ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagga Reddy: తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర..

ABN, Publish Date - Sep 26 , 2024 | 04:09 AM

తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. అనుమానం వ్యక్తం చేశారు.

ఆ పార్టీ డైరెక్షన్‌లోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు

  • టీడీపీ, వైసీపీకి కొట్లాట పెట్టి.. సీట్లు పెంచుకునే వ్యూహం

  • ప్రత్యేక హోదా సాధించడంలో జగన్‌, చంద్రబాబు విఫలం

  • ఏపీకి హోదా ఇచ్చేది, పోలవరం పూర్తయ్యేదీ రాహుల్‌తోనే

  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడతారు

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. అనుమానం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు మరుగున పడి, రాజకీయ లబ్ధి, మత పరమైన అంశాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. వాస్తవాలను బయటపెట్టి, అలాంటి దోషాలు మళ్లీ జగరకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు.. దీన్ని జగన్‌కు ఆపాదిస్తూ రాజకీయం చేయడం, మతం ప్రస్తావన తీసుకురావడంతో తనకు వ్యక్తిగతంగా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. చంద్రబాబును అడ్డుపెట్టుకొని బీజేపీ కొత్త ఆట మొదలుపెట్టినట్టుగా ఉందని బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.


ఏపీ సీఎంగా జగన్‌ ఉన్నప్పుడు.. చంద్రబాబును అరెస్టు చేయించడాన్ని పార్టీలకు అతీతంగా తనలాంటి వాళ్లందరం తప్పుపట్టామని గుర్తు చేశారు. ఒక విజన్‌ ఉన్న నాయకుడిగా చంద్రబాబును తాను గౌరవిస్తానని, హైదరాబాద్‌ అభివృద్థిలో ఆయన భాగస్వామ్యం చాలా గొప్పదని కొనియాడారు. కానీ, సీఎంల నిర్ణయాల్లో తప్పులు వెతకడం మొదలుపెడితే ఏ సీఎం కూడా పని చేయలేడని అభిప్రాయపడ్డారు. ‘‘చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనిది క్రిస్టియన్‌ అనే ప్రస్తావనను ఎందుకు పదే పదే తెస్తున్నారు? జగన్‌ క్రిస్టియన్‌ అన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు బీజేపీ డైరెక్షన్లో మాట్లాడుతున్నవేనని నా అనుమానం’’ అని తెలిపారు. సీఎంగా చంద్రబాబు ఉన్నా.. జగన్‌ ఉన్నా.. కల్తీ నెయ్యిని లడ్డూల్లో కలపాలని చెప్పబోరని పేర్కొన్నారు.


తప్పు చేసిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం చంద్రబాబుకు చాలా చిన్న పని అని, అలా చేస్తే ఈ వివాదం ముగిసిపోతుందని అభిప్రాయపడ్డారు. లడ్డూ వివాదం ద్వారా టీడీపీ, వైసీపీ మధ్య కొట్లాట పెట్టి.. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని, తద్వారా వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలనేది బీజేపీ ప్లాన్‌గా కనబడుతోందని పేర్కొన్నారు. బీజేవైఎం కార్యకర్తలు జగన్‌ ఇంటిపై దాడి చేయడాన్ని బట్టి.. లడ్డూ వివాదాన్ని రాజకీయంగా వాడుకోవాలన్న ఆ పార్టీ కుట్ర స్పష్టమవుతోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిందన్న కోపంతో అక్కడి ప్రజలు గత మూడు ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ఓటేయలేదని తెలిపారు. కానీ.. భవిష్యత్తులో తమ పార్టీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు, జగన్‌ విఫలమయ్యారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ ప్రధాని అయి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని, పోలవరం ప్రాజెక్టునూ పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Sep 26 , 2024 | 04:09 AM