సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. ధాన్యం రవాణాపై పంచాయితీ!
ABN, Publish Date - Dec 20 , 2024 | 05:20 AM
రాష్ట్రంలో రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నందున.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి విక్రయించకుండా చూసేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
కర్ణాటక రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
తమ ధాన్యాన్ని రానివ్వకపోవడంపై అభ్యంతరం
తెలంగాణ రైతులనూ అడ్డుకుంటామని హెచ్చరిక
మహబూబ్‌నగర్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో రైతులు పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నందున.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి విక్రయించకుండా చూసేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లాకు కర్ణాటకతో సరిహద్దు ఉంది. అక్కడి నుంచి వస్తున్న ధాన్యాన్ని అడ్డుకునేందుకు చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి వస్తున్న ధాన్యం లారీలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీగా మారింది. వాస్తవానికి కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల నుంచి కర్ణాటకలోని రాయిచూర్ వ్యాపారులు ఏటా ధాన్యం కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఈ జిల్లాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సేకరణ కంటే కర్ణాటక వ్యాపారులే అధిక మొత్తంలో కొంటారు. ఈ వానాకాలం ధాన్యం సేకరణ ఆలస్యం కావడంతో కర్ణాటక వ్యాపారులు కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేసి తీసుకెళ్లారు.
రైతులకు ధర నచ్చి విక్రయిస్తుండడంతో ఇక్కడి అధికారులు కూడా అడ్డు చెప్పలేదు. అయితే ఆ కొనుగోలు చేసి తీసుకెళ్లిన ధాన్యం తిరిగి స్థానిక కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేరుతో విక్రయిస్తున్నట్లు తెలియడంతో అధికారులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇటీవల కృష్ణా మండలంలో 8 లారీలను సీజ్ చేశారు. ఆగ్రహించిన కర్ణాటక రైతు సంఘం నేతలు కృష్ణా బ్రిడ్జిపై కర్ణాటక సరిహద్దు శక్తినగర్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. తెలంగాణ నుంచి వచ్చే ధాన్యాన్ని తాము కూడా అడ్డుకుంటామని కర్ణాటక రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు చమరస పాటిల్ హెచ్చరించారు. గత నెల 29న రాయచూర్ నుంచి సోనామసూరి వడ్లు తీసుకొచ్చి రాయికోడ్ కొనుగోలు కేంద్రంలో అన్‌లోడ్ చేసి, తర్వాత నర్వ పీఏసీఎస్ బిల్లుతో లారీలో లోడ్ చేసి అక్కడే కొనుగోలు చేసినట్లుగా పత్రాలు సృష్టించి రైస్‌మిల్లుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన అధికారులు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. కానీ, కర్ణాటక రైతు సంఘం నేతలు మాత్రం తాము రైస్‌మిల్లులకు పంపిస్తున్నామని చెబుతున్నారు.
Updated Date - Dec 20 , 2024 | 05:20 AM