Maoist Attack: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ABN, Publish Date - Nov 22 , 2024 | 06:37 AM
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చిలో నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో (Telangana-Chhattisgarh Maoists) మావోయిస్టుల దుశ్చర్యలు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని వరసగా పెంచుకుంటూపోతున్నారు. తాజాగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు మరో దుశ్చర్యానికి పాల్పడ్డారు.
తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగొట్టారు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఉయిక రమేష్, అతని సోదరుడు అర్జున్‌ను ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు అతి కిరాతకంగా నరికి చంపారు. వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో నివాసం ఉంటున్న ఇరువురిని నిన్న(గురువారం) నరికి చంపారు. గురువారం అర్ధరాత్రి మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల ముందే నరికేశారు. ఈ సంఘటనలో అర్జున్ అక్కడిక్కడే మృతి చెందగా రమేష్ కొన ఊపిరితో ఉండగా గ్రామస్తులు 108లో ఏటురునాగారం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వాజేడు - వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంతక్క పేరిట మృతదేహాల వద్ద మావోయిస్టులు లేఖలను వదిలారు. ఏజెన్సీలో ఇన్‌ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మావోయిస్టుల దుశ్చర్యతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ఈ సంఘటనపై పోలీసుల ఆరా
ఇదిలావుండగా ఈ సంఘటనకు పాల్పడిన వారు ఎవరై ఉంటారన్న ప్రశ్న పోలీసుల్లో చర్చానీయాంశంగా మారింది. మావోయిస్టు క్యాడర్ ప్రత్యక్షంగా ఈ ఘటనకు పాల్పడిందా లేక వారి అనుచర మిలిటెంట్లు, సానుభూతి పరులుగానీ ఈ ఘటనకు పాల్పడి ఉంటారా అన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనకు ముందు కొన్ని రోజుల ముందు ఘటనా పరిసర ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా సమావేశాలు నిర్వహించారా అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. గతంలో మావోయిస్టులతో కలిసి పనిచేసి పలు ఘటనల్లో పాల్గొన్న వారిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
మావోయిస్టులను నిర్మూలించేందుకు వేగంగా చర్యలు..
మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చిలో నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. మావోయిస్టులను నిర్మూలించారు. జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం వరుసగా చర్యలు చేపడుతోంది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం కొద్దిగా ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీంతో ఇటీవల కాలంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వరుస ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. దాంతో మావోయిస్టులకు వరుస దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇంకోవైపు మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. జన జీవన స్రవంతిలో కలిసి.. దేశ నిర్మాణంలో భాగస్యామ్యం కావాలని మావోయిస్టులను రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సూచించిన విషయం విధితమే.
Updated Date - Nov 22 , 2024 | 09:42 AM