Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:02 AM
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో పీఎంకే డిస్టిలేషన్‌కు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు.
ఆ కంపెనీలో తలసాని కుమారుడే డైరెక్టర్..
నిలదీయాల్సింది బీఆర్‌ఎస్ వారినే: మహేశ్ గౌడ్
మహబూబ్‌నగర్ రైతు సభపై నేతలతో భేటీ
హైదరాబాద్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో పీఎంకే డిస్టిలేషన్‌కు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు.. కిరణ్‌యాదవ్ ఆ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారన్నారు. ఇందులో కాంగ్రెస్ సర్కారుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇథనాల్ కర్మాగారానికి సంబంధించి బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ కర్మాగారానికి సంబంధించి అన్ని అనుమతులు బీఆర్‌ఎస్ సర్కారు హయాంలోనే ఇచ్చారన్నారు. ఆ వివరాలను మీడియాకు చూపారు. అసలు ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి రైతుల్ని ముంచాలని చూసిందే కేసీఆర్, కేటీఆర్ అని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతల్ని నిలదీయాలంటూ దిలావర్‌పూర్ రైతులకు పిలుపునిచ్చారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈనెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రైతు సభపై మహేశ్ గౌడ్.. జూమ్ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. నభూతో న భవిష్యత్తు అన్న విధంగా సభ జరగాలన్నారు. ప్రతి గ్రామం నుంచి సభకు రైతుల్ని తరలించాలంటూ సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తదితర నేతలు పాల్గొన్నారు. ఇప్పటివరకు చేపట్టిన వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలను మహబూబ్‌నగర్‌లో జరిగే రైతు సదస్సులో వివరించనున్నట్లు తుమ్మల తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్‌లో భారీ ఎత్తున వ్యవసాయ ప్రదర్శన ఉంటుందన్నారు. అలాగే ఈ మూడ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులనూ నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులే కార్యక్రమాలను చూసుకోవాలన్నారు. కాగా, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నద్ధతపై ఆయా జిల్లాల నేతలతో గురువారం గాంధీభవన్‌లో మహేశ్ గౌడ్ సమీక్ష నిర్వహించనున్నారు.