CM Revanth Reddy: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:08 AM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించిన కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ పనుల ఒప్పందాన్ని రేవంత్ సర్కారు రద్దు చేసింది.
రిజర్వాయర్ టెండర్లు రద్దు చేసిన రేవంత్ సర్కార్
జలాశయం నిర్మాణ ప్రతిపాదనా విరమణ
తక్కువ ఖర్చుతో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన
మల్లన్నసాగర్ నుంచి నేరుగా జంట జలాశయాలకే!
బీఆర్‌ఎస్ హయాంలో కేశవాపురం డిజైన్
రూ.4,777.59 కోట్లకు పరిపాలన అనుమతి
రూ.3,918 కోట్లకు పనులు దక్కించుకున్న మేఘా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అంచనాలను
ప్రస్తుత ధరల ప్రకారం పెంచాలని కోరిన సంస్థ
తిరస్కరిస్తూ టెండరును రద్దు చేసిన సర్కారు
కొత్త ప్రతిపాదనతో ప్రభుత్వానికి 2వేల కోట్ల ఆదా
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించిన కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ పనుల ఒప్పందాన్ని రేవంత్ సర్కారు రద్దు చేసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్నది కావడంతో మొత్తంగా కేశవాపురం జలాశయం ప్రతిపాదనను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం.. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించే ఉద్దేశంతో కేశవాపురం రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించింది. గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టు కింద 10 టీఎంసీల సామర్థ్యంతో దీనిని నిర్మించేలా చర్యలు చేపట్టింది.
కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం జలాశయానికి, అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి నీటిని తరలించేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందుకోసం రూ.4777.59 కోట్ల అంచనాలతో కేశవాపురం వద్ద నిర్మించాలనుకున్న జలాశయ నిర్మాణానికి2018 ఫిబ్రవరి 3న అప్పటి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. దీంతో టెండర్లను ఆహ్వానించగా.. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ రూ.3918 కోట్లకు పనులు దక్కించుకుంది. హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో పదేళ్ల పాటు రూ.6891 కోట్లకు పైగా చెల్లింపులు చేసేందుకు వాటర్‌బోర్డుతో ఒప్పందం కూడా చేసుకుంది.
ఆరేళ్లుగా పనులు చేపట్టని సంస్థ..
గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన డిజైన్ల ప్రకారం ప్రాజెక్టు అమలు చేయాలంటే అటవీ భూములు, రక్షణ భూములను సేకరించాల్సి రావడం, అలైన్‌మెంట్ సమస్యలు, భూసేకరణ చిక్కులు ఉండటంతో ఆరేళ్లుగా ప్రాజెక్టు పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. వాటర్‌బోర్డు, రెవెన్యూ అధికారులు సకాలంలో భూసేకరణ పూర్తి చేయలేదు. పైగా అప్పటి ప్రభుత్వం కూడా రిజర్వాయర్ నిర్మాణానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కేంద్ర ప్రభుత్వం 1011ఎకరాల భూములిచ్చినా.. అందులో నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించలేదు. భూేసకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్‌మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు. టెండర్ ఖరారయ్యాక కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఆరేళ్లుగా ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈ క్రమంలో 2017 నాటి ఎస్‌ఎ్‌సఆర్ రేట్ల ప్రకారం పనులు చేపట్టలేమని, 2024 ఎస్‌ఎ్‌సఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని ఆ కంపెనీ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే ప్రభుత్వం రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా మేఘా కంపెనీకి కేటాయించిన టెండర్లను రద్దు చేసింది. కేశవాపురం జలాశయం నిర్మాణం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాత ప్రతిపాదనలను పక్కన పెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా కొత్త ప్రాజెక్టును రూపొందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త ప్రాజెక్టుతో రూ.2 వేల కోట్ల ఆదా..
కొత్త ప్రతిపాదనల ప్రకారం హైదరాబాద్ నీటి అవసరాలను తీర్చడం కోసం చేపట్టిన గోదావరి ఫేజ్-2 పథకంలోని మల్లన్నసాగర్ ,హిమాయత్ సాగర్‌లకు గోదావరి నీటిని మళ్లిస్తారు. హైదరాబాద్‌కు 10 టీఎంసీలు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలకు 5 టీఎంసీల నీరు అందించడంతో పాటు ఇతర అవసరాలు తీర్చడానికి మల్లన్నసాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని తరలించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఇటీవలే క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.2 వేల కోట్ల ఆదా అవుతుందని అంచనా వేశారు. గత ప్రభుత్వ డిజైన్ ప్రకారం ఆరుసార్లు నీటిని ఎత్తిపోసి హైదరాబాద్‌కు నీటిని తరలించాల్సి ఉండగా.. గోదావరి ఫేజ్-2 ప్రతిపాదన ప్రకారం కేవలం రెండుసార్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను నింపేందుకు ఎక్కువ భాగం గ్రావిటీతో నీరు రానుంది. దీంతో నిర్వహణ వ్యయం, విద్యుత్ భారం కూడా తగ్గుతాయి. ఇప్పటి వరకు వెయ్యి లీటర్ల నీటికి వాటర్‌బోర్డు రూ.48 ఖర్చు చేస్తుండగా.. గోదావరి ఫేజ్-2తో ఈ ఖర్చు రూ.44కు తగ్గనుంది. హైదరాబాద్ మహా నగర తాగునీటికి కీలకంగా భావిస్తున్న గోదావరి ఫేజ్-2 పనులకు త్వరలోనే రూ.5560 కోట్లతో టెండర్లను పిలిచేందుకు వాటర్‌బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు.