Year Ender 2024: ఈ ఏడాది నేరాలపై వార్షిక నివేదిక వెల్లడించిన హైదరాబాద్ సీపీ ఆనంద్..
ABN, Publish Date - Dec 22 , 2024 | 04:54 PM
2024 సంవత్సరంలో క్రైమ్ రేట్ కొంత పెరిగినా, ఈ ఏడాది ప్రశాంతంగా ముగిసిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 2024 వార్షిక నేర నివేదికను సీపీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది హోమ్ గార్డ్ నుంచి సీపీ వరకూ అందరూ కష్టపడ్డారని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్: 2024 సంవత్సరంలో క్రైమ్ రేట్ కొంత పెరిగినా, ఈ ఏడాది ప్రశాంతంగా ముగిసిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 2024 వార్షిక నేర నివేదికను సీపీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది హోమ్ గార్డ్ నుంచి సీపీ వరకూ అందరూ కష్టపడ్డారని, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. నేరం జరిగిన ఏడు నిమిషాల కన్నా తక్కువ సమయానికే ఘటన స్థలానికి చేరుకుంటున్నట్లు ఆనంద్ వెల్లడించారు.129 పెట్రోల్ కార్స్, 210 బ్లూ కోల్ట్స్, ఇంటర్ సెట్టర్ వాహనాలను విజిబుల్ పోలీసింగ్‌లో భాగస్వామ్యం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
2024 నమోదైన కేసులు ఇవే..
ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. " ఈ సంవత్సరం మొత్తం 35,944 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. గతేదాడి కంటే ఈసారి 45 శాతం ఎఫ్ఐఆర్‌ల నమోదు పెరిగింది. హత్యలు 13 శాతం తగ్గాయి, హత్యాయత్నం కేసులూ తగ్గాయి. కిడ్నాప్ కేసుల్లో 88 శాతం పెరుగుదల ఉంది. ఆస్తికి సంబంధించిన నేరాల్లో 67 శాతం పెరుగుదల ఉంది. నేరాలు డిటెక్ట్ చేసే పర్సంటేజ్ 59 గా ఉంది. రికవరీ శాతం 58గా ఉంది. 36 రకాల సైబర్ నేరాలు ఈ సంవత్సరం చూశాం. డిజిటల్ అరెస్టులు ఎక్కువ శాతం రిపోర్ట్ అవుతున్నాయి. 4,042 సైబర్ నేరాలను నమోదు చేశాం. పెట్టుబడుల మోసాలకు సంబంధించిన కేసులూ ఎక్కువగానే నమోదయ్యాయి. రూ.297 కోట్లు సైబర్ నేరాల్లో ప్రజలు పోగొట్టుకున్నారు. ఆ నగదులో రూ.42 కోట్లు రికవరీ చేశాం. సైబర్ నేరాల్లో 30 శాతం కేసు డిటెక్షన్ పెరుగుదల కనిపించింది. 500 మంది కన్నా ఎక్కువ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశాం. బ్యాంకింగ్ లోపాలు బ్యాంకర్ల పాత్రపైనా పూర్తిస్థాయి ఫోకస్ పెడతాం. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం. నార్కోటిక్ బ్యూరో బలోపేతం చేసి 322 కేసులు నమోదు చేశాం. 13.5 కోట్ల విలవైన డ్రగ్స్ పట్టుకున్నాం. 2,208 మంది పోకిరీలను షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. 250 కేసులు సీసీఎస్ ద్వారా నమోదు చేశాం.
రౌడీలపై ఉక్కుపాదం..
రూ.117 కోట్ల ప్రాపర్టీలను సీసీఎస్ ద్వారా అటాచ్ చేశాం. 49 లక్షల కేసులు ట్రాఫిక్ విభాగంలో నమోదు చేశాం. ఆపరేషన్ రోప్‌ను తీవ్రతరం చేశాం. మూడు కమిషనరేట్ల పరిధిలో 85 లక్షలకు వాహనాల సంఖ్య పెరిగింది. జీహెచ్ఎంసీ, లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారంతో ఆపరేషన్ రోప్‌ను విస్తృతంగా చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తాం. ప్రజాప్రతినిధులను ఈ కమిటీల్లో భాగస్వామ్యం చేసి ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తాం. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కట్టడి చేయడంలో టాస్క్‌ఫోర్స్ ముందుంది. రౌడీలపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది. ఐటీ విభాగాన్నీ బలోపేతం చేస్తాం. నేరాలు గుర్తించడంలో సీసీటీవీల పాత్ర కీలకం. వచ్చే సంవత్సరం పాడైన సీసీటీవీల స్థానంలో కొత్తవి పెడతాం. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ కోసం డ్రోన్స్ వినియోగిస్తాం. వచ్చే ఏడాది డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్‌నూ ఏర్పాటు చేస్తాం. ఏసీబీ కేసులో 30 మంది పోలీసులు వివిధ విభాగాల్లో సస్పెండ్ అయ్యారు.
రియల్ ఎస్టేట్ మోసాలు..
డిపాజిట్ పేర్లతో జరిగే రియల్ ఎస్టేట్ మోసాల్లో ప్రాపర్టీ అటాచ్మెంట్ చాలా త్వరగా చేస్తున్నాం. ఈ మోసాలపై రేరాతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ధన్వంతరి కేసులో 88 ప్రాపర్టీలను అటాచ్ చేశాం. ప్రాపర్టీ వేలం కోసం కోర్టులో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. వచ్చిన ప్రతి కేసునూ వెంటనే ఎఫ్ఐఆర్ చేయడంతోపాటు అరెస్టులు చేస్తున్నాం. 213 ట్రాఫిక్ సిగ్నల్స్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. అదనంగా 23 ట్రాఫిక్ జంక్షన్లు ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీకి సిఫార్సు చేశాం. ఈ ఏడాది గణేశ్ ఉత్సవాల తర్వాత సౌండ్ పొల్యూషన్‌పై చర్యలు తీసుకున్నాం. దీనికి నగరవాసుల నుంచి మద్దతు లభించింది. ముత్యాలమ్మ గుడి ఘటన తర్వాత నిరాశ్రయులను షెల్టర్ హోమ్‌కు తరలించాం. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు కోర్టు పరిధిలో ఉంది. దాని గురించి ఎక్కువగా కామెంట్ చేయలేను. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాట ఘటనపై పది నిమిషాల వీడియోను తయారు చేశామని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. ఆయన డైరెక్షన్‌లోనే బన్నీ నడుస్తున్నారంటున్న కాంగ్రెస్..
Updated Date - Dec 22 , 2024 | 04:55 PM