Train Journey: మన రైల్వే ఖ్యాతి ఆ సేతు హిమాచలం!
ABN, Publish Date - Dec 26 , 2024 | 04:25 AM
పట్టాలపై తానే పరుగులు తీస్తున్నా చెట్టూ చేమా వెనక్కు పరుగెడుతున్నట్లుగా అనుభూతినిచ్చే రైలు.. మరింత ప్రకృతి రమణీయతను తనలో ఇముడ్చుకొని, ప్రయాణికులకు పంచుతూ వారికి ఆ ప్రయాణాన్నే మరిచిపోలేని గొప్ప జ్ఞాపకంగా మిగల్చనుంది.
కన్యాకుమారి నుంచి నేరుగా కశ్మీర్‌కు రైలు.. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా ప్రాజెక్టు పూర్తి
37వేల కోట్ల వ్యయం.. నిర్మాణంలో ఇంజనీరింగ్ అద్భుతాలు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ ఆర్చిస్టీల్ బ్రిడ్జి
725మీ మేర అంజీఘాట్ కేబుల్ బ్రిడ్జి
119 కి.మీలలో 38 సొరంగాలు.. 934 వంతెనలు
జనవరి 26న ప్రారంభించనున్నమోదీ
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పట్టాలపై తానే పరుగులు తీస్తున్నా చెట్టూ చేమా వెనక్కు పరుగెడుతున్నట్లుగా అనుభూతినిచ్చే రైలు.. మరింత ప్రకృతి రమణీయతను తనలో ఇముడ్చుకొని, ప్రయాణికులకు పంచుతూ వారికి ఆ ప్రయాణాన్నే మరిచిపోలేని గొప్ప జ్ఞాపకంగా మిగల్చనుంది. కొండాకోనల్లోంచి.. లోయల్లోంచి.. సొరంగాల్లోంచేకాదు.. నీలాకాశమ్మీదుగా ప్రయాణిస్తున్నామా? మేఘాల్లో తేలిపోతున్నామా? అనిపించేలా భారీ కొండల మధ్య ఉన్న వంతెనపై, తీగల వంతెనపై రైలు చుక్ చుక్‌మంటూ పరుగులు పెడుతుంటే ఆ ప్రకృతి రమణీయత అస్వాదించినవారికి ఆస్వాదించినంత! ఇదంతా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా వేసిన రైల్వే లైన్ గురించే! జనవరి 26న ప్రధాని మోదీ ఈ ట్రాక్‌పై రైళ్ల రాకపోకలను ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఆర్విస్టీల్ బ్రిడ్జి రికార్డును ఉధంపూర్-శ్రీనగర్, బారాముల్లా లింక్ ప్రాజెక్టు (యూఎ్‌సబీఆర్‌ఎల్) సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్టు ఇప్పటిది కాదు. 25 ఏళ్ల క్రితం నాడే పురుడుపోసుకుంది. కశ్మీర్‌లో పర్యాటకం మరింత పెంచేలా.. కశ్మీర్ లోయ నుంచి దేశ నలుమూలలకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే సంకల్పంతో 1999 యూఎ్‌సబీఆర్‌ఎల్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఇందుకు రూ.37వేల కోట్లు అవసరపడతాయని అంచనా వేశారు.
ఉధంపూర్ నుంచి బారాముల్లా వరకు 356 కిమీ రైలు మార్గంలో అనేక విశిష్టతలు, ప్రత్యేకతలు ఉండటంతో 2002లో యూఎ్‌సబీఆర్‌ఎల్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలో ఎత్తైన కొండల మధ్య మొత్తం 119 కిమీ పొడవులో 38 సొరంగాలను తవ్వి ట్రాక్‌ను నిర్మించారు. అలాగే దాదాపుగా 13 కి.మీ మేర 934 వంతెనలున్నాయి. చినాబ్ స్టీల్ ఆర్చి బ్రిడ్జి, అంజీఘాట్ కేబుల్ బ్రిడ్జిల నిర్మాణాలు ఇంజనీరింగ్ అద్భుతాలుగా రైల్వే వర్గాలు పరిగణిస్తున్నాయి. అత్యంత ఎత్తైన కాశ్మీర్ లోయలు, నదీప్రవాహం, పర్వత శ్రేణుల్లో రైల్వే ట్రాక్ నిర్మాణాన్ని రైల్వే బోర్డు అధికారులు సవాల్‌గా స్వీకరించి పనులు ప్రారంభించి సాహసోపేతంగా పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే అద్భుత నిర్మాణాలుగా చరిత్రకెక్కనున్న రైల్వే వంతెనల నిర్మాణాల ప్రత్యేకతను, నిర్మాణ సందర్భంగా ఎదురైన సవాళ్లను తెలియజేసేందుకు రైల్వే బోర్డు అధికారులు మీడియా ప్రతినిధుల బృందాన్ని తీసుకువెళ్లారు. రెండు రోజుల పాటు జమ్ము, శ్రీనగర్ ప్రాంతాల్లో పర్యటించి చినాబ్ నదిపై నిర్మించిన స్టీల్ ఆర్చిబ్రిడ్జి, అంజీఘాట్ వద్ద నిర్మితమైన కేబుల్ బ్రిడ్జి, రియాసీ రైల్వే స్టేషన్‌లను మీడియా ప్రతినిఽఽధులు పరిశీలించారు.
ఈఫిల్ టవర్‌కన్నా 35 మీ ఎత్తులో చినాబ్ వంతెన
హిమాచల్‌ప్రదేశ్ నుంచి పంజాబ్, జమ్మూ మీదుగా పాకిస్థాన్ వైపు ప్రవహించే చినాబ్ నదీ గర్భంపై నిర్మించిన చినాబ్ రైల్వే స్టీల్ బ్రిడ్జి మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో నిర్మించిన చినాబ్ బ్రిడ్జి నిర్మాణ పనులను 2013 ఆగస్టులో ప్రారంభించారు. కౌరి-బక్కల్ స్టేషన్ల మధ్య చినాబ్ నదీ ప్రవాహంపై 359 మీటర్ల ఎత్తు, 1315 మీటర్ల పొడవుతో ప్రతిపాదించిన బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం సుమారు 28,660 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వినియోగించారు. నదీ గర్భంపై 725 మీటర్ల పొడవులో ప్రధాన వంతెన ఉంటుంది. సుమారు 120 ఏళ్ల పాటు రైళ్ల రాకపోకలకు ఉపయోగపడేందుకు, టెర్రరిస్టులు దాడిచేసినా తట్టుకొని నిలబడేలా దీనిని నిర్మించారు. గంటకు 260 కి.మీ వేగాన్ని కూడా ఈ వంతెన తట్టుకోగలదు. ఈ నిర్మాణం కోసం రూ.1486 కోట్లు వ్యయం చేశారు.
అంజిఘాట్ కేబుల్ బ్రిడ్జి
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వేలింక్ ప్రాజెక్ట్‌లో మరోముఖ్యమైన నిర్మాణం అంజిఘాట్ కేబుల్ బ్రిడ్జి. జమ్మూ నుంచి సుమారు 80 కి.మీ దూరంలో కాట్రా- బనిహాల్ సెక్షన్ల మధ్య పర్వత ప్రాంతంలో అంజి నదిపై 725 మీటర్ల పొడవులో నిర్మించారు. ప్రధానమైన బ్రిడ్జి 473 మీటర్లు కాగా బ్రిడ్జి నుంచి 196 మీటర్ల ఎత్తులోని పైలాన్‌పై నుంచి 96 కేబుళ్లను బ్రిడ్జికి అనుసంఽధానం చేశారు. దేశంలోనే మొట్టమొదటి త్రీ లేయిడ్ కేబుల్ వంతెనగా రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. సముద్ర మట్టానికి 331 మీటర్ల ఎత్తులో ఉన్న కేబుల్ బ్రిడ్జి 213 కి.మీ వేగంగా గాలి, వరదలు వచ్చినప్పటికీ తట్టుకునే విధంగా నిర్మించారు. సింగిల్ రైల్వే ట్రాక్‌తో నిర్మించిన వంతెనకు 3.75 మీటర్ల వెడల్పులో సర్వీస్ రోడ్‌ను ఏర్పాటు చేశారు. ఇరువైపులా 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ను విస్తరించారు. మొదట ఇక్కడ స్టీల్ ఆర్చి శైలిలో బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించగా పర్వత ప్రాంతంతో పాటు నదీ తీర ప్రాంతంలో పునాదికి అవసరమైన గట్టిదనం లేకపోవడంతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Updated Date - Dec 26 , 2024 | 04:25 AM