ORR Lease: ఔటర్ టెండర్‌పై సిట్
ABN, Publish Date - Dec 20 , 2024 | 04:45 AM
గత ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)ను ఓ ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇచ్చిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ ప్రకటన.. శాసనసభలోనే ప్రకటించిన ముఖ్యమంత్రి
హరీశ్, కేటీఆర్ కోరిక మేరకేనని వెల్లడి
అప్పు తెచ్చి ఓఆర్‌ఆర్‌ను కాంగ్రెస్ నిర్మిస్తే.. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ అమ్మేసింది
దేశం దాటి వెళ్లాలన్న ఆలోచనతోనే విక్రయం: రేవంత్
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్)ను ఓ ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇచ్చిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు లీజు సహా టెండరుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శాసనసభలో గురువారం ఆయన ప్రకటించారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మంత్రివర్గంలో చర్చించి, మంత్రుల సూచన, తీర్మానంతోనే విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు. గురువారం మధ్యాహ్నం విరామం తరువాత ప్రారంభమైన శాసనసభలో రాష్ట్ర అప్పులపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఆ చర్చలో భాగంగా ఓఆర్‌ఆర్ లీజు టెండర్లను రద్దు చేయండంటూ హరీశ్ రావు, కేటీఆర్ కామెంట్లు చేశారు. దాంతో, ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం చేసుకుని.. ‘‘అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6,500 కోట్లను అప్పు తెచ్చి ఓఆర్‌ఆర్‌ను నిర్మించింది. తర్వాత ఆ బాకీ కూడా తీర్చేసింది.
అలాంటి ఔటర్ రింగు రోడ్డును అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పనంగా అమ్మేశారు. హడావిడిగా లీజుకు ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలు వారిని తిర స్కరించనున్నారని, ఓడించబోతున్నారని, బొంద పెట్టబోతున్నారని వారికి స్పష్టంగా తెలుసు. అందుకే, ఉన్నదల్లా తెగనమ్ముకుని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతో ఓఆర్‌ఆర్‌ను అమ్ముకున్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హయాంలోనే దీనిని విక్రయించారు. మళ్లీ ఇప్పుడు వారిద్దరే (హరీశ్, కేటీఆర్) విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారిద్దరి కోరిక మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) నియమిస్తున్నాను. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ టెండర్‌ను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిన విధానాలపై సభలోని సభ్యులందరి ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నాను’’ అని వివరించారు. సంబంధిత విధివిధానాలను మంత్రివర్గంలో చర్చించి ఖరారు చేస్తామని చెప్పారు.
ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్‌ను పెట్టింది కాంగ్రెస్సే
సరైన విధివిధానాలను పాటించకుండా ఎన్నికలకు ముందు హడావిడిగా కొంతమంది వ్యక్తులకు అయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగు రోడ్డును అప్పగించేశారంటూ తెలంగాణ సమాజంలో తీవ్రమైన చర్చ జరిగిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ‘‘ఆనాడు వైఎ్‌సఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ జైకా నుంచి నిధులను తీసుకొచ్చి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతోపాటు ఓఆర్‌ఆర్ లాంటి అద్భుతమైన మణిహారాలను నిర్మించింది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రాణించడానికి ఈ రెండూ ప్రధాన కారణం. గతంలో కాంగ్రెస్ అవలంభించిన విధానాల వల్లే బడ్జెట్‌లో 60-65 శాతం ఆదాయం సమకూరుతోంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రూ.2 లక్షల కోట్లపైచిలుకు బడ్జెట్‌కు వెళ్లడానికీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులే కారణం’’ అని వివరించారు. మెట్రో రైలు ప్రాజెక్టును తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్సేనని చెప్పారు. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు, ఔటర్ రింగు రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, ఐటీ, ఫార్మా కంపెనీలు తీసుకు రావడమే కాకుండా శాంతి భద్రతలు కాపాడడం, మత సామరస్యాన్ని పెంపొందించడం వంటి విధానపరమైన కఠిన నిర్ణయాలను తీసుకుందని వివరించారు. అలాగే, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ను ఏడాది మొత్తం అందించిందని గుర్తు చేశారు. ఐఎ్‌సబీ, ఐఐటీ, ఐఐఐటీలతోపాటు అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలను అప్పటి ప్రభుత్వాలు తీసుకొచ్చాయని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి స్టేడియాలను నిర్మించారని, అంతర్జాతీయ స్థాయి క్రీడలను ఇక్కడ నిర్వహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయని, ఫలితంగా ఇప్పుడు రూ.2 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్‌కు చేరామని, వీటి ద్వారానే ప్రధాన ఆదాయం వస్తోందని చెప్పారు.
సీఎంను కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోని ఆయన చాంబర్లో గురువారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డిలు కలిశారు. అయితే ఏ పార్టీ ఎమ్మెల్యేలయినా నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలుస్తుంటారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలూ సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకే కలిశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Updated Date - Dec 20 , 2024 | 04:45 AM