Bandi Sanjay: చట్టబద్ధ కమిషన్‌నే తప్పుబడతారా?
ABN, Publish Date - Jun 16 , 2024 | 04:28 AM
గత ప్రభుత్వం చేసిన విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను మాజీ సీఎం కేసీఆర్ తప్పుబట్టడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైౖర్మన్‌ను వైదొలగాలని బెదిరించడం ధిక్కారమే
కమిషన్ ఏర్పాటు తప్పయితే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం చేసిన విద్యుత్తు కొనుగోళ్ల వ్యవహారంపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను మాజీ సీఎం కేసీఆర్ తప్పుబట్టడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్‌ను విచారణ నుంచి వైదొలగాలని బెదిరించడం ముమ్మాటికీ ధిక్కారమేనన్నారు. కమిషన్ ఏర్పాటే తప్పయితే కేసీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. విచారణ కమిషన్‌ను ధిక్కరించిన కేసీఆర్‌ను తక్షణమే అరెస్టు చేసి విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, వాస్తవాలను నిగ్గు తేల్చా అన్నారు. ఈ మేరకు బండి సంజయ్ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జస్టిస్ నర్సింహారెడ్డిని అవమానించేలా కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకారానికి నిదర్శనమని, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి.. చట్టబద్ధమైన కమిషన్‌కు గౌరవం ఇవ్వాలనే విజ్ఞత లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీని వివాదంలోకి లాగి బదనాం చేయడం తగదని హితవు పలికారు.
వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం..
జస్టిస్ నర్సింహారెడ్డిని తెలంగాణ బిడ్డ అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ వ్యవహరించడం దుర్మార్గమని సంజయ్ అన్నారు. నర్సింహారెడ్డి తెలంగాణ బిడ్డ కాబట్టే.. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పంపిన రహస్య నివేదికను బహిరంగ పరచాలని ఆదేశాలు జారీ చేశారని, ఆ కమిటీలోని 8వ చాప్టర్ అంశాలను బట్టబయలు చేయించారని గుర్తు చేశారు. కేసీఆర్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏ స్థాయి వ్యక్తుల ప్రతిష్ఠనైనా దెబ్బతీసేందుకు వెనుకాడరన్నారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా బీజేపీపై అభాండాలు మోపారని ఆరోపించారు. విద్యుత్తు కొనుగోళ్లతోపాటు కాళేశ్వరం, గొర్రెల పంపిణీలో అక్రమాలపై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని సంజయ్ విమర్శించారు. కేసీఆర్‌తోపాటు అప్పటి మంత్రులు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్లు ఆధారాలున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.
Updated Date - Jun 16 , 2024 | 04:28 AM