Share News

Year Ender 2024: ఈ ఏడాది సొంత ఇలాకాలో సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ

ABN , Publish Date - Dec 21 , 2024 | 09:44 AM

ఈ ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల ఇష్యూ ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ లగచర్ల రైతులు ఏకంగా అధికారులపైనే దాడికి యత్నించడంతో తీవ్ర సంచలనం రేపింది.

Year Ender 2024: ఈ ఏడాది సొంత ఇలాకాలో సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ
Lagacheral Attack Issue

ఈ ఏడాది లగచర్ల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్‌గా నిలిచింది. భూసేకరణకు వచ్చిన కలెక్టర్‌పైనే స్థానికులు దాడి చేయడం సంచలనానికి నాంది పలికింది. ఈ దాడిలో బీఆర్‌ఎస్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు రావడమే కాకుండా కొడంగల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర రచ్చకు దారి తీసింది. అలాగే లగచర్లలో పలువురు స్థానిక రైతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయిన రైతుల కుటుంబసభ్యులు ఢిల్లీకి వెళ్లి మరీ ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఫార్మా విలేజ్ విషయంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది.

పార్కు స్థలం కబ్జాకు యత్నం.. రంగంలోకి ‘హైడ్రా’


ఆగస్టులో నోటిఫికేషన్..

lagacharla-1.jpg

వికారాబాద్ జిల్లాలో పలు గ్రామాలను కలిపి ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల పరిధిలో 1358.37 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం సేకరించి ఇవ్వాలని టీజీఐఐసీ ఈ ఏడాది జూన్ 7 రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనికి అంగీకరిస్తూ ఆగస్టు 28 తాండూరు ఆర్డీవోకు భూ సేకరణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 11కు అనుగుణంగా పోలేపల్లిలో సర్వే నంబర్ 67లో 71.39 ఎకరాలు, లగచర్లలో 632.26 ఎకరాల పట్టా భూమిని సేకరిస్తామని ఆగస్టులో ఆర్డీవో పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.


కలెక్టర్‌పై దాడి.. ఉద్రిక్తం

lagacharla.jpg

అయితే ఫార్మా విలేజ్‌ ఏర్పాటును పోలేపల్లి, లగచర్ల గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం, దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నిర్వహించ తలపెట్టిన భూ సేకరణ కోసం ఈ ఏడాది నవంబర్ 11న అధికారులు లగచర్లలో ప్రజాభిప్రాయ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అది కాస్త రణరంగంగా మారింది. పోలెపల్లి, హకీంపేట్‌, పులిచర్ల కుంట తండా, రోటిబండ తండా, లగచర్ల గ్రామాల రైతులు సమావేశాన్ని బహిష్కరించి.. నిరసనగా లగచర్లలోనే ఉండిపోయారు. విషయం తెలిసిన అధికారులు రైతులతో మాట్లాడేందుకు లగచర్లకు వెళ్లారు. ఈ క్రమంలో భూసేకరణను వ్యతిరేకిస్తున్న అక్కడి ప్రజలు కలెక్టర్‌ అని కూడా చూడకుండా ఆయనపైనే దాడికి యత్నించారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, తాండూ రు సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలను ముందుకు తోస్తూ చాలా దురుసుగా వ్యవహరించారు. కలెక్టర్‌తో పాటు అక్కడి వచ్చిన అధికారులపై దాడికి పాల్పడటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు తీసుకువచ్చిన వాహనాలపై కూడా స్థానిక రైతులు దాడి చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకుచ్చారు. అధికారులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.


బీఆర్‌ఎస్ నేత అరెస్ట్..

patnam.jpg

ఈ దాడిపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి వెనక బీఆర్‌ఎస్ కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. దాడిలో ప్రధాన సూత్రధారిగా లగచర్లకు చెందిన సురేష్‌గా గుర్తించారు. దాడి సమయంలో సురేష్.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పలు మార్లు ఫోన్లో సంభాషించినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే ఈ దాడిలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందంటూ పోలీసులు తేల్చడంతో ఈ కేసు మరో మలుపుకు తిరిగింది. ఘటనకు ముందు.. ఆ తర్వాత కేటీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డును, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. తొలుత ఈ దాడి వెనక ప్రధాన సూత్రధారి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సురేష్ రాజ్‌ అని పేర్కొన్న పోలీసులు.. అనూహ్యంగా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ఏ-1గా చూపించారు. సురేష్ వెనక ఉంటూ.. కేటీఆర్‌ ఆదేశాలతో దాడికి కుట్ర చేసింది, కథ నడిపించింది నరేందర్‌రెడ్డి అని స్పష్టం చేశారు.


బెయిల్ మంజూరు... విడుదల

lagacharla-farmers.jpg

బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సురేష్ రాజ్‌ అని పేర్కొన్న పోలీసులు.. అనూహ్యంగా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ఏ-1గా చూపించారు. సురేష్ వెనక ఉంటూ.. కేటీఆర్‌ ఆదేశాలతో దాడికి కుట్ర చేసింది, కథ నడిపించింది నరేందర్‌రెడ్డి అని స్పష్టం చేశారు. దీంతో నవంబర్ 13న హైదరాబాద్‌ కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి.. కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షల తరువా కొడంగల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో పట్నంకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆయనను భారీ పోలీసు బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్‌ను కూడా హైదరాబాద్ మణికొండలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే లగచర్లకు చెందిన కొందరు స్థానిక రైతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిబంధనలు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ.. బెయిల్ ఇవ్వాలంటూ ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. ఇటీవలే పట్నం నరేందర్‌ రెడ్డితో పాటు లగచర్ల రైతులకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారు జైలు నుంచి విడుదలయ్యారు.


వెనక్కి తగ్గిన సర్కార్..

lagacharla-cm.jpg

మరోవైపు లగచర్ల బాధితులు ఢిల్లీకి వెళ్లి ఎన్‌హెచ్‌ఆర్సీని కలిసి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ఫిర్యాదు చేశారు. దౌర్జన్యంగా భూమిని లాక్కునేందుకు యత్నించగా.. తమ గ్రామస్తులు అడ్డుకోవడంతో వారి దాడి చేయడంతో పాటు అరెస్ట్ చేశారంటూ బాధితులు ఎన్‌హెచ్‌ఆర్సీ ముందు వాపోయారు. దీంతో ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ చేపట్టింది. మరోవైపు లగచర్ల భూసేకరణపై విపక్షాలు కూడా పూర్తి తప్పుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆందోళను చేపట్టాయి. ఈక్రమంలో లగచర్ల భూముల విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూసేకరణ విషయంలో సర్కార్ వెనక్కి తగ్గింది. లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అవే భూముల్లో స్థానికులకు ఉపాధి కల్పించేలా కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి డిసెంబర్ 1న మరో నోటిషన్‌ను రిలీజ్ చేసింది. లగుచర్ల, పోలేపల్లి, హకీంపేట పరిధిలో ఫార్మా విలేజ్ స్థానంలో మల్టిపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌కు సర్కార్ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమిని సమీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలియజేసింది. మొత్తానికి లగచర్ల ఫార్మా విలేజ్‌పై విడుదలైన నోటిఫికేషన్ రణరంగాన్ని సృష్టించింది.


మరిన్ని Year Ender 2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఇవి కూడా చదవండి...

మన్యంపై మక్కువ

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 10:45 AM