్టుకోవాలని అనిపించింది. మా లక్ష్యానికి అనుగుణంగా ఇక నుంచి తెలంగాణకు అటువంటి లక్ష్య నినాదం పెట్టుకుందాం. ఇకపై రాష్ట్రాన్ని ‘తెలంగాణ.. ఫ్యూచర్‌ స్టేట్‌’ అని పిలుద్దాం’’ అని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులతో రాష్ట్రానికి ఈ నినాదం పర్యాయపదంగా నిలుస్తుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌, నెట్‌ జీరో సిటీ వంటి లక్ష్యాలు తమ ముందు ఉన్నాయన్నారు. అందుకే యూనీకార్న్‌ ప్రతినిధులంతా తెలంగాణకు రావాలని ఆహ్వానం పలికారు. ‘‘మా రాష్ట్రానికి రండి. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి. అందరం కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’’ అని పిలుపునిచ్చారు. అలాగే, తన పర్యటనలో భాగంగా అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్‌ 4.0 సిటీ నిర్మాణం, స్కిల్‌ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ ఏర్పాటు తదితర ప్రణాళికల్లో భాగస్వామి కా వాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.


  • మీకు మంచి ప్రతిఫలం

అమెరికాలో ఐటీ కంపెనీలు నడుపుతున్న వాళ్లు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని, హైదరాబాద్‌ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి డాల్‌సలో ఐటీ సర్వీస్‌ అలయన్స్‌ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ‘‘మీరు పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా మారుతుంది. ఎన్నో ఏళ్లు కష్టపడి చరిత్రాత్మక హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనమంతా కలిసి ప్రపంచ స్థాయిలో నాలుగో సిటీని తయారు చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు. అయితే.. అమెరికాలోని అన్ని ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా ఐటీ సర్వీసెస్‌ అలయన్స్‌ ఈ ఏడాది చివర్లో తమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలయెన్స్‌ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు.


  • హైదరాబాద్‌లో ఆమ్జెన్‌ రిసెర్చ్‌ సెంటర్‌

అమెరికాలోని అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్‌ త్వరలో హైదరాబాద్‌లో కొత్తగా రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ విభాగాన్ని ప్రారంభించనుంది. హైటెక్‌ సిటీలో దీనిని ప్రారంభించనుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రంలో కంపెనీ ఎండీ డేవిడ్‌ రీస్‌, నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సోమ్‌ చటోపాధ్యాయ సమావేశమై ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పారు. రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆమ్జెన్‌ తమ ఆర్‌అండ్‌డి కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకోవటం గర్వించదగ్గ విషయమన్నారు. బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌ ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తుందని అభిప్రాయపడ్డారు. బయో టెక్నాలజీ రంగంలో తమ కంపెనీ 40 సంవత్సరాలుగా పని చేస్తోందని, వంద దేశాల్లో కార్యకలాపాలు విస్తరించి ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపు సాధించామని ఆమ్జెన్‌ ఎండీ డాక్టర్‌ రీస్‌ అన్నారు.


  • గ్రీన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు..

రాజధానిలో దశలవారీగా రూ.3,350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, ‘నెక్స్ట్‌ జనరేషన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పవర్డ్‌ గ్రీన్‌ డేటా సెంటర్‌’ను నిర్మిస్తామని ఆరమ్‌ ఈక్విటీ పార్ట్‌నర్స్‌ సంస్థ ప్రకటించింది. సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబుతో ఆ సంస్థ సీఈవో, చైర్మన్‌ వెంకట్‌ బుస్సా భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణలో విస్తరణ ప్రణాళికలతో పాటు భారీగా పెట్టుబడులను ప్రకటించారు. ఆరమ్‌ సంస్థ నిర్ణయంపై సీఎం రేవంత్‌ సంతోషం వ్యక్తం చేశారు. గ్రీన్‌డేటా సెంటర్‌ ఏర్పాటుతో రాష్ట్రంలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.


  • పదేళ్లలో ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి: మంత్రి శ్రీధర్‌ బాబు

రాబోయే పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్‌ డాలర్ల (రూ.80లక్షల కోట్లు) స్థాయికి తీసుకుపోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకన్నారని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. హైదరాబాద్‌ను పునర్నిర్మించే వ్యూహంతో ఉన్నామని వివరించారు. హైదరాబాద్‌ త్వరలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, టెక్నాలజీ సెంటర్‌గా అవతరిస్తుందని చెప్పారు. టెక్‌ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని, యునికార్న్‌ ప్రతినిధులు హైదరాబాద్‌ను సందర్శించాలని ఆహ్వానించారు.

Updated Date - Aug 10 , 2024 | 02:56 AM

Advertising
Advertising
<