సర్కారుకు ఉద్యోగుల ఐకాస అల్టిమేటం
ABN, Publish Date - Oct 23 , 2024 | 03:38 AM
రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస) అల్టిమేటం జారీ చేసింది.
చెప్పినట్లే ఉద్యమ కార్యాచరణ ప్రకటన
నేటి నుంచి జనవరి 30 వరకు..
జనవరి 3, 4 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు
21న మౌన ప్రదర్శన, 23న బైక్ ర్యాలీలు, 30న మానవహారాలు
ప్రధానంగా ఆరు డిమాండ్లపై పట్టు
హైదరాబాద్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస) అల్టిమేటం జారీ చేసింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఉద్యోగులకు సంబంధించిన 50 డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. ఈ మేరకు నాంపల్లిలోని టీఎన్‌జీవో భవన్‌లో మంగళవారం ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు నేతృత్వంలోని ఐకాస ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సుమారు 10 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న తమ సంఘం పది నెలలుగా డిమాండ్లను పరిష్కరించాలని కోరినా స్పందించలేదంటూ శుక్రవారం ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లపై 21లోపు ప్రకటన చేయకపోతే 22న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామనీ అల్టిమేటం జారీ చేసింది.
అన్నట్లుగానే ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. అక్టోబరు 23 నుంచి 30 వరకు 33 జిల్లాల్లో తెలంగాణ ఉద్యోగుల ఐకాస కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. అక్టోబరు 28న రాష్ట్ర ఐకాస ఆధ్వర్యంలో సీఎస్, ముఖ్యమంత్రికి కార్యాచరణ లేఖలు అందిస్తామని, నవంబరు 2న అన్ని జిల్లాల ఐకాసల ఆధ్వర్యంలో భారీ ర్యాలీల ద్వారా కలెక్టర్లకు లేఖలను అందజేస్తామని వివరించింది. నవంబరు 4, 5 తేదీల్లో ర్యాలీల ద్వారా ఆయా జిల్లాల్లో ఉండే ప్రజాప్రతినిధులకు లేఖలు అందజేస్తామని, 6న ఐకాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని తెలిపింది.
ఆరు డిమాండ్లపై పట్టు
మొత్తం 50 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిన ఐకాస ఆరు డిమాండ్లను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలని మంగళవారం జరిగిన సమావేశంలో తీర్మానించింది. వాటిలో మొదటిది 5 డీఏల విడుదల, బకాయిలను నగదు రూపంలో చెల్లించడం, రెండోది.. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఈ-కుబేర్ వ్యవస్థ రద్దు, మూడోది.. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు, 51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్‌సీ అమలు, నాలుగోది.. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, ఐదోది.. సీపీఎస్ రద్దు, పాత పింఛను విధానం అమలు, ఆరోది.. జీవో 317ను సమీక్షించి, ఉద్యోగుల ఫిర్యాదులన్నీ పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించడం.
పది జిల్లాల్లో సభలు
నవంబరు 7 నుంచి డిసెంబరు 27 వరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 జిల్లాల్లో ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన సదస్సులు నిర్వహిస్తారు. నవంబరు 7న కరీంనగర్, 14న ఖమ్మం, 19న వరంగల్, 26న మహబూబ్‌నగర్, డిసెంబరు 3న నల్గొండ, 10న సంగారెడ్డి, 16వ తేదీన ఆదిలాబాద్, 21న నిజామాబాద్, 27న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సమావేశం జరుగుతుంది. జనవరి 3 నుంచి 4 వరకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారు. భోజన విరామ సమయంలో నిరసన, ప్రదర్శనలు చేపడతారు. జనవరి 21న రాష్ట్రవ్యాప్తంగా మౌన ప్రదర్శనలు, 23న అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు, 30న రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందించారు.
Updated Date - Oct 23 , 2024 | 03:38 AM